10, సెప్టెంబర్ 2025, బుధవారం

కలెక్టర్ జోక్యంతో ఆగిన గ్రావెల్ అక్రమ రవాణా !

పర్మిట్లు లేని పది టిప్పర్లను పట్టుకున్న మండల అధికారులు 

రెండు గంటల్లో మండల అధికారులను బదిలీ  చేయిస్తానన్న శరవణ 

జీఎస్టీ సర్టిఫికెట్లు చూపమని నిలతీసిన అధికారులు

సిబిఐ విచారణకు  మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి డిమాండ్ 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

గంగాధర  నెల్లూరు నియోజక వర్గం పాలసముద్రం మండలంలో జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణా  కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలతో ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాలసముద్రం మండలంలోని పలు గ్రామాల నుంచి ఇసుక, గ్రావెల్ అక్రమంగా చెన్నైకి తరలిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై  మీడియాలలో పలు కథనాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా టిడిపి ముసుగులో ఉన్న కొందరు వైసిపి నేతలు కొండలలోని  ఎర్రమట్టి గొల్లగొట్టి కోట్లుగడిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. సోమవారం పాలసముద్రం ఎస్సై చిన్నరెడ్డప్ప, తహసీల్దారు అరుణ కుమారి సరైన పర్మిట్లు లేని పది టిప్పర్లను పట్టుకున్నారు. అందులో రెండింటిని సీజ్ చేశారు. గ్రావెల్ రవాణా చేస్తున్న సంస్థ ప్రతినిధి శరవణ ఎస్సైతో వాగ్వివాదానికి దిగారు. రెండు గంటల్లో బదిలీ చేయిస్తానని హెచ్చరించారు. అయితే ఎస్సై భయపడకుండా  జీఎస్టీ సర్టిఫికెట్లు చూపమని నిలదీశారు. దీనితో అక్రమ దారులు తోక ముడిచారు. సాయంత్రం అన్ని వివరాలతో తహసీల్దారు, ఎస్సై కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. అక్రమ రవాణా చేసే వారిపై కేసులు పెట్టమని ఆదేశారు ఇవ్వడంతో అక్రమ రవాణా ఆగిపోయింది.


కాగా తమిళనాడు సరిహద్దులో ఉన్న కొండ ప్రాంతాల నుంచి ప్రతి రోజు రాత్రులలో కోట్ల విలువైన ఎర్రమట్టి చెన్నై ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. గతంలో వైసిపి నేతలుగా చలామణి అయిన కొందరు పాత పర్మిట్ లను పునరుద్ధరించుకుని జీఎస్టీ కట్టకుండా అధికారుల కళ్ళు గప్పి అక్రమంగా తరలిస్తున్నారని తెలిసింది. వనదుర్గాపురం పంచాయతీ అత్తిమెంజేరి పేట హైస్కూల్ వెనుక ఐదు బలిజ కండ్రిగ పంచాయతీ ధర్మరాజుల ఆలయం సమీపంలో మూడు, వేప కోన తొట్టి కండ్రిగ వద్ద రెండు క్వారీలు ఉన్నాయని తెలిసింది. ఈ క్వారీల ద్వారా గత ఏప్రిల్ నుంచి  ప్రతి రోజూ 250 లోడ్ల ఎర్ర మట్టి తమిళనాడు, చెన్నై రోడ్ల నిర్మాణ పనుల కోసం  తరలిస్తున్నారని స్థానికులు చెప్పారు. 16 వీలర్ టిప్పర్ ద్వారా  40 టన్నుల ​​ఉన్న గ్రావెల్ తరలిస్తున్నారు. క్వారీల అనుమతి ఉన్నప్పటికీ అక్రమ వ్యాపారులు జీఎస్టీ, బిల్లు, రాయల్టీ స్లిప్పులు, పర్మిట్ స్లిప్పులు  లేకుండా రవాణా చేస్తున్నారు. వర్క్ ఆర్డర్ ప్రకారం ఆమోదించబడిన మెట్రిక్ టన్నులు మాత్రమే లోడ్ చేయాలి. అయితే అధికారుల కళ్ళు కప్పి 500 రెట్లు అదనపు పరిమాణాన్ని రవాణా చేస్తున్నారని సమాచారం. దీనివల్ల వ్యాపారులకు కోట్లు గడిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.


*అసలు నాయకుడు ఎవరు ?*

గ్రావెల్ అక్రమ రవాణా వెనుక ఎవరు ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా ఉంది. పాలసముద్రం మండల పరిధిలో ఉన్న వనదుర్గాపురం రెవెన్యూ గ్రామం ప్రాంతంలో గ్రావెల్ క్వారీ నిర్వహించడానికి తనకు అనుమతులు ఉన్నాయని నగరి నివాసి కె జే మురళి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన తండ్రి కె జే కుమార్ గతంలో వైసిపిలో కీలక నేత. ఆయన తల్లి శాంతి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ఉన్నారు. అయితే మాజీ మంత్రి ఆర్ కె రోజా వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డారు. ఎన్నికల సమయంలో ఆమెను ఓడించడం కోసం టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కు మద్దతుగా పని చేశారు. అధికారులతో వాగ్వివాదానికి దిగిన శరవణ రోజా అనుచరుడిగా ఉన్నారు. ఎన్నికల అనంతరం టిడిపి వ్యక్తిగా చలామణి అవుతున్నారని టిడిపి నేతలు అంటున్నారు. స్థానిక టిడిపి నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు అన్ని అనుమతులు ఉన్నాయని కె జె మురళీ చెపుతున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే అధికారులు ఎందుకు అడ్డుకుంటారని టిడిపి నేతలు తర్కం లేవదీస్తున్నారు. కాగా మంగళవారం మాజీ ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ గ్రావెల్ అక్రమ రవాణాపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తారు. తనపై అవినీతి మరకలు అంటించడానికి ప్రయత్నం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే థామస్ నిజ స్వరూపం బయట పెట్టాలని కోరారు. పేరు చెప్పడం ఇష్టంలేని టిడిపి రాష్ట్ర నాయకుడు ఒకరు మాట్లాడుతూ వైసిపి నుంచి వలస వచ్చిన కొందరు టిడిపి ముసుగులో అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో అక్రమ రవాణా దారు ఎవరు, యే పార్టీకి చెందిన వారు అన్న చర్చ ఆసక్తిని కలిగిస్తోంది. 

పో రై గంగ 1 అధికారులు సీజ్ చేసిన టిప్పర్లు  

గంగ 2 అధికారులతో వాగ్వివాదానికి దిగిన గుత్తేదారు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *