మామిడి పరిశ్రమల సిండికేట్ మాయాజాలం
మామిడి మద్దుతు ధర ప్రకటించని ఫ్యాక్టరీలు
చిదంబర రహస్యంగా మద్దతు ధర
అకస్మాత్తుగా సోమవారం భారీగా తగ్గిన ధర
జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
చేష్టలు ఉడిగిన ఉద్యానవన, మార్కెట్ శాఖలు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమల సిండికేట్ మాయాజాలం నడుస్తోంది. ఈ సిండికేట్ జిల్లా అధికారుల ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదు. యదేచ్చగా తాము చెప్పిందే వేదం అన్నట్లు ధరలను నిర్ణయిస్తున్నారు. రోజురోజుకు ధరలను తగ్గిస్తూ మామిడి రైతుల స్వేదాన్ని లాభాలుగా మార్చుకుంటున్నారు. ఈ విషయంలో ఉద్యానవన శాఖ, మార్కెట్ కమిటీ అధికారులు చేష్టలుడికి నిచ్చేస్టులుగా ప్రేక్షక పాత్రను వహిస్తున్నారు. మామిడి గుజ్జు ఫ్యాక్టరీలను నియంత్రించలేకపోతున్నారు. వారి దయా దక్షిణాల మీద జిల్లాలోని మామిడి రైతులు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామిడిపంటకు బీమా సౌకర్యం కల్పించాలన్న ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు. అలాగే జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వ రంగంలో కానీ, సహకార రంగంలో గానీ మామిడి గుజ్జు ఫ్యాక్టరీ స్థాపించాలని జిల్లాలోని మామిడి రైతులు కోరుతున్నా, ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదు. మామిడి రైతుల గోడును అటు ప్రభుత్వం, ఇటు జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో మామిడి సిండికేట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. మామిడి ధరలను పెంచే సమయంలో మాత్రం రోజుకు రూపాయి వంతున పెంచుతూ, ఫ్యాక్టరీల మందు ట్రాక్టర్లు ఎక్కువగా కనిపించగానే ఐదు రూపాయలు వంతున తగ్గిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగే ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గానీ జిల్లాల్లో కనిపించడం లేదు. దీనితో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు మాత్రం లాభాలను పోగుచేసుకుంటున్నారు. మామిడి రైతులు మాత్రం నష్టాల్లో కురుకుపోతున్నారు.
జిల్లాలో సుమారుగా లక్షా, 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇందులో 20వేల ఎకరాలు లేత తోటలు కాగా లక్ష యాభై వేల ఎకరాల్లో కాపు వస్తుంది. జిల్లాలో సగటున 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్చిఉంది. అయితే వ్యతిరేక వాతావరణం కారణంగా 10 శాతం పంట వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. సగటున జిల్లాలో సంవత్సరానికి 5 లక్షల టన్నుల మామిడి దిగిబడి రావల్చి ఉండగా, ఈ సంవత్సరం ఒకటి లేక రెండు లక్షల తన్నులు దిగుబడి రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 31 గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఫ్రూటెక్స్ సంస్థ రంగ ప్రవేశం చేయడంతో, జిల్లాలో ప్రారంభ ధర 28 రూపాయలుగా గుజ్జు పరిశ్రమ యజమానులు నిర్ణయించారు. దానికి రూపాయి తగ్గించి 27 రూపాయలతో మండీలు, వర్తకులు కొనుగోలు చేశారు. అయితే ఈమధ్య మామిడి గుజ్జు పరిశ్రమ యజమానులు సమావేశమై మామిడి మద్దతు