స్మార్ట్ రేషన్ కార్డుల మ్యాపింగ్ అస్తవ్యస్తంగా ఉండటంతో లబ్ధిదారులు కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని స్మార్ట్ రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల బంధుత్వం వద్ద ఇతరులు అని ముద్రించగా మరికొన్ని కార్డుల్లో అడ్రస్ స్థానంలో అర్థం లేని అక్షరాలు ప్రింట్ చేశారు. మరికొన్ని కార్డులలో ఇంటి యజమాని ఫోటో సరిగా కనిపించని పరిస్థితులు కూడా ఉన్నాయి. కుటుంబసభ్యుల వివరాలు తప్పుగా నమోదు, అడ్రస్ గల్లంతవడం, బంధుత్వాల నమోదులో తప్పులు దొర్లాయని కొన్ని చోట్ల లబ్ధిదారులు వాపోతున్నారు. వీటికి తోడు మహిళల పేరుతో రేషన్ కార్డులు జారీ చేస్తారు. కుటుంబ పెద్ద మహిళ పేరును పేర్కొనాల్సి ఉంటుంది. అయితే కొన్నిచోట్ల పురుషుల పేరుతో స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చినట్లు తెలిసింది. అలాగే ఊరు, మండలం పేర్లల్లోనూ తప్పులు దొర్లినట్లు తెలిసింది. దీంతో రేషన్ కార్డులలో తప్పులు ఉంటే సంక్షేమ పథకాలకు దూరమవుతామనే ఆందోళన వారిలో నెలకొంది.
రేషన్ తీసుకోవటంలో ఇబ్బందులను పరిష్కరించడంతో పాటుగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల జారీని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఆగస్ట్ 31వ తేదీ నుంచి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే రేషన్ తీసుకున్న వివరాలు తెలిసేలా డిజైన్ చేశారు. అయితే స్మార్డ్ రేషన్ కార్డులు అందుకున్న కొంతమంది రేషన్ కార్డుదారులను పాత సమస్యలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ తప్పులపై స్పందించారు. స్మార్ట్ రేషన్ కార్డుల వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లితే సంబంధిత సచివాలయాలను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రింటింగ్ సమస్యలు ఉంటే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని తప్పులు సరిచేసుకోవచ్చని సూచిస్తున్నారు. మీ స్మార్ట్ రేషన్ కార్డులలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సచివాలయ సిబ్బందిని సంప్రదించి పరిష్కరించుకునే వీలుందని చెప్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డు జిరాక్స్ తో పాటు ఆ కార్డులో ఏమి తప్పులు దొర్లాయి? ఏ విధంగా సరిచేయాలి అనే విషయాన్ని విపులంగా దరఖాస్తులో వివరించాలని కోరారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సరిచేసి కొత్త రేషన్ కార్డులను మళ్లీ జారీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులో ఎలాంటి తప్పులు ఉన్న ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. వాటిని సరిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అయితే వినియోగదారులు తగిన విధంగా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.