చిత్తూరు జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కొరత
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం
హోటళ్లకు ఆగిన కమర్షియల్ సిలిండర్ల సరఫరా
రంగంలోకి దిగిన జిల్లా జాయింట్ కలెక్టర్
గ్యాస్ ఏజెన్సీలతో అత్యవసర సమావేశం
కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించే వారిపై చర్యలకు ఆదేశాలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన రంగంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రామచంద్రన్ జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. గ్యాస్ సరఫరా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్యాస్ కొరత లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎవరైనా కృత్రిమ గ్యాస్ కొరత సృష్టిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఆసుపత్రులకు, ప్రభుత్వ హాస్టళ్లకు ఎలాంటి గ్యాస్ కొలత లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో జిల్లాలో గ్యాస్ వినియోగాన్ని నియంత్రితంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు సరఫరా అవుతున్న కమర్షియల్ సిలిండర్ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్లను అత్యవసర సేవలకు మాత్రమే వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వానికి చెందిన సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఇతర సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ ఆసుపత్రులు వంటి కీలక సేవా సంస్థలకు గ్యాస్ సరఫరాను కొనసాగించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అందుబాటులో ఉన్న సిలిండర్లను ఈ సంస్థలకు సర్దుబాటు చేస్తూ వంట కార్యక్రమాలు ఎక్కడా ఆగిపోకుండా చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా తీవ్రంగా తగ్గిపోవడంతో జిల్లాలోని అనేక హోటళ్లకు ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీంతో హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీగా వందలాది మంది వినియోగదారులకు ఆహారం అందించే హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చిన్నచిన్న ఫుడ్ స్టాళ్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి. ఈ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో అనేక హోటళ్లు తమ కార్యకలాపాలను పరిమితం చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కొందరు హోటల్ యజమానులు పరిమితంగా మాత్రమే వంటలు తయారు చేస్తుండగా, మరికొందరు తాత్కాలికంగా వ్యాపారాన్ని తగ్గించాల్సి వస్తోందని చెబుతున్నారు. చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ బండ్లపై ఈ ప్రభావం మరింతగా పడుతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రామచంద్రన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి జిల్లాలో గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న గ్యాస్ నిల్వలు, రోజువారీ సరఫరా స్థితి, వినియోగ అవసరాలు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై సమగ్రంగా చర్చించారు. యుద్ధ పరిస్థితుల వంటి సంక్లిష్ట సమయంలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా గ్యాస్ ఏజెన్సీలు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, సంక్షేమ వసతి గృహాలు, ఆసుపత్రులు వంటి కీలక సేవా సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని జేసీ గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టం చేశారు. విద్యార్థులు నివసించే హాస్టళ్లలో వంట కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాల్సిన అవసరం ఉందని, అలాగే ఆసుపత్రుల్లో రోగులకు అందించే ఆహార సేవలు ఎక్కడా ఆగిపోకుండా ఉండాలని సూచించారు. అందుబాటులో ఉన్న సిలిండర్లను ఈ సంస్థలకు ప్రాధాన్యంగా కేటాయించాలన్నారు. యుద్ధ పరిస్థితులను సాకుగా చూపి కొందరు గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసుకుని కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులకు కొన్ని ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. దీనిపై జాయింట్ కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ కొరతను ఉద్దేశపూర్వకంగా సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఏజెన్సీలపై లేదా డీలర్లపై ఫిర్యాదులు వచ్చిన పక్షంలో వాటిని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాలో పారదర్శకత ఉండాలని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పానీపూరి బండ్లు వంటి చోట్ల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించిన సందర్భాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జేసీ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై కూడా జాయింట్ కలెక్టర్ దృష్టి సారించారు. డెలివరీ బాయ్స్ వినియోగదారులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తే వాటిని తీవ్రంగా పరిగణించాలని ఏజెన్సీలకు సూచించారు. ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శంకర్‌తో పాటు పౌరసరఫరాల శాఖకు చెందిన ఇతర అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో గ్యాస్ సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం స్థానిక మార్కెట్లపై ఎలా పడుతుందో ఈ కమర్షియల్ గ్యాస్ కొరత స్పష్టంగా తెలియజేస్తోందని అధికారులు పేర్కొన్నారు. ప్రజల్లో అనవసర భయాలు, అపోహలు రాకుండా గ్యాస్ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.
గంగ జాయింట్ కలెక్టర్

