16, సెప్టెంబర్ 2025, మంగళవారం

త్రిశంకు స్వర్గంలో స్వయం ఉపాధి పధకాలు

నిరాశలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ యువత 

అయిదు నెలల కిందట హోల్డ్ లో పెట్టిన ప్రభుత్వం 

తదుపరి నిర్ణయం ప్రకటించని ప్రభుత్వం 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పోరేషన్ల రాయితీ రుణాలు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాయి. అవి కిందికి దిగుతాయో, పైకి పోతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రాయితీ రుణాల ద్వారా స్వయం ఉపాధిని పొందవచ్చన్న  నిరుద్యోగుల ఆశలు అడియాసులవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జననరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నిరుద్యోగులకు భారీ ఎత్తున స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. ఇందుకు లబ్ధిదారుల వాటా కూడా లేకుండ యూనిట్ ధరలో సగం ప్రభుత్వం రాయితీగా ఇస్తుందని, మిగిలిన సగం బ్యాంకులు రుణంగా ఇస్తాయని ప్రకటించింది. దీంతో నిరుద్యోగ యువత ఎంతో ఆశగా రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించారు. వారికి ఇంటర్వ్యూలు జరిగాయి. లబ్ధిదారుల జాబితాను ఖరారు చేశారు. ఆ జాబితాను బ్యాంకులకు పంపి రుణాలు మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నఫళంగా  రాయితీ రుణాల  మంజూరును నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాయితీ రుణాలు మంజూరు  ప్రక్రియ మే నెలలో ఆగిపోయింది. మరిన్ని ఎక్కువగా రాయితీ రుణాలను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటివరకు దానిమీద ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


