కొండెక్కిన కోడి మాంసం ధరలు
(ప్రభ న్యూస్ బ్యూరో )
అటు నడినెత్తిన నిప్పులవాన కురుస్తుంటే, ఇటు చికెన్ రేట్లు కూడా మండిపోతున్నాయి. సండేనాడు చికెన్ ముక్క లాగించేద్దామంటే ధరలు షాక్ కొడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. చికెన్ ధర ట్రిపుల్ సెంచరీ కొట్టింది. సరఫరా తగ్గడం, ఎన్నికల విందులతో ఈ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో కేజీ చికెన్ ధర రూ.230 నుంచి 260 వరకు ఉంది. మూడు వారాల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కేజీ చికెన్ రూ.300కు చేరింది. ఈ రేటు ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు కోడిగుడ్ల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. మార్చిలో వంద గుడ్ల రేటు రూ.425 వరకు ఉంది.. ఏప్రిల్ రూ.20 తగ్గి రూ.405కు చేరింది. ఇప్పుడు ఉన్నట్టుండి గుడ్ల ధరలు అమాంతంపెరిగాయి. 100 గుడ్లు రూ.550కి చేరింది. డజన్ గుడ్లు రిటైల్ మార్కెట్‌లో రూ.72కు చేరింది. ఇటు చికెన్, అటు కోడి గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి పరిస్థితి మారిపోయింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏకంగా 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఎండలు, వేడిగాలులతో కోళ్లు కూడా భారీగా చనిపోయాయి. అయినా సరే ఆ నెలలో కేజీ చికెన్ ధర రూ.230 నుంచి రూ.260 వరకు నడిచింది. ఇలా కోళ్లు చనిపోవడంతో ఫౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఏప్రిల్ నెల ఎండ దెబ్బకు కొత్త బ్యాచ్‌లను తీసుకురాలేదు. ఆ ప్రభావం చికెన్ రేటు పెరగడానికి కారణమైంది. కోడి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఏడు నుంచి తొమ్మిది వారాలకు సిద్ధమవుతాయి. ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచ్‌లు లేకుండా పోయాయి. దీంతో డిమాండ్‌కు తగిన విధంగా మార్కెట్‌లో సప్లై లేకుండా పోయింది. అందుకే చికెన్ ధరలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. చికెన్ ధరలు కేవలం 20 రోజుల్లోనే కేజీకి రూ.40 వరకు పెరిగింది. ఇప్పుడు కాస్త వర్షాలు పడి వాతావరణం చల్లగా మారడం, వర్షాలు కొనసాగుతాయని చెప్పడంతో ఇఫ్పుడిప్పుడే మళ్లీ కొత్త బ్యాచ్‌లను పౌల్ట్రీ రైతులు తీసుకొస్తున్నారు. కనీసం నాలుడు వారాలు ఆగితే కానీ ధరలు తగ్గే పరిస్థితి ఉండదంటున్నారు. అప్పటివరకు చికెన్ ధర ఇలానే ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో కర్రీ పాయింట్లు, బిర్యానీ పాయింట్లలో గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతిరోజు 20 కిలోల చొప్పున అమ్మే వ్యాపారులు ప్రస్తుతం 10 కిలోలతోనే సరిపెడుతున్నారు. ఏడు నుంచి తొమ్మిది వారాలకు కోడి పిల్లలు సిద్ధమవుతాయి. దీంతో ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచ్ లు రాలేదు. ఎన్నికల కారణంగా డిమాండ్ పెరగడం, మార్కెట్ లో సరఫరా లేకపోవడం చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. 20 రోజుల వ్యవధిలోనే కేజీకి రూ.40 నుంచి రూ.60 మధ్యలో తేడా వచ్చింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతోపాటు వాతావరణం చల్లగా ఉండటంతో పౌల్డ్రీ రైతులు కొత్త బ్యాచ్ లను తెస్తున్నారు. ఇవి మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాతే ధరలు తగ్గే అవకాశం ఉంది. చికెన్ ధరలు పెరగడంతో కొనేవారు తగ్గిపోతున్నారని వ్యాపారస్తులు అంటున్నారు. మధ్య తరగతి ప్రజలు చికెన్ కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. సమీప భవిష్యత్తులో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల విజయోత్సాహం విందులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతోఈ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.