పంచాయతీ గదుల సాధనానికి డిపిఓ ఆదేశాలు
ఆంధ్రప్రభ వార్తకు స్పందన
స్వాధీనం చేసుకున్న గదులను వేల వేయాలని ఆదేశం
పంచాయతీకి జరిగిన నష్టాన్ని రాబట్టాలని స్థానికుల డిమాండ్
చిత్తూరు, సెప్టెంబర్ 29 (ఆంధ్రప్రభ బ్యూరో) : పెనుమూరు గ్రామ పంచాయతీలో ఆక్రమణకు గురైన ఆరు పంచాయతీ గదులను స్వాధీనం చేసుకోవలసిందిగా జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి జారీ చేసిన ఆదేశాలు సోమవారం పెనుమూరు గ్రామ కార్యదర్శికి అందాయి. గదులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా వెంటనే గదులను వేలం వేయాలని జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. 2007 వ సంవత్సరం అప్పటి లోక్ సభ సభ్యుడు ఎన్ రామకృష్ణా రెడ్డి కేటాయించిన నిధులతో పెనుమూరు పంచాయతీ సంత గేటు స్థలంలో ఆరు గదులు నిర్మించారు. అయితే అందులో మూడు గదులను ఒక టిడిపి నాయకుడు హస్తగతం చేసుకుని ప్రైవేటు వ్యక్తులకు బాడుగకు ఇచ్చాడు. మరో మూడు గదులను నామమాత్రపు ధరకు పంచాయతీ వారి నుంచి వేలంలో పాడుకుని అధిక ధరలకు ఇతరులకు బాడుగకు ఇచ్చారు. దాదాపు 18 ఏళ్లపాటు ఈ అక్రమం జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఈ విషయం తెలిసిన ఆంధ్రప్రభ ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ప్రభుత్వ షాపింగ్ గదులు అనే శీర్షికన ఏప్రిల్ 8వ తారీఖున ప్రత్యేక కధనం ప్రచురించింది. దీనితో జిల్లా అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణదారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కాగా 18 సంవత్సరాలు అద్దెలు వసూలు చేసిన నాయకునిపై క్రిమినల్ కేసులు పెట్టి నష్టపరిహారం రాబట్టాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలు కూడా ఒక నాయకుడు స్వాధీనంలో ఉంచుకున్నాడని కొందరు గ్రామస్తులు తెలిపారు. దీనిపై తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటివరకు గ్రామ పంచాయతీకి జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా వసూలు చేయాలని స్థానికులు కోరుతున్నారు

