11, జూన్ 2024, మంగళవారం

జిల్లా పరిషత్ మాజీ సి ఇ ఓ ప్రభాకర్ రెడ్డి మిద విచారణకు రంగం సిద్దం

జిల్లా పరిషత్ లో నాలుగు సంవత్సరాలుగా నో ప్రమోషన్, నో ఇంక్రిమెంట్ 

ప్రశ్నిస్తే సస్పెండ్, జీతాల నిలుపుదల 

వేదింపులు తాళలేక అయిదుగురు ఉద్యోగుల మృతి

పలు కోర్టు కేసులు, విచారణలు పెండింగ్ 

ఒకే సారి జిల్లా పరిషత్ లో నాలుగు పోస్టులు 

సినియర్లను పక్కన పెట్టి అడ్డగోలుగా  ఉన్నత పదవులు 

అవినీతి, అక్రమాలపై టిడిపి నేతల ఫిర్యాదు

ఉన్నత స్థాయి విచారణకు కలెక్టర్ సిఫారసు 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

 జిల్లా పరిషత్ సీఈఓ గా పని చేసిన ప్రభాకర్ రెడ్డి మీద ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బంది, ఆయన బాధితులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రభుత్వం మారడంతో ఆయన బాధితులు అందరూ ఏకమై ఆయన మీద ఫిర్యాదుల పరంపరకు శ్రీకారం చుట్టారు. వారికి తోడు తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నేరుగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను కలిపి జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి మీద లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి అవినీతి అక్రమాల మీద ఉన్నత స్థాయి విచారణ జరిపించాల్సిందిగా కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ షన్మోహన్ తనకు అదిన ఫిర్యాదులను పంచాయతీరాజ్ కమిషనర్ కు పంపి విచారణ అధికారి నియమించాల్సిందిగా కోరినట్లు తెలిసింది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే జిల్లా పరిషత్ వ్యవహారాల మీద ఐఏఎస్ అధికారి చేత విచారణ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లోకాయుక్త విచారణ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ ను జిల్లా పరిషత్ అవినీతి అక్రమాల మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. జిల్లా పరిషత్ లో ప్రభాకర్ రెడ్డి ప్లానింగ్ 2 సూపర్నెంట్ గా పనిచేశారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి హామీ పథకం నిధులను తమకు అనుకూలమైన బ్యాంకులలో డిపాజిట్ చేయించారని, వాటిని మీద వచ్చిన వడ్డీని దుర్వినియాగం చేశారని, సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమేమై విచారణ జరిపి జిల్లా ఆడిట్ అధికారులను  నివేదిక ఇవ్వాల్సిందిగా లోకాయుక్త ఆదేశించింది. అయితే ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అప్పట్లో విచారణ సక్రమంగా జరగకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఈలోపు సాధారణ ఎన్నికలు రావడంతో ఈ విచారణ మందగించింది. అయితే ఎన్నికలు పూర్తి కావడం, ప్రభుత్వం మారడంతో ప్రభాకర్ రెడ్డి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు కోరుతున్నారు. ప్రభాకర్ రెడ్డి ఈనెల ఆఖరిలో పదవి విరమణ చేయనున్నారు. కావున వెంటనే ససస్పెండ్ చేసి విచారణ జరిపించాలని కోరుతున్నారు. 



