నానో యూరియా వాడకమే రైతన్నకు లాభదాయకం
నానో యూరియా వాడితే ప్రభుత్వం నుండి రూ. 800 ప్రొత్సాహకం
ఖర్చు తక్కువ ప్రయోజనం ఎక్కువ
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. యూరియా కోసం పలుచోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. రైతుల అవసరాలకు సరిపడా యూరియా లభించడం లేదు. ఈ నేపద్యంలో నానో యూరియా వాడకం తెర మీదకు వచ్చింది. రెండు రోజుల పాటు అమరావతిలో మఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో నానో యూరియా మీద చర్చ జరిగింది. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. యూరియా వినియోగం పెరిగితే క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా వినియోగం ఎక్కువైతే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందోననడానికి పంజాబ్ రాష్ట్రం ఓ కేస్ స్టడీ అని సీఎం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం క్యాన్సర్ కేసుల్లో టాప్-5లో ఉందని యూరియా వినియోగం మరింతగా పెరిగితే.. టాప్-1కు వెళ్లిపోతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో యూరియా వాడకం తగ్గించే అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. ఇదే సందర్భంలో యూరియా వినియోగం తగ్గించిన రైతులకు ప్రొత్సహకాలిచ్చే విధానం తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. యూరియా వినియోగం తగ్గిస్తే పీఎం ప్రణామ్ కింద బస్తాకు రూ. 800ను ప్రొత్సాహకంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందనీ, రైతులకు ఇవ్వడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కంటే రైతులకు ఇవ్వడం ముఖ్యమమన్నారు. రాష్ట్రానికి వచ్చే సబ్సిడీని రైతులకే ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు యూరియా కష్టాల నుంచి బయటపడేసేందుకు నానో యూరియాపై రైతుల్లో విసృతంగా అవగాహన పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. యూరియా బస్తాలను మోసుకెళ్లే పనిలేకుండా.. జస్ట్ అర లీటరు నానో యూరియా వాడితే సరిపోతుంది అంటున్నారు. కేవలం రూ.225కు కొనుగోలు చేయవచ్చు. ఇది పంటలకు పోషకాలను అందిస్తుంది. వరి, పత్తి వంటి పంటలపై నానో యూరియా పిచికారి చేయొచ్చంటున్నారు. రాష్ట్రంలో రైతులకు అవగాహన కల్పిస్తుండటంతో నానో యూరియా వాడకం బాగా పెరిగింది. నానో యూరియా వాడకం రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ఇది పైరుకు పోషకాలను అందిస్తుంది.. రైతులు దీనిని ఉపయోగించి మంచి దిగుబడి పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు యూరియా వాడకం విషయంలో ఇంకా పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు. నానో యూరియాతో ఉపయోగం ఉన్నా సరే ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. వ్యవసాయానికి సంబంధించి శాస్త్రవేత్తలు యూరియాకు బదులుగా నానో యూరియా వాడమని సూచిస్తున్నారు. సాధారణ యూరియా బస్తాలో ఉండే పోషకాలు, అర లీటరు నానో యూరియాలో ఉంటాయంటున్నారు. యూరియా గుళికల రూపంలో ఉంటే.. నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది. సాధారణంగా రైతులు ఉపయోగించే యూరియాలో కణాల పరిమాణం 2.8-4 మిల్లీ మైక్రాన్లు ఉంటే.. అందులో మొక్కకు 30 శాతం వరకు మాత్రమే చేరుతుంది. మిగిలిన యూరియా వృథానే (నీటిలో, భూమిలో కలిసి కాలుష్యం చేస్తుంది) అంటున్నారు. అదే నానో యూరియా కణాల పరిమాణం 32 నానో మైక్రాన్లు ఉంటుంది.. ఏకంగా 80 శాతం పైగా మొక్కకు చేరుతుంది అంటున్నారు.. నానో యూరియా వల్ల వృథా ఉండదు, కాలుష్యం కూడా తగ్గుతుందంటున్నారు. రైతులు ఉపయోగిస్తున్న సాధారణ యూరియా వేర్ల ద్వారా మొక్కకు అందడానికి ఆలస్యం అవుతుంది. నానో యూరియా జస్ట్ అలా మొక్కల ఆకులపై పిచికారి చేయగానే నేరుగా పత్రహరితానికి చేరి వెంటనే ప్రభావం చూపిస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్క ఎకరాకి జస్ట్ అర లీటర్ నానో యూరియా చాలు.. దీన్ని లీటర్‌కు 4 ఎంఎల్ చొప్పున 120 లీటర్ల నీటిలో కలపాలని సూచిస్తున్నారు. దీనిని డ్రోన్ ద్వారా అయితే కనుక ఎకరానికి 350-400 ఎంఎల్ సరిపోతుంది. యూరియా బస్తా (45 నుంచి 50 కిలోలు) ధర రూ.266 ఉండగా.. వ్యాపారులు రూ.100 అదనంగా వసూల చేస్తే మొత్తం రూ.366 పడుతుంది. రవాణా ఖర్చు నుంచి పొలంలో చల్లేందుకు కలిపి బస్తాకు మొత్తం ఖర్చు రూ.700 వరకు అవుతుంది. దీని బదులుగా నానో యూరియా అర లీటర్ రూ.225కే వస్తుంది. బస్తాలు మోయాల్సిన పని కూడా లేదు. తక్కువ ఖర్చులోనే నాన యూరియాను ఉపయోగించొచ్చు. రైతులు ఉపయోగించే యూరియా గుళికల వల్ల మొక్కలు పచ్చగా అవుతాయి.. నానో యూరియా ఉపయోగిస్తే మొక్కలు పచ్చగా రావు. ఈ అపోహ వల్లే చాలామంది రైతులు నానో యూరియా ఉపయోగించడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. నానో యూరియాను పూత, గింజ దశలో పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. నానో యూరియా, నానో జింక్ కూడా పిచికారీ చేసుకోవచ్చు అంటున్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ ద్వారా నానో యూరియా వాడకంపై రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

