1, నవంబర్ 2025, శనివారం

జీడి నెల్లూరు వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గ విభేదాలు

నియోజకవర్గ ఇన్చార్జ్ కృపాలక్ష్మి వ్యతిరేకంగా పాలసముద్రంలో అసమ్మతి సమావేశం 

కృపాలక్ష్మి ఇన్చార్జి పదవి నుండి తొలగించాలని అసమ్మతివాదుల డిమాండ్

అసమ్మతివాదులను పార్టీ నుండి సస్పెండ్ చేపించిన కృపాలక్ష్మి 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.


గంగాధర నెల్లూరు నియోజక వర్గం వైసిపిలో వర్గ పోరు తారస్థాయికి చేరుకున్నది. మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మిని ఇంచార్జి పదవి నుంచి తొలగించాలని అసమ్మతి నేతలు సమావేశం అయ్యారు. పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే కృపాలక్ష్మి అధిష్టాన వర్గం, రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డిని కలిసి ఇద్దరు అసమ్మతి నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ప్రస్తుతానికి నియోజకవర్గ ఇన్చార్జి  కృపాలక్ష్మి అసమ్మతివాదుల మీద పై చేయి సాధించారు. ఈ సస్పెన్షన్లు తాత్కాలికమైనని అసమ్మతివాదులు అంటున్నారు. తమను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో అసమ్మతి కార్యక్రమాలు ఆగవని, కృపాలక్ష్మిని ఇన్చార్జి పదవ నుంచి తొలగించే వరకు విశ్రమించేది లేదని అంటున్నారు.


ఇటీవల పాలసముద్రంలో అసమ్మతి వాదుల సమావేశం ఏర్పాటు చేసిన శివప్రకాష్ రాజుతో పాటు వెదురుకుప్పం మండల మాజీ కన్వీనర్ పేట ధనంజయ రెడ్డిని కరుణాకర్ రెడ్డి సస్పెండ్ చేశారు. సమావేశంలో పాల్గొన్న వారిని అందరిని సస్పెండ్ చేయాలని కృపాలక్ష్మీ పట్టు పట్టినప్పటికీ అందరిని పోగొట్టుకోవడం మంచిది కాదని భావించిన పార్టీ నేతలు ఇద్దరితో సరిపెట్టారు. నారాయణ స్వామి పట్ల ఎన్నికలకు ముందే వ్యతిరేకత ప్రారంభం అయ్యింది. ఆయనకు టిక్కెట్టు ఇవ్వకూడదని అప్పట్లో మాజీ ఎంపీ, మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి వర్గం పట్టు పట్టింది. దీనితో ఆయన బదులు కూతురికి టిక్కెట్టు ఇచ్చారు. ఓడిపోయిన తరువాత ఇంచార్జిగా కొనసాగుతోంది. నియోజక వర్గంలో వైసిపికి తిరుగులేని బలం ఉంది. జి డి నెల్లూరు నియోజక వర్గం ఏర్పడిన తరువాత 2009 కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ 10 వేల మెజారిటీతో విజయం సాధించారు. వైసిపి ఏర్పడిన తరువాత 2014 లో జరిగిన ఎన్నికల్లో నారాయణ స్వామి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గుమ్మడి కుతూహలమ్మపై 20 వేల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి డాక్టర్ హరికృష్ణపై 45 వేల మెజారిటీ సాధించారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో ఐదేళ్లు డిప్యూటీ సిఎంగా పనిచేశారు. అయితే, రాష్ట్రంలో వైసిపి పట్ల వీచిన వ్యతిరేక పవనాల వల్ల 2024 ఎన్నికల్లో కృపాలక్ష్మీ టిడిపి అభ్యర్ధి డాక్టర్ వి ఎం థామస్ చేతిలో 26 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం పార్టీని, కార్యకర్తలను గాలికి వదిలేసి విజయవాడలో కాపురం పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు చుట్టపుచూపుగా నియోజక వర్గానికి వచ్చి వెళుతున్నారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియోజక వర్గంలో పార్టీకి దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఆమె స్థానంలో కొత్త ఇంచార్జిని నియమించాలని కొందరు కోరుతున్నారు. అధిస్థానంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం ప్రారంభించారు. అయితే కృపాలక్ష్మి జాగ్రత్తపడి అసమ్మతి నేతలపై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే, ఇది కొత్త వివాదానికి దారి తీసింది. అన్ని మండలాలకు చెందిన కొందరు నాయకులు, ఇద్దరు ఎంపీపీలు అసమ్మతి సమావేశంలో పాల్గొనగా కేవలం ఇద్దరినీ సస్పెండ్ చేయడం పట్ల కొన్ని వర్గాలలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మైనారిటీ వర్గానికి చెందిన బలమైన నేత శివ ప్రకాష్ రాజు ను సస్పెండ్ చేయడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. అలాగే బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ధనంజయ రెడ్డిని సస్పెండ్ చేయడం వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని అంటున్నారు. కాగా మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ కుమారుడు, 2019లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ హరికృష్ణకు ఇంచార్జి పదవి ఇవ్వాలని కొందరు కోరుతున్నట్టు తెలిసింది. అయితే, ప్రస్తుత పరిస్థితులలో కొన్నాళ్ళు ఓపిక పట్టాలని జిల్లా కీలక నేత ఒకరు ఆయనకు సర్ది చెప్పినట్టు తెలిసింది. అంత వరకు నియోజక వర్గం రాజకీయాలకు కొంత దూరంగా ఉండమని సలహా ఇచ్చారని అంటున్నారు.

గంగ 3 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన కృపాలక్ష్మి
గంగ 4 భూమన కరుణాకర్ రెడ్డిని కలిసిన కృపాలక్ష్మి

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *