పెరిగిన పించన్లతో కారణంగా జిల్లాలో 2,61,544 మందికి లబ్ధి
జులై నెలలో అవ్వతాతలకు రూ. 7 వేలు
వికలాంగులకు రూ. 15 వేలు
లబ్దిదారులలో హర్షాతిరేకాలు
( ప్రభ న్యూస్ బ్యూరో )
నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెంచిన సామాజిక పించన్ల కారణంగా చిత్తూరు జిల్లాలో 2,61,544 మంది లబ్ధి పొందనున్నారు. వీరికి జూలై నెల నుంచి పింఛన్ మొత్తం పెరగనుంది. ఏప్రిల్ మొదటి తారీఖు నుండి పెంచడంతో మూడు నెలల బకాయిలు కలిపి ఏడు వేల రూపాయలను అందుకోనున్నారు. ఇదివరకు ఉన్న సామాజిక పెన్షన్లను వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కార్మికులు, కళాకారులు, హెచ్ఐవి భాదితులు, హిజ్రాలు, చెప్పులు కుట్టే వారికి మూడు వేల రూపాయల నుంచి 4వేల రూపాయలుగా పెంచనున్నారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్ నుంచి లెక్కగట్టి, ఒకేసారి ఏడువేల రూపాయలుగా అందజేయనున్నారు. అలాగే దివ్యాంగులకు 3000 ఉన్న పెన్షన్ 4000 రూపాయలు చేయనున్నారు కుష్టు వ్యాధి తో వైకల్యం సంభవించిన వారికి పెన్షన్ కూడా 3వేల నుంచి 6 వేలకు పెరగనుంది. కిడ్నీ, కాలేయం, గుండె అపరేషన్ చేసుకున్న వారికి, డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలసరి పింఛన్ 5000 నుంచి 10000 రూపాయలకు పెరగనుంది. మంచాన్నికే పరిమితమైన వారికి పింఛన్ 5000 నుండి 15 వేలకు పెరుగుతుంది. ఈ మొత్తాలను మూడు నెలల బకాయిలతో కలిపి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన సందర్భంగా కానుకగా ఇవ్వనున్నారు. ఇందుకు జిల్లా అధికారులు కూడా కసరత్తు ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో వివిధ రకాల పింఛన్లు కింద 2,72,864 మంది పించన్ అందుకుంటున్నారు. వీరిలో అభయ హస్తం అందుకుంటున్న 11,358 మందికి, సైనిక వెల్ఫేర్ పింఛన్లను అందుకుంటున్న 62 మందికి ఈ పించన్ల పెంపు వర్తించదు. మిగిలిన 2,61,554 మందికి పింఛన్ మొత్తాలు పెరగ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ కింద 1,46, 023 మందికి అవ్వ తాతలకు పింఛన్లు అందజేస్తున్నారు. 2,575 మంది చేనేత కార్మికులకు, 59, 903 మంది వితంతువులకు, 35,927 మంది వికలాంగులకు, 562 మంది కల్లుగీత కార్మికులకు, 32 మంది హిజ్రాలకు, 5751 మంది ఒంటరి మహిళలకు, 248 మంది చేపలు పట్టేవారికి, 6,296 మంది డప్పు కళాకారులకు, 794 మంది చెప్పులు కుట్టే వారికి, 71 మంది కళాకారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. అలాగే వివిధ వ్యాధిగ్రస్తులకు 2,764 మందికి, ప్రైవేట్ గా డయాలసిస్ చేసుకుంటున్న వారికి 303 మందికి, ప్రభుత్వపరంగా డయాలసిస్ చేసుకుంటున్నా 195 మందికి పెన్షన్లు పెరగనున్నాయి. పెన్షన్ మొత్తాలు భారీగా పెరగనుండటం, పెంచిన మొత్తాన్ని మూడు నెలల బకాయిలతో కలిపి ఇస్తుండటంతో జిల్లాలోని పింఛనుదారులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.