ప్రభాకర్ రెడ్డి ప్లానింగ్ 2 సూపర్నెంట్ నుండి బైరెడ్డిపల్లి ఎంపీడీవో గా పదోన్నతి మీద వెళ్లారు. ఆయన రెడ్డి సామాజిక వర్గం కావడం, జిల్లాకు చెందిన పెద్ద మంత్రి ఆశీస్సులు లభించడంతో, ఆయన జిల్లా పరిషత్తులు సర్వం తానే వ్యవహరించారు. జిల్లాలో ఉన్న ఎంపీడీవోలలో సీనియారిటీ లేకున్నా, తన రాజకీయ పలుకుబడితో జిల్లా పరిషత్ అకౌంట్ ఆఫీసర్ గా, జిల్లా పరిషత్తు డిప్యూటీ సీఈవోగా, జిల్లా పరిషత్ సీఈఓ గా ఆయన అదనంగా మూడు బాధ్యతలను నిర్వహించారు. ఆయన బైరెడ్డిపల్లి ఎంపీడీవో తో కలుపుకుంటే ఆయన నాలుగు పదవులను ఏకకాలంలో నిర్వహించారు. దీంతో ఆయనకు  జిల్లా పరిషత్తులు ఎదురులేకుండా పోయింది. ఆడింది అట, పడింది పాట అన్నట్లు సాగింది. సర్వం తానే కావడంతో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు తెర లేపినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాలో తమకు అనుకూలంగా లేని, టిడిపి సనుభుతిపరులను 20 మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. వారందరూ మళ్ళీ కోర్టుకు వెళ్లి పోస్టింగ్స్ తెచ్చుకున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్తులు గత నాలుగైదు సంవత్సరాలుగా ఎవరికి ఇంక్రిమెంట్లు లేవు. పదోన్నతులు లేవు. జిల్లా పరిషత్ సిబ్బందికే కాకుండా, జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే ఎంపీడీవోలకు కార్యాలయ సిబ్బందికి, ఉన్నత పాఠశాలలో పనిచేసే వాళ్ళకి కూడా ఇంక్రిమెంట్లను నిలుపుదల చేశారు. ఒక్కొక్క ఉద్యోగికి 6 నుంచి 7 ఇంక్రిమెంట్లు రావాల్సి ఉండగా, వాటిని ఇవ్వకుండా అడ్డుకున్నారు.  ఎవరైనా ప్రశ్నిస్తే వారు అవినీతికి పాల్పడ్డారని, వారిని సస్పెండ్ చేయడం ప్రభాకర్ రెడ్డి నైజంగా తెలుస్తోంది. అలాగే ఆయన వేధింపులు తారలేక అయిదుగురు ఉద్యోగులు చనిపోయారని తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఎస్పీకి, జిల్లా పరిషత్ సీఈవో గ్లోరియాకు ఇచ్చిన వినతిపత్రాలలో తెలిపారు. గుడిపల్లి ఎంపీడీవో గా పనిచేసిన శ్రీనివాసులు, నాగలాపురం ఎంపీడీవోగా పనిచేసిన బాల గణేష్ ,జడ్పీలో ఎగువసేని సహాయకుడిగా పనిచేసిన పురుషోత్తం రెడ్డి, ముద్రలేఖికుడు కెనడి బాబు, కార్యాలయ సహాయకుడు యుగంధర్ మృతికిప్రభాకర్ రెడ్డి వేధింపులే కారణంగా పేర్కొన్నారు. వారికీ జీతాలు ఇవ్వకుండా, ఆయన వారిని మానసికంగా వేధించడంతో వారు మృతి చెందారని, వారి మరణాల మీద కూడా విచారణ జరపాలని కోరారు. ప్రభాకర్ రెడ్డి హయాంలో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఇందుకు సంబంధించి విచారణ జరిపించాలని కోరారు. జిల్లా పరిషత్ క్వార్టర్స్లు మరమ్మత్తుల కోసం 15 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయగా ,వాటిని కూడా దుర్వినియోగం చేశారని టిడిపి నాయకులు పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి అవినీతి అక్రమాల మీద జిల్లాకు చెందిన టిడిపి శాసనసభ్యులు కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పలమనేరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్టు సమాచారం. ప్రభాకర్ రెడ్డి అవినీతి అక్రమాలను ఉపేక్షించేది లేదనీ, దానిమీద విచారణ జరిపించాలని గట్టిగా కోరినట్లు తెలిసింది. అసలు జిల్లా పరిషత్తులు అవినీతి అక్రమాలు భారీ ఎత్తున జరుగుతుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుందని నిలదీసినట్లు సమాచారం. దీంతో జిల్లా అధికారులు కూడా ప్రభాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. ప్రభాకర్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదులను పంచాయతీరాజ్ కమిషనర్ కు పంపినట్లు తెలిపి తెలిసింది. ప్రభాకర్ రెడ్డి అవినీతి అక్రమాల మీద విచారణ అధికారి నియమించి, ఆయన ఉద్యోగ విరమణ లోగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో జిల్లా కలెక్టర్ కోరినట్లు సమాచారం. జిల్లా జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి మీద ఇప్పటికే పలు కేసులు లోకాయుక్తంలోనూ, సమాచార హక్కు చట్టం, వివిధ కోర్టులలో  నడుస్తున్నాయి. పలువురు ఉద్యోగులు ఆయన మీద ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మారడంతో జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి మీద నలువైపుల ఉచ్చుబిగుస్తుంది. ఆయన అవినీతి, అవకతవకలతో పాటు కార్యాలయ సిబ్బంది వేధింపులు, వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు తొక్కి పెట్టడం మొదలైన వాటి మీద సమగ్ర విచారణకు రంగం సిద్ధం అవుతుంది. రెండు మూడు రోజుల్లో విచారణ అధికారిని నియమించే అవకాశం ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *