22, సెప్టెంబర్ 2025, సోమవారం

ఎమ్మెల్యేగా థామస్ ను అనర్హుడిగా ప్రకటించాలి

హై కోర్టులో సతీష్ రెడ్డి  రిట్ పిటిషన్ దాఖలు 
విచారణకు స్వీకరించిన హైకోర్టు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: తెలుగు దేశం పార్టీకి చెందిన  గంగాధర  నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ను తక్షణం పదవి నుంచి తొలగించాలని, సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కో వారంటో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వు చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ నియోజకవర్గంలో నుంచి గెలుపొందిన డాక్టర్ ఎం వి థామస్ క్రిస్టియన్ అని, కావున అతనిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఇందుకు అవసరమైన ఆధారాలను కోర్టు సమర్పించారు. కోర్టు విచారణకు స్వీకరించి డబ్ల్యూ.పి. నెంబర్ 26148/2025 కేటాయించింది. కేసులో సురేష్ కుమార్ న్యాయవాదిగా వ్యవహరిస్తారు.

2024 ఎన్నికల్లో డాక్టర్ వి ఎం థామస్ అనే వడింగాడు  మునస్వామి థామస్  క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ, తాను హిందూ షెడ్యూల్డ్ కులానికి చెందినవాడినని తప్పుడు హోదా చూపించి  పోటీ చేసి గెలిచారని పిటిషనర్ ఆరోపించారు. ఆయన క్రైస్తవ మతం స్వీకరించినట్టు తమిళనాడు గెజిట్‌లో ప్రకటించారని తెలిపారు. దీని ఆధారంగా తాను నామినేషన్ సమయంలో ఎన్నికల సంఘం, కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద  అభ్యంతరాలు తెలుపని చెప్పారు.
జాతీయ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ విషయమై అనేక ఫిర్యాదులు, ఆధారాలు సమర్పించినప్పటికీ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, అర్హత లేని అభ్యర్థి ఒక ఎస్సీ రిజర్వు సీటును ఆక్రమించాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 జూన్ రెండవ వారంలో ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు  థామస్ తిరుమల దర్శనం చేసుకునే సందర్భంలో తాను అన్య మతస్తుడునని డిక్లరేషన్ ఇచ్చారని తెలిపారు. థామస్ చర్య  భారత రాజ్యాంగాన్ని, ఎస్సీ హిందూ సమాజాన్ని మోసం చేయడమేనని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 330, 332, 335, 338, 338ఏ, 339, 341, 342,  1950 అధ్యక్ష ఉత్తర్వులో స్పష్టంగా చెప్పినట్లుగా పేర్కొన్నారు. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం తప్ప ఇతర మతాన్ని అనుసరించే వారు ఎస్సీ హోదా పొందలేరని వివరించారు. ఇది కేవలం వ్యక్తిగత మోసం మాత్రమే కాదని, అఖిల షెడ్యూల్డ్ కుల హిందూ సమాజాన్ని మోసం చేయడం అన్నారు. మతమార్పిడి చేసుకున్న వారు రెండు ప్రయోజనాలు పొందలేరని అన్నారు.  ఒకవైపు మైనారిటీ హక్కులు, మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లు అనేది రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపారు. ఇది పేద ఎస్సీ హిందువుల హక్కులను దోచుకోవడంగా వర్ణించారు. ఇందులో వ్యక్తిగత ప్రయోజనం ఏ మాత్రము లేదని, ఎస్సీ హిందూ సమాజానికి న్యాయం జరగాలని ఈ పోరాటం చేస్తున్నానని పిటిషనర్ సతీష్  పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను కో వారంటో రిట్ గా స్వీకరించి, ఆయనను ఎమ్మెల్యే  పదవికి అనర్హునిగా ప్రకటించి, తక్షణమే పదవి నుంచి తొలగించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసు భవిష్యత్తులో ఒక చారిత్రాత్మక తీర్పుగా నిలిచి, ఎస్సీ హక్కులను రక్షించి, మతం మారిన వారు రిజర్వేషన్లను దుర్వినియోగం చేయకుండా నిరోధిస్తుందని సతీష్  ఆశాభావం వ్యక్తం చేశారు.

గంగ 1 ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *