మహిళలకు వరం స్వాస్థ్ సశక్త్ పరివార్ అభియాన్
మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం
మహిళలకు పరీక్షలు చేసి, మందులిస్తారు
మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ వినూత్న కార్యక్రమం
17వ తేదీ నుంచి 15 రోజుల పాటు నిర్వహణ
మహిళలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్న సిబ్బంది
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఆరోగ్యవంతమైన మహిళ శక్తిమంతమైన కుటుంబం అనే నినాదంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వాస్థ్ సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇంటింటా స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. అతివలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబరు 2 వరకు గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు అన్ని చోట్లా శిబిరాలను నిర్వహించేందుకు స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ విషయమై అన్ని జిల్లాల వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వర్చువల్‌గా సమావేశమై ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఆదేశాలిచ్చారు. రెండు రోజుల కిందట ఈ పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ భోపాల్ లో ప్రారంభించగా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ప్రారంభించారు. గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమం గ్రామ సచివాలయం నుంచి జిల్లా కేంద్రాల వరకు కొనసాగుతుంది.
వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని మహిళలకు పక్షం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌ను ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు సిద్ధమైంది. ఆరోగ్య మహిళ, ఎన్‌సీడీ సెంటర్లు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లతో పాటు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి ఏడాది సెప్టెంబరులో నిర్వహించే పోషణ్ మా ప్రొగ్రామ్ కూడా ఈ కార్యక్రమాలతో కలిసి ఈసారి కొనసాగనుంది. దీనిని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 15 రోజుల పాటు ఈ స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ సచివాలయాలు నుంచి జిల్లా హాస్పిటల్స్, బోధనాసుపత్రుల పరిధిలోని మహిళలకు ఈ సేవలు అందించాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మారిన జీవనశైలి, వాతావరణం కారణంగా కొంతమంది మహిళలు పలు వ్యాధులు భారిన పడుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులు. అందువల్ల వారికి వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స, మందులు అందిస్తారు. వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా మహిళల అనారోగ్య సమస్యలను గుర్తించి వాటికి చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పథకంలో అధిక రక్తపోటు(హైబీపీ), మధుమేహం(షుగర్), ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తదితర పరీక్షలు చేపట్టనున్నారు.
రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి యుక్త వయసు అమ్మాయిలకు, మహిళలకు అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. క్షయ బారిన పడే ప్రమాదం ఉన్న మహిళలను గుర్తించి టీబీ పరీక్షలను చేయనున్నారు. గిరిజన ప్రాంతాల్లో సికెల్ సెల్ ఎనీమియా (కొడవలి కణ రక్తహీనత) పరీక్షలతోపాటు సికెల్ సెల్ డిసీజ్ కార్డులను అందించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. మెడికల్ కాలేజీల్లో పనిచేసే గైనకాలజీ, నేత్ర, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్ తదితర వైద్యుల శిబిరాల్లో మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారు. కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మార్గదర్శకాల్లో సూచించారు. యువతులకు పలు ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహన కల్పించనున్నారు. గర్భిణులకు మదర్ అండ్ ఛైల్డ్ ప్రొటెక్షన్ కార్డులను అందిస్తారు. పోషకాహారంపై తగిన అవగాహన, కౌన్సెలింగ్ చేస్తారు. పిల్లల్లో సికిల్‌సెల్ ఎనీమియా ఉన్నట్లయితే దాన్ని గుర్తిస్తారు. చిన్నారులు, గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. యుక్తవయసు బాలికలకు శుభ్రత గురించి వివరిస్తారు. అయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను అందిస్తారు. ప్రతీ పీహెచ్‌సీకి వైద్యశిబిరాల నిర్వహణకు ఒక్కో నోడల్ అధికారి ఉంటారు. పిల్లల వైద్య నిపుణులు, గైనకాలజిస్టులు, చర్మవ్యాధి నిపుణులు, జనరల్ మెడికల్ అధికారులు ఇందులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్డులు, 70ఏళ్లు దాటిన వారికి వయో వందన కార్డుల జారీకి వివరాలను ఇందులో నమోదు చేసుకుంటారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

