6, జూన్ 2024, గురువారం

70 శాతం ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు టిడిపికే



ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

చిత్తూరు జిల్లాలో 70 శాతం ప్రభుత్వ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ పట్ల మొగ్గు చూపారు. జిల్లాలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 70  శాతం తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. మంగళవారం జరిగిన  ఓట్ల లెక్కింపులో ఈ విషయం వెల్లడయ్యింది. పలమనేరు, కుప్పం, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలలో ప్రభుత్వ ఉద్యోగులు 75 శాతం తమ ఓట్లను తెలుగుదేశం పార్టీకి వేశారు. చిత్తూరులో 69 శాతం, పూతలపట్టులో 64 శాతం, పుంగనూరులో 60 శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి లభించాయి. జిల్లాలో 16,312 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటుగాగా, ఇందులో తెలుగుదేశం పార్టీకి 11,381 ఓట్లు రాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 4,931 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీకి పోస్టల్ బ్యాలెట్ లలో 6,446 ఓట్ల మెజారిటీ జిల్లా వ్యాప్తంగా లభించింది. పలమనేరు నియోజకవర్గంలో 2048 ఓట్ల గాను తెలుగుదేశం పార్టీకి 1534 ఓట్లు, కుప్పంలో 1336 కు గాను 1003 ఓట్లు, గంగాధర నెల్లూరులో 2300 ఓట్లకు 1721 ఓట్లు, నగరిలో 2267 ఓట్లు గాను 1703 ఓట్లు, చిత్తూరు నియోజకవర్గంలో 3395 ఓట్లకు 2332 ఓట్లు, పూతలపట్టు నియోజకవర్గంలో 2404 ఓట్ల గాను 1545 ఓట్లు, పుంగనూరు నియోజకవర్గంలో 2562 ఓట్ల గాను 1543 ఓట్లు తెలుగుదేశం పార్టీకి లభించాయి.


జిల్లాలో భారీ ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఎవరికి అనుకూలంగా ఉంటుందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగింది.   గత ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉగ్యోగ వ్యతిరేక వైఖరిని అవలంభించిన కారణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే ఎక్కువ పడ్డాయని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, నాయకులు భావించారు. వారు ఉహించిన విధంగానే ప్రభుత్వ ఉద్యోగులు టిడిపికే జై కొట్టారు. జగన్ ప్రభుత్వం ఎన్నికల విధుల నుండి ఉపాధ్యాయులను తప్పించి, గ్రామ సచివాలయ సిబ్బంది చేత నిర్వహించాలని పథకం ప్రకారం పావులుకలిపింది.  అయితే ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఎన్నికల విధులను ఉపాధ్యాయులతో మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. అలాగే గతంలో  ఇచ్చిన పిఆర్సి రివర్స్ లో ఉండడం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహావేశాలతో ఉన్నట్లు తెలుస్తోంది. పిఆర్సి నిర్వహిస్తే జీతాలు పెరగడం పోయి, తగ్గడంతో పాత పిఆర్సినే అమలు చేయాల్సిందిగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు రోడ్డు కెక్కిన విషయం తెలిసిందే. అలాగే ఉపాధ్యాయుల ఛలో విజయవాడ కార్యక్రమం మిద ఉక్కుపాదం మోపింది. ఉపాధ్యాయులను హౌస్ అరెస్టు చేశారు. బస్సులలో, రైళ్ళలో ఎక్కకుండా అడ్డుకున్నారు. ఆందోళనకు హాజరైన వారి మిద క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అలాగే విద్యాశాఖ ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్ జిల్లాల్లో పర్యటిస్తూ అధ్యాపకులను భయభ్రాంతులకు గురి చేశారు. వారు ఎక్కడికి వెళితే అక్కడ ఉపాధ్యాయుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయులను కలిసివేసింది. దీనికి తోడు ఉద్యోగ ఉపాధ్యాయులు జీతాల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రతినెల 1వ తేదీన ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు అందిస్తుండగా జగన్ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 1వ తారీకు నుంచి 15వ తారీకు లోపు ఎప్పుడైనా జీతాలు పడే పరిస్థితి ఏర్పడింది. నిర్దిష్టంగా జీతాలు ఒక తేదీ అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. ఒకటవ తారీఖున చెల్లించాల్సిన ఈ ఎం ఐ లు, ఇతర విషయాలను వాయిదా వేసుకోవలసి వచ్చింది.  ఈ ఎం ఐ లు సక్రమంగా చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీని ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఉపాధ్యాయ ఉద్యోగుల ఖాతాల్లోని పిఎఫ్ మొత్తాలు కూడా మాయమయ్యాయి. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగిందని అంటూనే, వాటిని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టలేదు. పిఎఫ్ మీద ఉద్యోగులు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమోదం  లభించలేదు. పదవి విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా సకాలంలో బెనిఫిట్స్ అందలేదు. వీటికి తోడు అంగన్వాడి ఉపాధ్యాయులు 15 రోజులు పాటు సమ్మె చేసిన ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంటు చేస్తామని హామీని నెరవేర్చలేదు. దీంతో జగన్ ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడింది. దీనితో ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఈ పర్యాయం భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు టిడిపికి వేశారు. ఇలా గత ప్రభుత్వం మీద కక్ష్య తీసుకున్నారు. వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపడానికి తమవంతు కృషి చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *