నేడే అన్నదాతకు ఆర్థిక సహాయం
అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 82.30 కోట్లు
పీఎం కిసాన్ యోజన కింద రూ. 33.51 కోట్లు
రూ. 115.81 కోట్లు రైతుల ఖాతాలలో జమ
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు కొంత ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా చిత్తూరు జిల్లాలోని లక్షలాది మంది రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు. రైతులకు సాగు పెట్టుబడుల కోసం అవసరమైన నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో రైతాంగంలో ఉత్సాహం నెలకొంది. జిల్లాలో మొత్తం 2,05,773 మంది రైతులకు రూ.115.81 కోట్ల ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద 2,05,753 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున మొత్తం రూ.82.30 కోట్లు జమ చేయనున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద 1,67,548 మంది రైతులకు రూ.33.51 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఈ రెండు పథకాల కలయికతో రైతులకు సాగు పెట్టుబడులకు కొంత ఊరట లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
గతంలో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయడానికి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని అప్పుల బారిన పడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు అందిస్తున్న పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కావడంతో అప్పుల భారాన్ని కొంత మేర తగ్గించుకునే అవకాశం ఏర్పడింది. రైతులు సకాలంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సాగు పనులను ప్రారంభించేందుకు ఈ నిధులు ఉపయుక్తంగా మారుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉద్యానవన పంటలు, వర్షాధార పంటలు మరియు పాడి పరిశ్రమపై రైతులు ఆధారపడుతున్నారు. కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో వేరుశనగ, టమాటా, మామిడి పంటలతో పాటు పాడి పరిశ్రమ విస్తృతంగా కొనసాగుతోంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులు, మార్కెట్‌లో ధరల అస్థిరత వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు ఒక్కోసారి తీవ్రంగా పడిపోవడం వల్ల రైతులు పంటను మార్కెట్‌కు తీసుకెళ్లి కూడా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మదనపల్లి ప్రాంతంలో ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ ఉన్నప్పటికీ ధరల హెచ్చుతగ్గులు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అదే విధంగా జిల్లాలో విస్తారంగా సాగు చేసే మామిడి పంటకు కూడా పల్పింగ్ పరిశ్రమల సిండికేట్ కారణంగా గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాధార పంట అయిన వేరుశనగ దిగుబడి కూడా వర్షాభావం కారణంగా తగ్గిపోతుండటంతో రైతులకు నష్టాలు ఎదురవుతున్నాయి. మరోవైపు పాడి పరిశ్రమలో ప్రైవేట్ డైరీలు తక్కువ ధరలకు పాలను సేకరిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రం అందిస్తున్న ఆర్థిక సహాయం రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. పంట సాగు ప్రారంభ దశలో ఈ నిధులు అందడం రైతులకు ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న రైతులకు ఇది అత్యంత అవసరమైన ఆర్థిక భరోసాగా నిలుస్తోంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం ద్వారా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడం పారదర్శకతకు దారితీస్తోంది. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకున్న అర్హులైన రైతులందరికీ ఈ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇంకా పథకంలో నమోదు కాని అర్హులైన రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వివిధ సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ఈ ఆర్థిక సహాయం కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సాగు ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అందిస్తున్న ఈ మద్దతు రైతులకు ధైర్యాన్ని నింపుతోందని రైతు సంఘాల ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్న ఈ నిధులు చిత్తూరు జిల్లా రైతాంగానికి కొంత ఆశాకిరణంగా నిలుస్తాయని భావిస్తున్నారు.

