11, మార్చి 2026, బుధవారం

చిత్తూరు జిల్లాకు 229 హెల్త్ క్లినిక్ భవనాలు మంజూరు

జిల్లాకు రూ. 115 కోట్ల రూపాయలు మంజూరు

గ్రామీణ ఆరోగ్య సేవల బలోపేతానికి ప్రభుత్వ నిర్ణయం

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి చిత్తూరు జిల్లాలో 229 విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్లినిక్ భవనాల నిర్మాణానికి జిల్లాకు సుమారు రూ.115 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం గ్రామాల్లో తాత్కాలికంగా కొనసాగుతున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు శాశ్వత భవనాలు నిర్మించడంతో గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను నిర్మించనున్నారు. ఒక్కో క్లినిక్ నిర్మాణానికి సుమారు రూ.42 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. స్థలం విస్తీర్ణం, అవసరమైన మౌలిక సదుపాయాల ఆధారంగా నిర్మాణ వ్యయం మారవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ భవనాలు నిర్మితమైతే గ్రామస్థాయిలోనే ప్రాథమిక వైద్య సేవలు అందించే అవకాశం ఏర్పడుతుంది.

జిల్లాలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు తాత్కాలిక భవనాల్లో లేదా అద్దె గదుల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు శాశ్వత భవనాలు నిర్మించడంతో వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు చిన్నపాటి అనారోగ్య సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే వైద్య సేవలు పొందగలుగుతారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో ప్రాథమిక వైద్య సేవలతో పాటు 67 రకాల మందులు అందుబాటులో ఉంచనున్నారు. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు, చర్మ సంబంధిత సమస్యలు, అలర్జీలు వంటి చిన్నపాటి వ్యాధులకు అవసరమైన మందులు ఇక్కడే అందిస్తారు. దీంతో గ్రామీణ ప్రజలు చిన్న సమస్యల కోసం పట్టణాలకో, దూర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకో వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అదనంగా ఈ క్లినిక్‌లలో 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సదుపాయాలు కూడా కల్పించనున్నారు. రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించే పరీక్షలు కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్‌ఎం మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది సేవలందించనున్నారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు, పిల్లలకు టీకాలు, పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, రక్తపోటు మరియు మధుమేహం స్క్రీనింగ్ వంటి సేవలను కూడా ఈ క్లినిక్‌ల ద్వారా అందించనున్నారు. అవసరమైనప్పుడు రోగులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేసే విధానాన్ని కూడా అమలు చేస్తారు. చిత్తూరు జిల్లాలో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామస్థాయిలోనే వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు సమయం, ఖర్చు రెండూ ఆదా కావడంతో పాటు ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం పెరుగుతుందని వారు పేర్కొన్నారు. మొత్తంగా జిల్లాకు 229 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల మంజూరు గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరటనివ్వనుంది.


గంగ 1 విలేజ్ హెల్త్ క్లినిక్

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *