గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలను మెరుగుకు ప్రభుత్వం చర్యలు
చిత్తూరు జిల్లాకు కొత్తగా 229 గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ లు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ప్రతి పంచాయతీకి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక కార్యకర్త ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఉదయం ఓపి చూస్తారు. రోగులకు అవసరమైన సూది మందులు ఇస్తారు. ఆరోగ్యనికి సంబంధించి ఇంటింటి సర్వే ను నిర్వహిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను పద్ధతులకు అందే విధంగా చర్యలు తీసుకుంటారు. గ్రామం ప్రతివారం గ్రామంలో తాగు నీటి పరీక్ష చేస్తారు. ఆ నీటి పరీక్ష ఫలితాలను జిల్లా కేంద్రానికి అందజేస్తారు. చిత్తూరు జిల్లాకు కొత్తగా 229 విలేజ్ హెల్త్ క్లినిక్ లలకు సొంత భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాకు 464 ఆరోగ్య కార్యకర్తల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో 444 మంది ఆరోగ్య కార్యకర్తలు పనిచేస్తున్నారు.
గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మున్నెన్నడూ లేనివిధంగా ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం ప్రారంభం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో హెల్త్ క్లినిక్ లకు సొంత భవనాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం చేస్తుంది. గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణ పనులకు, ఇప్పుడు చేపట్టనున్న నిర్మాణ పనులకు అవసరమయ్యే మొత్తం ఖర్చులో 80 శాతాన్ని కేంద్రమే అందిస్తోంది. హెల్త్ క్లినిక్ నిర్మాణాల కోసం ఎన్‌హెచ్ఎం, పిఎం-అభిమ్ పథకాల కింద కేంద్రం 60 శాతం ఖర్చును భరిస్తుంది. దీంతో పాటు ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణ పనులు, ఇప్పుడు ఆమోదించిన నిర్మాణ పనులకు అయ్యే మొత్తం ఖర్చులో 80 శాతం కేంద్రమే అందిస్తోంది. జిల్లాలో మరో 229 నూతన భవనాలను 16వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పూర్తి గ్రాంటుగా లభించే ఈ నిధులతో కలిపి రాష్ట్రంలో హెల్త్ క్లినిక్ భవనాలకు అయ్యే మొత్తం ఖర్చులో 85 శాతం కేంద్రమే ఇచ్చినట్లవుతుంది. చిత్తూరు జిల్లాలో 229, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒక్కోచోట 100కి పైగా నూతన భవనాల్ని నిర్మిస్తారు. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని పటిష్టం చేసే దిశగా భారీ వ్యయంతో సొంత భవనాల్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 464 విలేజ్ హెల్త్ క్లినిక్ లు వైద్య సేవల్ని అందిస్తున్నాయి. వీటిలో 161 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. మిగిలిన వాటిలో ఎక్కువ భాగం అద్దె భవనాల్లో నడుస్తున్నందున ప్రజలకు వైద్య సేవలందించే క్రమంలో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రూ.126 కోట్ల వ్యయంతో 229 గ్రామాల్లో హెల్త్ క్లినిక్ లకు సొంత భవనాలు నిర్మించడానికి మంత్రి ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం నిర్మాణ పనుల్ని చేపట్టి నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయిన 47 భవనాల నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. దీంతో పాటు మరో 229 నూతన భవన నిర్మాణ పనుల్ని15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడతారు. హెల్త్ క్లినిక్ లకు సొంత భవనాల ప్రాధాన్యత దృష్ట్యా ఈ నిర్మాణ పనుల్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని, ఈమేరకు నిర్మాణ పనుల్ని చేపట్టనున్న పంచాయితీరాజ్ శాఖతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో 353 విలేజ్ హెల్త్ క్లినిక్ లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, 161 భవనాల్ని మాత్రమే నిర్మించింది. ఎన్ఆర్ ఇజియస్, ఎన్ హెచ్ఎం నిధులతో మరో 47 భవన నిర్మాణ పనులు ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇలా చేపట్టిన భవన నిర్మాణాలకు ఒక్కోదానికి రూ.8.75 లక్షలు చొప్పున కేంద్రమిచ్చే ఎన్ఆర్ ఇజియస్ నిధులను వాడారు. 2019-20 నాటి రేట్ల ప్రకారం ఒక్కో భవనం నిర్మాణానికి రూ.20.80 లక్షలుగా అప్పట్లో నిర్ధారించారు. ఎన్ఆర్ ఇజియస్ నిధులకు అదనంగా ఒక్కో భవన నిర్మాణానికి ఎన్‌హెచ్ఎం పధకం కింద రూ. 12.05 లక్షలను కేటాయించగా ఇందులో కేంద్రం 60 శాతం వాటాను అందించింది. అయినా నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. విలేజ్ హెల్త్ క్లినిక్ లు సాధారణ ప్రాథమిక ఆరోగ్య సేవలతో పాటు, ప్రసూతి, శిశు సంరక్షణ, టీకాలు, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ వంటి సేవలను కూడా అందిస్తాయి. వ్యాధులు రాకుండా నివారించడం, ఆరోగ్య జీవనశైలిని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్య భారాన్ని తగ్గించడం దీని లక్ష్యం. ఇవిప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకంలో ఒక భాగంగా పనిచేస్తాయి. ఇది పేద కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తుంది.

