అక్రమ ఇళ్ల కూల్చివేతకు నోటీసులు
ఆందోళనలో దాసరాపల్లె ప్రజలు
కోర్టులో స్టే కోసం ప్రయత్నాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దాసరా పల్లెలో మేత బీడు పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించాలని నివాసితులకు తహసీల్దారు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర హై కోర్టు తీర్పు మేరకు ఆయన నోటీసులు ఇచ్చారు. దీనిపై 90 మంది ఇళ్ల యజమానులు గత సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలసి కూల్చి వేతలను ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు ఆదేశాలను అడ్డుకునే అధికారం అధికారులకు లేనందున స్టే తెచ్చుకోవడమే మార్గమని న్యాయనిపుణులు సలహా ఇవ్వడంతో గ్రామస్తులు హై కోర్టులో స్టే కోసం ప్రయత్నం చేస్తున్నారు.
వివరాలలోకి వెళితే చార్వాకని పల్లె సర్వే నెంబర్ 7 లో 17.20 ఎకరాల మేత బీడు పోరంబోకు భూమి ఉంది. ఇందులో గత 30 ఏళ్ల క్రితం కొందరు ఇళ్ళు కట్టుకున్నారు. గత వైసిపి పాలనలో ప్రభుత్వం ఈ భూమిలో నవరత్నాలు – పేదలు అందరికి ఇల్లు పథకం కింద ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని నిర్ణయించింది. అయితే అదే గ్రామానికి చెందిన మిట్టపల్లి సతీశ్ రెడ్డి 2921లో దీనిపై అభ్యంతరం లేవదీసి హై కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ప్రజల ప్రయోజనం కోసం కేటాయించిన మంద బీడు భూమిలో ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టవిరుద్ధమని వాదించారు. దీనితో కోర్టు యదా తద స్తితి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం తెలిసిన అప్పటి జి డి నెల్లూరు ఎమ్మెల్యే, ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి దాసరా పల్లె వెళ్ళి గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర క్యాబినెట్ ద్వారా ఈ భూమిని డీ నోటిఫై చేసి, పట్టాలు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు నివేదించారు. అయితే ప్రజా ప్రోజనాలకు కేటాయించిన మేత బీడు భూములను డీ నోటిఫై చేయడం చెల్లదని న్యాయమూర్తి రవి చీమలపాటి 2024 నవంబర్ 28 న తీర్పు వెలువరించారు. ఈ భూమి మేత బీడు కాబట్టి, ఎలాంటి ఇళ్ల స్థలాల కేటాయింపులు చేయరాదని స్పష్టం చేశారు. దీనిని కమ్యూనిటీ ప్రయోజనాల కోసం ఉంచాలని చెప్పారు. డీ-నోటిఫికేషన్ చేసి ఇళ్లకు కేటాయించడం కూడా చెల్లదని అన్నారు. ఇప్పటికే ఆక్రమణలు జరిగి ఉంటే, తహసీల్దార్ వాటిని గుర్తించి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులను సతీష్ రెడ్డి తరఫున న్యాయవాది పసల పొన్నారావు, ప్రభుత్వం తరఫున కృష్ణ యశస్వి వాదించారు.
పో రై గంగ 3 దాసరాపల్లెలో చిన్నస్వామి ఇంటికి నోటీసులు అంటిస్తున్న రెవెన్యూ సిబ్బంది