ధరను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 28 రూపాయలు ఉన్న మామిడి ధర క్రమంగా 24 రూపాయలకు చేరుకుంది. సోమవారం నాటికి నాలుగు రూపాయలను తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే ఏ ఫ్యాక్టరీ ఎంత ధరను నిర్ణయించింది సాయంకాలం వరకు ఎవరికీ సమాచారం లేదు. మామిడి ధరలు ఘననీయంగా తగ్గాయని మాత్రం చెబుతున్నారు. ఒక అంచనా మేరకు టన్ను మీద 3000 నుంచి 4 వేల రూపాయలు తగ్గినట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్యాక్టరీల్లో 25 రూపాయలు ధర అంటుండగా, మరికొన్ని ఫ్యాక్టరీల్లో 24 రూపాయలుగా చెబుతున్నారు. దీంతో ఆదివారం ఉన్న ధర అకస్మాత్తుగా సోమవారం తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధరలను సాయంకాలం వరకు ప్రకటించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఏ ధరకు ఫ్యాక్టరీకి కాయలను సరఫరా చేస్తున్నది తెలియక అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
*మామిడి ధర చిదంబర రహస్యం*
చిత్తూరు జిల్లాలో 31 వరకు గుజ్జు పరిశ్రమంలో ఉన్నాయి. ఈ పరిశ్రమలకు కలుపుతూ పరిశ్రమల సమాఖ్య కూడా చిత్తూరు కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఇప్పటివరకు ఏ ఫ్యాక్టరీలో ఎంత రేటు ఉన్నది ఏ ఫ్యాక్టరీ కూడా బహిరంగంగా తెలియజేయడం లేదు. పత్రికాముఖంగా ప్రకటించడం లేదు. ఫ్యాక్టరీ ముందర ధరను తెలియజేసే నోటీసు బోర్డు కూడా ఉండడం లేదు. మామిడి రైతులు సరఫరా చేసే మామిడి ఇన్వాయిస్ మీద కూడా ధర ఉండదు. కేవలం ఎన్ని టన్నుల మామిడిని సరఫరా చేశామన్న విషయం తప్ప, ఎంత ధరకు సరఫరా చేశామన్న విషయం మామిడి రైతుకు తెలియదు. మామిడి ఫ్యాక్టరీల ఏజెంట్లుగా ఉన్న లేక భాగస్వాములుగా ఉన్న వారికి మాత్రమే మామిడి ధరల గురించి తెలుస్తాయి. వారు రైతులకు తెలియజేస్తారు. నేరుగా ఫ్యాక్టరీ నుండి గాని, మామిడి పరిశ్రమల సమాఖ్య నుంచి గాని మామిడి ధరల గురించి ఎలాంటి ప్రకటన ఉండదు. జిల్లాలోని ఉద్యానవన శాఖ అధికారులు కానీ, మార్కెటింగ్ శాఖ అధికారులు గానీ ఈ విషయంలో కలగజేసుకోరు. ఏ రోజు ఎంత ధర ఉన్నది రైతులకు తెలియ చెప్పాలన్న నియమం కూడా పాటించడం లేదు. దీంతో ధరల విషయంలో మామిడి రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈరోజు ధర ఎంత ఉందో మామిడి రైతుకు తెలియకపోవడంతో అయోమయ పరిస్థితిలో మధ్య రైతులు ఫ్యాక్టరీలకు మామిడిని సరఫరా చేస్తున్నారు. ఫ్యాక్టరీ యజమాని ఎంత ఇస్తే అంత తీసుకోవడం తప్ప ప్రశ్నించే అవకాశం రైతులకు లేదు. ఈ విషయమై ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించగా మామిడి ధరలను ప్రకటించే పద్ధతి ఏది ఇప్పటివరకు జిల్లాలో లేదని అంటున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ అధికారులు కలగజేసుకొని ఏ రోజు మద్దతు ధరను ఆ రోజు పత్రిక ముఖంగా ప్రకటించాలని రైతులు కోరుకుంటున్నారు. అలాగే ధరల నియంత్రణకు జిల్లాస్థాయిలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, అందులో రైతులను రైతు సంఘాలను భాగస్వామ్యం చేసి ధరలను నియంత్రణ చేయడానికి ఒక యంత్రాంగానికి రూపకల్పన చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నారు.