అక్రమ మైనింగ్ పై జిల్లా కలెక్టర్ కు టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు.
టిడిపిలో వర్గవిభేదాలు బట్టబయలు
టిడిపి అధిష్టానంకు కూడా ఫిర్యాదు
వైసిపి నుండి వచ్చిన వాళ్ళు ప్రకృతి వనరులను దోచుకుంటున్నారని ఆవేదన
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ క్లైమాక్స్ కు చేరుకున్నది. ఆఖరికి టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు రంగంలోకి దిగారు. పాలసముద్రం మండలంలో క్వారీ లైసెన్సు పొందిన కె జె మురళి అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై చిట్టిబాబు చిత్తూరు కలెక్టర్ కు వివరణాత్మక ఫిర్యాదు చేశారు. వనదుర్గపురం గ్రామంలో ఆమోదించబడిన మైనింగ్ ప్లాన్, పర్యావరణ క్లియరెన్స్ మరియు కాలుష్య నియంత్రణ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. దీనిపై సంబంధిత సంతలు పలు అభ్యంతరాలు కూడా తెలిపారన్నారు.
పాలసముద్రం మండలంలో 13 పంచాయతీలు, 25,000 మంది జనాభా ఉన్నారని తెలిపారు.ఈ ప్రాంతం పచ్చని కొండలు, గొప్ప వృక్షసంపదతో చిత్తూరు కోనసీమ అనే పేరు వచ్చిందన్నారు. విస్తృతమైన కొబ్బరి తోటలు, మామిడి తోటలు, చెరకు పొలాలు, వరి సాగు, కూరగాయల పెంపకంతో వ్యవసాయం స్థానిక ఆర్థిక వ్యవస్థను ఆధిపత్యం చేస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో ఆరు శతాబ్దాల నాటి శివాలయం, ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ మర్రిచెట్టు వంటి ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయన్నారు. పర్యాటక సంత ఆమోదించిన 3-స్టార్ హాలిడే రిసార్ట్ ఉందన్నారు. ప్రశాంతమై ఈ ప్రాంతం అక్రమ మైనింగ్ మాఫియా వల్ల కాలుష్యం కోరల్లోకి వెళ్ళి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వనదుర్గాపురం గ్రామంలోని సర్వే నెంబర్ గ్యాప్ ఏరియాలో 4.900 హెక్టార్ల విస్తీర్ణంలో పనిచేస్తున్న మైనింగ్ లీజు యజమాని కె.జె. మురళి అడుగడుగున ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్, గ్రావెల్, ఆర్డినరీ ఎర్త్ మరియు బ్యాలస్ట్ కోసం ఉద్దేశించిన మైనింగ్ కార్యకలాపాలలో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. మైనింగ్ ప్లాన్, ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనలను విస్మరించారని చెప్పారు. గేట్ వెలుపల ప్రమాదకర రసాయనాలు లేదా కాలుష్య వివరాలను ప్రదర్శించకూడదని
సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా, పట్టించుకోవడం లేదన్నారు. అలాగే ప్రజల, పర్యావరణ రక్షణ చర్యలు తీసుకోలేదని చెప్పారు. పెద్ద వాహనాలలో పరిమితికి మించిన గ్రావెల్ రవాణా చేస్తున్నారని, వివిధ ప్రభుత్వ శాఖలకు చెల్లించాల్సిన రుసుములు చెల్లించడం లేదని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్మాణానికి ఉపయోగించవలసిన గ్రావెల్, ఇసుకను చెన్నైకి తరలించి కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనితో ఇప్పటి వరకు ఒక ప్రజాప్రతి నిధి, చిట్టిబాబుకు మధ్య జరుగుతున్న పరోక్ష పోరు బహిరంగం అయ్యిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుడైన కె జె మురళికి ఇప్పుడు టిడిపి ప్రజాప్రతినిధి వత్తాసు పలుకుతున్నరని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లారు. వైసిపి నుంచి వచ్చిన కొందరు అధికార ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న క్వారీల అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నారు.