చిత్తూరు జిల్లాకు 2800 యూనిట్ల బీసీ రుణాలు మంజూరయ్యాయి. బీసీ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ల కింద ఈ పథకాలకు మంజూరు చేశారు. ఈ పథకాల విలువ 61.25 కోట్ల రూపాయల కాగా, ఇందులో ప్రభుత్వం 30.62 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందజేస్తుంది. బిసి కార్పోరేషన్ ద్వారా  స్లాబ్ 1 లో  రెండు లక్షల రూపాయల వరకు, స్లాబ్ 2 లో 3 లక్షల రూపాయల వరకు, స్లాబ్ 3 లో  5 లక్షల రూపాయల వరకు, స్లాబ్ 4 లో ఎనిమిది లక్షల నుంచి 25 లక్షలు వరకు సబ్సిడీ వస్తుంది. జిల్లాలో  బీసీల ఆర్థికాభివృద్ధికి 38.41 కోట్ల రూపాయలతో  ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని 2020 మంది బీసీలు లబ్ధి పొందనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా 19.20 కోట్ల రూపాయలను అందచేస్తుంది. జిల్లాలోని  ఎస్సిల  ఆర్థికాభివృద్ధికి 27.43 కోట్ల రూపాయలతో వార్షిక  ప్రణాళికను రూపొందించారు. ఇందులో కార్పొరేషన్ సబ్సిడీగా 12.52 కోట్ల రూపాయలను అందజేస్తుంది. బ్యాంకర్లు రుణాల కింద మరో 13.53 కోట్లను సమకూర్చుతాయి. లబ్దిదారులు తమ వాటాగా 1.37 కోట్ల రూపాయలు చెల్లించాల్చి ఉంటుంది. ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని 786 మంది ఎస్సీలు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. అలాగే, జిల్లాలోని మైనార్టీల అభివృద్ధి, స్వయం ఉపాధికి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 14 కోట్ల రూపాయలతో 916 యూనిట్లను మంజూరు చేసింది.  మైనార్టీ కార్పొరేషన్ కింద నాలుగు స్లాబ్ లలో ఈ పథకాలు మంజూరయ్యాయి. స్లాబ్ 1 లో యూనిట్ ధర లక్ష రూపాయలు, స్లాబ్ 2లో యూనిట్ ధర లక్ష రూపాయలు నుంచి 3 లక్షల రూపాయలు, స్లాబ్ 3 లో  యూనిట్ ధర మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలుగా, స్లాబ్ 4లో యూనిట్ ధర 8 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఇందులో బ్యాంకులను 50 శాతం రుణంగా అందజేస్తాయి, ప్రభుత్వం సబ్సిడీగా 50 శాతం ఇస్తుంది. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎస్సీలకు రాయితీ రుణాలను ప్రకటించింది. దీంతో  లబ్ధిదారులు ఈ సబ్సిడీ పైన భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా బీసీ, ఎస్సి కార్పొరేషన్ రుణాలు దక్కించుకొని తాము జీవితంలో స్థిరపడవచ్చని ఆశపడ్డారు. దీంతో బీసీ కార్పొరేషన్ రుణాలకు భారీగా దరఖాస్తుల రావడంతో దరఖాస్తుదారులలో  రాజకీయ నాయకులను ఆశ్రయించారు. కొందరు ఎలాగైనా రుణాన్ని సాధించాలని మధ్యవర్తులను కూడా ఆశ్రయించారు. రాయితీ రుణాలను జిల్లా అధికారులు నియోజకవర్గ, మండల వారీగా విభజించారు. ఆ జాబితాను ఆయా శాసనసభ్యులకు అందజేశారు. దీంతో శాసనసభ్యులు  ప్రతిపాదించిన వారికి రుణాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆశావాహులు పలువురు శాసనసభ్యులను ప్రసన్నం చేసుకున్నారు. మరికొందరు మండల స్థాయిలోని  కూటమికి నేతల సహాయ సహకారాలను తీసుకొని శాసనసభ్యులను ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. ఇదే అదునుగా మండల స్థాయిలో కూటమి నేతలు దరఖాస్తుదారులకు హామీల వర్షం కురిపిస్తున్నారు. లోను ఇప్పిస్తా,  ధైర్యంగా ఉండమన్నారు. అయితే ఇందులో కొంత ఖర్చవుతుందని, పది శాతం వరకు భరించాల్సి ఉంటుందని షరతు పెట్టారు. ఇదే అదునుగా కొంతమంది బీసీ నాయకులు కూడా దళారుల అవతారం ఎత్తారు. కొంత మంది కులసంఘ నాయకులతో కలిసి దరఖాస్తుదారులకు వల వేశారు. వీరు తమకు బీసీ కార్పొరేషన్ అధికారులు, శాసనసభ్యులు బాగా తెలుసనీ, వారితో చెప్పి రాయితీ రుణాలను ఇప్పిస్తామని దరఖాస్తుదారులను ఆశపెట్టారు. కొందరు లబ్దిదారుల నుంచి ముందుగానే డబ్బులను కూడా వసూలు చేశారు. గతంలో ఎంబీసీ కార్పొరేషన్ తరపున ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేసింది. ఇందులో కూడా కొంతమంది దళారులు రంగ ప్రవేశం చేసి, తామే డబ్బులు మంజూరు  చేపిమ్చమని, ఒక్కొక్క లబ్ధిదారుల దగ్గర 3000 నుంచి 5000 రూపాయల వరకు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇదేవిధంగా ప్రస్తుతం బీసీ రాయితీ రుణాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో మధ్య దళారీలు రంగ ప్రవేశం చేశారు. ఏదో ఒకటి విధంగా దరఖాస్తుదారులను మభ్యపెట్టి తమ గడుపుకోవడానికి ప్రయత్నాలు చేశారు. బిసి రాయితీ రుణాలకు మండల, మునిసిపాలిటి స్థాయిలో అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తులు భారీగా రావడంతో జిల్లా అధికారుల నుండి  ఎంపిక  బాధ్యతలను సంబంధిత ఎమ్మెల్యేలకు తీసుకున్నారు. మండల, నియోజకవర్గ వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లను విభజించారు. ఈ మేరకు జాబితాలను సంబంధిత ఎమ్మెల్యేలు మండల అధికారులకు, మున్సిపాలిటీలకు అందచేశారు. ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికి మాత్రమే సబ్సిడీ రుణాలు అందచేయాలని మండల, మున్సిపాలిటీ అధికారులు కూడా బ్యాంకులను ఆదేశించారు. ఈ మేరకు జాబితాలను కూడా అందచేశారు. ఇలా జిల్లా స్థాయిలో బిసి, ఎస్సి రాయితీ రుణాల కోసం పలువురు ఆశలు పెట్టుకున్నారు. రుణాలు  పొంది జీవితంలో స్థిరపడాలని లబ్దిదారులు ఆశపడ్డారు.  ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం ఉన్నవిధానంలో  రాయితీ రుణాలను మంజూరు చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని భావించింది. ఇలా చేయడం వల్ల సామాన్య లబ్ధిదారులకు రుణాలు అందే పరిస్థితి లేదని అంచనాకు ప్రభుత్వాధికారులువచ్చారు. రాయితీ రుణాలను రాజకీయ నాయకుల సిఫార్సులతో కూటమి నేతలు పంచుకునే పరిస్థితి ఏర్పడిందని భావించారు. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. క్షేత్రస్థాయిలో జరిగిన, జరుగుతున్న విధానాన్ని పరిశీలించిన ప్రభుత్వం రాయితీ రుణాలను తత్కాలికంగా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కొత్త నిబంధనలను జారీ చేసి, ఎక్కువ మంది లబ్ది పొందే విధంగా  బిసి ఎస్సి, మైనారిటీ రుణాలను అందచేస్తామని నిలుపుదల సమయంలో పేర్కొంది. అయిదు నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు ప్రభుత్వం రాయితీ రుణాల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశా నిసృహలకు గురవుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 

 



 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *