ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వంకలు, వాగులు కబ్జాలకు గురవుతున్నాయి. కొందరు అడవులను కూడా ఆక్రమించుకున్నారు. అధికారులు పలుకుబడి కలిగిన వారితో చేతులు కలిపి అక్రమాలను చూచీ చూడనట్టు వదిలేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ దెబ్బతింటోంది. నీటి మట్టం తగ్గిపోతున్నది. వర్షాలు ఎక్కువైనప్పుడు వరదలు ముంచుకొచ్చి ఆస్తి, ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి.వరదలకు అడవుల నరికివేత, వంకలు, వాగుల పూడ్చి వేత ప్రధాన కారణమని సుప్రీం కోర్టు హెచ్చరించినా సమాజంలో మార్పు రాలేదు.
ఈ నేపధ్యంలో చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం చార్వకాని పల్లె పంచాయతీ దాసరా పల్లె కు చెందిన సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి చెరువులు, వంకలు ఆక్రమణ మీద పోరాటం ప్రారంభించారు. తమ గ్రామంలో కబ్జాలకు గురైన భూములపై కోర్టులో కేసులు వేశారు. అధికారులకు ఫిర్యాదులు చేశారు. చార్వకాని పల్లె సర్వే నెంబర్ లోని 50 ఎకరాల మేత బీడు పొరంబోకు భూమిలో 34 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఉన్న వంకను పూడ్చివేయడంతో పాటు బుద్దారెడ్డి చలం నుంచి ఈతమాకుల చెరువుకు వెళ్లే వంకనను పెద్దమ్మ కుంట 2 ఎకరాలు స్థానిక నాయకులు ఆక్రమించారు. 2021లో యువకులు 10 రోజుల నిరాహార దీక్ష చేసిన తర్వాత కొంత భూమి విముక్తం అయినప్పటికీ, కుంట పునరుద్ధరణ జరగలేదు. 100 రోజుల పనిపట్టికలో ఈ కుంటను పెట్టి అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. దాసరపల్లె చెరువు ప్రాంతంలో మొత్తం 8 ఎకరాల్లో 4 ఎకరాలు అక్రమంగా కబ్జా చేసుకున్నారు. వాటికి చెందిన వంకలూ మాయం అయ్యాయి. ప్రధాన వంకలో 11.57 ఎకరాలు ఆక్రమణకు గురై, పొలాలుగా మారిపోయాయి. ఈ మధ్యలో ఒక నాయకుడు కొంత భాగాన్ని వంకలో ఫ్లాట్లుగా నిర్మిస్తున్నారు. పెనుమూరు అగ్రికల్చర్ మార్కెట్ దగ్గర నుంచి దాసరపల్లి చెరువుకు వెళ్లే వంక రహదారి అనుకోని స్థితిలో ఉంది. దీనిని ఒక నాయకుడు చదును చేసి ప్లాట్లు వేసి అమ్మాడు. ఆ సమయంలో తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బంది కూడా సహాయం చేశారు. అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చార్వకాని పల్లె సర్వే నెంబర్ 7లో 20 ఎకరాల మేత బీడు పోరంబోకులో కొందరు ఇళ్లను కట్టుకున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కబ్జాదారులకు అధికారులు మౌలిక సదుపాయాలు అందిస్తున్నారు. అధికారులకు కోర్టులు అంటే భయం లేదు, ఉన్నతాధికారులకు లెక్క లేదు, ఆర్జీలకు దిక్కు లేదు. ఐదు ఎకరాల మల్లిరెడ్డికుంటను ఒక రైతు ఆక్రమించుకున్నాడు. దీనికి సంబంధించిన వంక, మొరవలను కూడా ఆక్రమించి, కుంటను కే. శివశంకర్ రెడ్డి అనే పేరుతో ఆన్లైన్లో 1బి అడంగలు ఇచ్చినట్లు నమోదు చేశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో, ఆర్ టి ఐ ద్వారా అడిగితే పొరపాటున జరిగిందని రిప్లై ఇచ్చి చేతులు కడుతున్నారు. ఆర్ టి ఐ అడిగిన తహసీల్దారు చంద్రశేఖర్ విధులకు అడ్డుపడుతున్నారని తనపై తప్పుడు కేసు పెట్టారని సతీష్ రెడ్డి చెప్పారు. ఈ తప్పుడు 1 బి అడంగల్ ఆధారంగా ఆధారంగా కుంట ఆక్రమణ దారులు చిత్తూరు జిల్లా కోర్టులో ఆధారాలు కేసు వేశారు. 2017 లో కోర్టులో కేసు వేసినప్పుడు అప్పటి తహసీల్దారు రవి కోర్టుకు వాస్తవాలు చెప్పారు. ఎనిమిదేళ్ల తరువాత కోర్టు కుంటపై ఆ రైతుకు ఎలాంటి హక్కు లేదని తీర్పు తెలిపింది. అయినా పట్టించుకునే వారు ఎవరూ లేరు. ఇటీవల సతీష్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, పెనుమూరు తహసీల్దారు కబ్జాదారులు, ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఒక చిన్న పంచాయతీలోనే 100 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. వంకలు, చెరువులు, మేతబీడు భూములపై అధికారులకు కనీస అవగాహన లేకపోవడం బాధాకరం. ఈ విధంగా వ్యవస్థ సరైన దారి పట్టిందా లేక పూర్తిగా కూలిపోతోందా? అని పర్యావరణ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. రైతులపై ప్రభావం చెరువులు, వంకలు కబ్జా కావడం వల్ల నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా రైతుల బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. నీటి లేమితో పంటలు దెబ్బతింటే, చివరికి రైతులు తాగునీటికి కూడా కష్టాలు పడే పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పో రై గంగ 2 మల్లిరెడ్డికుంటలో ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు
గంగ 3 ఆక్రమణలపై పోరాటం చేస్తున్న సతీష్ రెడ్డి

