20, సెప్టెంబర్ 2025, శనివారం

అర్థాంతరంగా ఆగిన చెరువుల అనుసంధనం పనులు

వృధాగా సముద్రంలో కలుస్తున్న మిగులు జలాలు 

ఆవేదన చెందుతున్న పూతలపట్టు, జీడి నెల్లూరు రైతులు

ఇప్పటికైనా ప్రభుత్వం కరుణించాలని వేడుకోలు  


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


 ఎన్టీఆర్ జలాశయం నుంచి పరిసర ప్రాంతాల్లోని చెరువులను అనుసంధానించి, మిగులు జలాలను చెరువులకు తరలించి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యం నెరవేరలేదు. ఫలితంగా ఎన్టీఆర్ జలాశయం నిండిన తర్వాత నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తుండడంతో గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గ  రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జలాశయం నుంచి వృధాగా పోతున్న నీటిని చెరువులకు మళ్ళించాలని ఈ ప్రాంత ప్రజలు చాలాకాలంగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు సక్రమంగా స్పందించకపోవడంతో ఈ పథకం ప్రారంభానికి మాత్రమే పరిమితమైంది. 34 చెరువులకు లింక్ చానల్ ద్వారా నీటిని నింపాల్సిన బృహత్తర పధకం ఒకే ఒక చెరువుకే పరిమితమైంది. 


చిత్తూరు నగరానికి తాగునీటిని అందించే లక్ష్యంతో 2004 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎన్టీఆర్ జలాశయాన్ని నిర్మించింది. జలాశయంలో మిగులు జలాలను కాలువల ద్వారా పరిసర ప్రాంతాల్లో ఉన్న సాగునీటి చెరువులకు తరలించడం వల్ల చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో చెరువుల అనుసంధానం పథకాన్ని ప్రారంభించారు. పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 34 చెరువులకు ఎన్టీఆర్‌ జలాశయం నుంచి నీటిని తరలించేందుకు వీలుగా చెరువుల అనుసంధాన కార్యక్రమం రూపొందించారు. గత ప్రభుత్వం చేపట్టిన చెరువుల అనుసంధానం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఒక చెరువుకు మాత్రమే నీరు అందే స్థాయిలో పనులు పూర్తవడంతో మిగిలిన చెరువులకు నీరు చేరడం లేదు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన ఎన్టీఆర్‌ జలాశయం నుంచి నీరు వృథాగా పోతోంది. భీమా, బహుదా నదుల కలయిక ప్రాంతంలో చిత్తూరు నగరానికి తాగునీటిని అందించే లక్ష్యంతో 1997 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎన్టీఆర్‌ జలాశయ నిర్మాణాలు ప్రారంభించి 2004 సంవత్సంరలో పూర్తి చేసింది. చిత్తూరుకు తాగునీటితోపాటు గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలోని 34 చెరువులను నింపేలా 2004 సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయల ప్రతిపాదనలతో టెండర్లు పూర్తి చేసినా పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వాలు మారడంతో 13 సంవత్సరాల పాటు చెరువుల అనుసంధాన కార్యక్రమం అమలుకు నోచుకోలేదు. 2017 సంవత్సరంలో చెరువుల అనుసంధానం పనులకు మోక్షం లభించింది. మొదటి విడతగా నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కాలువ పనులను 8 రీచ్​లుగా విభజించి గుత్తేదారుకు అప్పగించారు. గంగుపల్లె చెరువు వరకు ఐదు రీచ్ పనులు పూర్తయ్యాయి. 6వ రీచ్ కాలువ పనులు మధ్యలో నిలిపివేశారు. దీంతో చెరువుల అనుసంధాన కార్యక్రమం గంగుపల్లె చెరువు వరకే పరిమితమైంది. ఆరో రీచ్ పనులు మధ్యలో ఆగిపోగా.. ఏడు, ఎనిమిది ప్యాకేజీల పనులు పూర్తయ్యాయి.  ఎన్టీఆర్ జలాశయము రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిండుతుంది. నిండిన సమయంలో ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి గంగాధర నెల్లూరు శాసన సభ్యురాలిగా మంత్రిగా పనిచేసిన గుమ్మడి కుతూహలమ్మ  ఈ పథకానికి రూపకల్పన చేశారు. ప్రభుత్వం కూడా ఆమోదించి టెండర్లు పిలిచి పనులను ప్రారంభించింది. ప్రభుత్వాలు మారడం గుత్తేదారులకు డబ్బులు మంజూరు కాకపోవడంతో ఈ పని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇటీవల కాలంలో గంగాధర్ నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ చెరువుల అనుసంధాన విషయాన్ని తీసుకొన వెళ్లారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఆరో రీచ్‌ పనులు పూర్తయితే 33 చెరువులకు నీరు చేరే అవకాశం ఉందని.. ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *