2, సెప్టెంబర్ 2025, మంగళవారం

వికలాంగుల సర్టిఫికేట్స్ పునఃపరిశీలన తాత్కాలికంగా నిలుపుదల

పింఛన్ రద్దయిన వారికి మరో మారు వైద్య పరీక్షలు

అప్పటి వరకు రెగ్యులర్ గా జరుగుతున్న పునః పరిశీలన నిలుపుదల

ప్రభుత్వ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్న దివ్యాంగులు


*చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ*


దివ్యాంగుల పెన్షన్ల రద్దు, కేటగిరీ మార్పు వంటి వాటిపైన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జిల్లాలో  ప్రభుత్వం అందజేస్తున్న 2,67,240 ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లలో 4,966 పింఛన్లను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో 1,395 పింఛన్లను అనర్హులు గుర్తించి వారికి కేటగిరి మార్పు చేసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య పరీక్షలకు 12,953 మంది డుమ్మా కొట్టారు. వీరికి కూడా పింఛన్లను నిలుపుదల చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 37,277 పింఛన్లను పరిశీలన చేయగా ఇందులో 18,429 మాత్రమే సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించింది. మిగిలిన 18,429 మంది అక్రమార్కులుగా తేల్చింది. అర్హులకు మాత్రమే  యధావిధిగా పింఛన్లను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొందరికి కేటగిరీ మార్పు చేయడంతో  వారికి గతంలో వస్తున్న పెన్షన్ కంటే తక్కువగా వస్తుంది.



 దీంతో జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకు రాజకీయ పార్టీలు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందజేశారు. ఈ విషయం చిలికి చిలికి గాలివానగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అర్హులను మరోసారి దరఖాస్తు చేసుకోమని కోరగా, పింఛన్లు తొలగించిన వారిలో సుమారుగా 90 శాతం మంది తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఈ నెలలో యధావిధిగా పింఛన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ తిరిగి పరీక్షలను చేయాల్సి ఉంది. వాళ్ళు వికలాంగులు అవునో కాదో  తేల్చి, వాళ్లకు  పింఛన్ మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వికలాంగుల వెరిఫికేషన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఇప్పటివరకు ఆ పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులకు నోటిసులు ఇవ్వద్దని ప్రభుత్వం నిర్దేశించింది. తొలుత ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించిన తర్వాత, యధావిధిగా ఇప్పటివరకు పరిశీలనకు హాజరుకాని దివ్యాంగులను పునః పరిశీలన చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు దివ్యాంగుల కేటగిరీ పింఛన్ దారులలో అనర్హులగుర్తింపునకు చేపట్టిన సదరం (వైకల్య నిర్ధారణ) పునఃపరిశీలనను వైద్యారోగ్య శాఖ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఇప్పటికే అనర్హులుగా తేలి, అప్పీలు చేసుకున్న వారికి మళ్లీ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 2.67 లక్షల మంది దివ్యాంగ పింఛనుదారులుండగా ఇప్పటివరకు 37,277 మంది ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలన పూర్తయింది. ఇంకా 2 లక్షల మందికి పైగా వైకల్య పరీక్షలు చేయించాల్సి ఉంది. 8 నెలలుగా చేపట్టిన తనిఖీలో దాదాపు 18,429 మంది అనర్హులుగా తేలారు. వీరిలో అర్హులుంటే అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. తాము అర్హులమేనంటూ 95 శాతం మంది ప్రభుత్వానికి అప్పీలు చేసుకున్నారు. వీరికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు.. ఇప్పటికే కొనసాగుతున్న పునఃపరిశీలనను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తదుపరి ఆదేశాలొచ్చే వరకూ కొత్తగా నోటీసులు ఇవ్వొద్దని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. నడవలేక మంచానికే పరిమితమైన వ్యక్తులు చిత్తూరు జిల్లాలో 1,936 మంది గత ప్రభుత్వంలో నెలకు పదిహేను వేల రూపాయల వంతున పింఛన్లను తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పింఛన్లను పునః పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకు డాక్టర్ల బృందాలను ఏర్పాటు చేసి, ఇంటింటికి వెళ్లి పింఛన్ లబ్ధిదారులను పరీక్ష చేశారు. ఈ డాక్టర్ల బృందం మొత్తం 1,911 మంది రోగుల ఇండ్లకు వెళ్లి వారిని పరిశీలించారు. వారిలో 11 మంది మృతి చెందారు. 783 మంది సాధారణ వికలాంగులుగా భావించి వారి పింఛను 15 వేల రూపాయల నుంచి 6 వేల రూపాయలకు మార్పు చేశారు. మరో 70 మందిని అనర్హులుగా నిర్ధారించారు. అయితే వారికి 60 సంవత్సరాల వయసు నిండిన కారణంగా వారికి 4 వేల రూపాయల వృద్ధాప్య పింఛనుగా మార్పు చేశారు. వైద్యాధికారుల పరీక్షలకు 14 మంది హాజరు కాలేదు. మొత్తం మీద జిల్లాలో 15 వేల రూపాయల పింఛన్లకు 824 మంది మాత్రమే అర్హులని తేల్చారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా నెలకు పదిహేను వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్న 234 మందికి ఈ పింఛన్లను రద్దుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే వికలాంగుల కోటా కింద నెలకు 6000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్న వారిలో  4,732 మంది పింఛన్లను రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వికలాంగుల కింద నెలకు 6000 రూపాయలు వంతున పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులు చిత్తూరు జిల్లాలో 35,277 మంది ఉన్నారు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం పిలువగా 22,338 మాత్రం హాజరయ్యారు. మిగిలిన 12,939 మంది ఈ పరీక్షలకు హాజరు కాలేదు. దీంట్లో 4,732 మంది 6000 రూపాయల పింఛన్లకు అనర్హులుగా వైద్యాధికారులు నివేదిక అందజేయడంతో ప్రభుత్వం వారి పింఛన్లను రద్దు చేసింది. అలాగే వైద్య పరీక్షలకు హాజరు కాని 12,939 మంది పింఛన్లను హోల్డ్ లో పెట్టింది. ఇందులో 17064 మంది మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. వికలాంగులు కాకుండా ఆరువేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్న 542 మందికి 60 సంవత్సరాల వయసు వయస్సు నిండడంతో వారిని పింఛన్ల వృద్ధాప్య పింఛన్ కింద మార్పు చేసి నెలకు 4 వేల రూపాయలను అందజేయనున్నారు. పెన్షన్లు రద్దు చేసిన వారిలో వృద్ధులు, వితంతువులు ఉంటే వారికి పింఛన్ల మార్పు చేయాలని ప్రభుత్వం సూచించింది. మొత్తం మీద ఈ వ్యవహారం గందరగోళంగా తయారైంది. ప్రభుత్వం మీద భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటిని తట్టుకోవడానికి తత్కాలికంగా రెగ్యులర్ గా జరుగుతున్న పరిశీలన ఆపి, ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకున్న  వారికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో దివ్వాంగులు ఊపిరి పీల్చుకున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *