జి.డి. నెల్లూరు టిడిపిలో గందరగోళం
చంద్రబాబు అసహనం
అధిష్టానం జోక్యం తప్పదా?
అధ్యక్షులను నియమించనున్న అధిష్టానం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులో గంగాధర నెల్లూరు నియోజకవర్గ టిడిపి నియోజకవర్గ రాజకీయాలు గందరగోళంగా మారాయి. రాష్ట్రం మొత్తం మీద అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజాస్వామ్యబద్దంగా మండల పార్టీ అధ్యక్షులు నియామకం జరిగింది. అయితే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాత్రం ఈ వ్యవహారం ఇప్పటివరకు పూర్తి కాలేదు. నియోజకవర్గంలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోవడంతో పప్రతిష్టంభన కొనసాగుతోంది. నియోజకవర్గంలో సంస్థగత ఎన్నికలను నిర్వహించడానికి తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని అధిష్టానం నియమించినా, ఎన్నికల వ్యవహారం కొలిక్కి రాలేదు. స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ డాక్టర్ ఎంవి థామస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రికి, యువనేత లోకేష్ కు, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తాను చెప్పిన వారిని మండల పార్టీ అధ్యక్షులుగా నియమించాలని ఎమ్మెల్యే పట్టుపడ్తూన్నారు. ఎమ్మెల్యే చెప్పిన వారిని అధ్యక్షులుగా నియమిస్తే, నియోజకవర్గంలో తిరుగుబాటు తప్పదని ఆయన వ్యతిరేక వర్గం బహిరంగంగా ప్రకటించింది. దీంతో ఇరు వర్గాలను సమన్వయ చేయడం అధిష్టానానికి కత్తి మీద స్వాముల మారింది.
మే నెలలో ప్రారంభమైన మండల కమిటీ ఎన్నికల ప్రక్రియ నియోజకవర్గంలో ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. అనేక మలుపులు తిరుగుతున్నా, ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ఆయన వ్యతిరేక వర్గం మధ్య వివాదమే ఇందుకు కారణంగా తీస్తున్నది. ఇప్పటికే దీనిపై పలువురు రాష్ట్ర సంస్థాగత ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ వర్ల రామయ్య, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావుకు ఫిర్యాదులు చేశారు. కొందరు ఏకంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. గత వారం కుప్పం వచ్చిన చంద్రబాబుకు కొందరు ఆరోపణ పత్రాలు అందించారు. ఎమ్మెల్యే ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పరిశీలకులు కూడా తమకు న్యాయం చేయలేదని కొందరు చెప్పారు. ఇటీవల రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి నియోజక వర్గంలో మండల కమిటీ పదవులు అమ్ము కుంటున్నారని ఒక టివి డిబేట్ లో పరోక్షంగా ఆరోపించారు. ఈ నేపధ్యంలో స్థానిక ఎమ్మెల్యే థామస్ ఎమ్మెల్యే థామస్ పాలసముద్రం మండల అధ్యక్షిగా తాళ్లూరి శివా నాయుడు, జి డి నెల్లూరు అధ్యక్షునిగా స్వామి దాసు, ఎస్ ఆర్ పురం అధ్యక్షునిగా జయశంకర్ నాయుడు, పెనుమూరు అధ్యక్షునిగా రుద్రయ్య నాయుడు, వెదురుకుప్పం అధ్యక్షునిగా మోహన్ మురళీ, కార్వేటినగరం అధ్యక్షునిగా చంగల్రాయ యాదవ్ పేర్లు ప్రతిపాదించారు. ఇందులో చంగల్రాయ యాదవ్, జయశంకర్ నాయుడు మూడు సార్లు అదే పదవిలో ఉన్నారు. రుద్రయ్య నాయుడు ఎనిమిది సార్లు మండల అధ్యక్ష పదవిలో ఉన్నారు. మూడు సార్లు ఒకే పదవిలో ఉన్న వారిని తిరిగి అదే పదవి ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించింది. కాగా ఒక మండలం కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించక పోవడం వివాదానికి దారితీసింది. దీంతో సూచించిన అధ్యక్షుల పేర్లను అధిష్టానం పక్కన పెట్టింది. మెజారిటీ కార్యకర్తల అభిప్రాయాలు పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటే విభేదాలకు దారి తీయవచ్చని భావిస్తున్నారు. పార్టీ పరిశీలకులు పంపిన జాబితా పై కూడా విమర్శలు రావడంతో అధిష్టానం పక్కన పెట్టినట్టు తెలిసింది. కాగా రెండు రోజుల క్రితం చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్ ద్వారా పాలసముద్రం, ఎస్ ఆర్ పురం, జి నెల్లూరుకు చెందిన ముగ్గురు ఆశావహులు దరఖాస్తులు పంపినట్టు తెలిసింది. ఈ విషయం బయటికి పొక్కడంతో మరి కొందరు నేరుగా అధిష్టాన వర్గానికి దరఖాస్తులు పంపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ బలోపేతానికి బదులుగా అంతర్గత విభేదాలు పెరుగుతుండడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో అధిష్టానమే తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం లేక ఐవిఆర్ఎస్ సర్వే నిర్వహించి, సమర్ధులను మండల అధ్యక్షులుగా ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు.

