అతిధిగా చిత్తూరుకువచ్చిఅనూహ్య విజయం సొంతం చేసుకున్న దగ్గుమళ్ళ
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
దగ్గుమళ్ళ ప్రసాదరావుకు రాజకీయ నేపథ్యం లేదు. ఎన్నడు రాజకీయాలలో వేలు పెట్టింది లేదు. ఎప్పుడు పోటీ చేసింది కూడా లేదు. ఆయన ఊహించన విధంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంతే ఊహించని విధంగా చిత్తూరు నియోజకవర్గంలో నుంచి రెండు లక్షల 20 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి మునుపటి రికార్డును బద్దలు కొట్టారు. ఆయన అనుకోకుండా రాజకీయ రంగంలో అడుగు పెట్టారు. అయితే రాజకీయ పార్టీని మాత్రం ఆచితూచి ఎంపిక చేసుకున్నారు. ఏ పార్టీలో చేరితే, ప్రజలకు చేరువై, సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయం మిద లోతైన అధ్యాయనం చేశారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ నచ్చిన ఆయనకు నచ్చింది. దీంతో కాకతాళింగానే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, పూణే, ఔరంగాబాద్, లాతూర్, ఉస్మానాబాద్, నాందేడ్, బెంగళూరు, గుల్బర్గా వంటి ప్రాంతాలలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేశారు. ఆయనకు హోదాకు కానీ, డబ్బులకు గాని కొదవలేదు. ప్రజలకు ఏదో చేయాలి అన్న తపనతో మూడు సంవత్సరాల సర్వీసు ఉండగానే పదవీ విరమణ చేశారు. అప్పటికీ కూడా దగ్గుమళ్ళకు రాజకీయాల్లోకి రావాలన్నా ఆలోచన లేదు. తనను ఇంత వాడిని చేసిన ఈ సమాజానికి ఏదో చేయాలన్న ఆలోచన, తపన మాత్రం దగ్గుమళ్ళలో నిగూఢంగా ఉంది. అందుకే ఆయన స్వగ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లైబ్రరీని కూడా ప్రారంభించారు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి, అవసరం ఉన్నవాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం ప్రారంభించారు. చదువుకున్న వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు ఇప్పించి ఉద్యోగాలు వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. అలా సుమారుగా 20 మంది ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నారు. తను ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు కూడా తనకు ఉన్న పరిచయాల ద్వారా చాలామందికి సిఫార్సు చేసి ఇప్పించారు. చిన్నతనం నుంచి సేవా భావం కలిగిన దగ్గుమళ్ళ ప్రజా సేవ చేయడానికి ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటికే ఆయన కుమారుడు రాదే భవన నిర్మాణ రంగంలో బాగా స్థిరపడ్డారు. కొడుకు రాధేను సివిల్ సర్వీస్ కుసిద్దం చేసి, మంచి ఆఫీసర్ కావాలని ఘజియాబాద్ జిఎంటి బిజినెస్ కాలేజీలో చదివించారు. రాదేకు ఉద్యోగం చేయడం ఇష్టం లేక వ్యాపార రంగాన్ని ఎంచుకున్నారు. తండ్రి నుంచి ఆర్థిక సహాయం కూడా లేకుండా భవన నిర్మాణ రంగంలో అడుగుపెట్టి సక్సెస్ దిశగా ప్రయాణం చేస్తున్నారు. దీంతో దగ్గుమళ్ళను కూడా ఉద్యోగం మానేసి, నిర్మాణ కంపెనీలకి రావలసిందిగా ఆహ్వానించారు. కొంతకాలం భవన నిర్మాణ రంగంలో దగ్గుమళ్ల కూడా పనిచేయడంతో ఆ సంస్థ బాగా అభివృద్ధి సాధించింది. భవన నిర్మాణ కంపెనీలో చేరిన తర్వాత అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాళ్ళు. తాము చేసే సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ సహాయం కూడా తోడైతే బాగుంటుందన్న ఆలోచన కుమారుడు రాదేకు వచ్చింది. ఈ ఆలోచనను ఆయన తన తండ్రితో పంచుకున్నారు. తండ్రి కూడా ఈ విషయం పైన దృష్టిని సారించారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయ రంగంలో ప్రవేశిస్తే మరింత విస్తృతమైన అవకాశాలు ఉంటాయని దగ్గుమళ్ల కూడా భావించారు. ఏ పార్టీలో చేరాలి అన్న విషయం మీద కొంతకాలం అధ్యయనం జరిగింది. చంద్రబాబు నాయుడు విజన్, ఆయన ఆలోచన సరళి, పనితీరు, పార్టీని నడిపే విధానం దగ్గుమళ్ళకు బాగా నచ్చాయి. దాంతో తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజాసేవ చేయాలన్న ఆలోచన దగ్గుమళ్ళకు వచ్చింది. దీంతో తన సొంత నియోజకవర్గమైన బాపట్ల మీద దగ్గుమళ్ళ దృష్టిని కేంద్రీకరించారు .ఒకరోజు సుముహూర్తం చూసుకొని తాను పార్టీలో చేరనున్నట్లు తన బయోడేటాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. దీంతో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని, దగ్గుమళ్ళబాపట్ల నియోజకవర్గంలో తన పనిని ప్రారంభించారు. పాఠశాలను బాగుపరచడం, లైబ్రరీ నిర్మాణం, వారికి ఆర్థిక సహాయం చేయడం, ఉద్యోగాలు చూసి పెట్టడం తదితర కార్యక్రమాలతో మంచి ప్రజాదరణ లభించింది. తాను పార్లమెంటుకు పోటీ చేస్తే బాగుంటుందని ఆలోచన దగ్గుమళ్ళకి వచ్చింది. దగ్గుమళ్ళ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అని కలిసి తనకు పార్టీ తరపున పోటీ చేయాలని ఉందని, బాపట్ల టికెట్ను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై కొంత సమాలోచన చేసిన చంద్రబాబు నాయుడు మీరు బాపట్ల కాదు చిత్తూరు నుండి పోటీ చేయండి అని దిశా నిర్దేశం చేశారు. తాను నాన్ లోకల్ అన్న అభిప్రాయాన్ని దగ్గుమళ్ళ చంద్రబాబు ముందు వ్యక్తం చేశారు. దీంతో ఆయన పార్లమెంట్ అభ్యర్థికి లోకల్ నాన్ లోకల్ అంటూ ఏది ఉండదని, చిత్తూరు నుంచి పోటీ చేయాలని కోరారు. దీంతో దగ్గుమళ్ళ చిత్తూరు నియోజకవర్గంపై దృష్టిని సారించారు. అయితే తనకు టికెట్ కేటాయించే వరకు మిన్న కొన్నారు. ఎటువంటి కార్యక్రమం చేయలేదు. చంద్రబాబు చెప్పిన విధంగానే దగ్గుమళ్ళ ప్రసాదరావుకు చిత్తూరు పార్లమెంటు కేటాయిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో దగ్గుమళ్ళ ప్రసాదరావు కొంత బెరుకుగానే చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టారు. తనకు పరిచయం లేని జిల్లా. పరిచయం లేని రాజకీయ నాయకులు. పరిచయం లేని ప్రజలు. ఎలా నెగ్గుకు వస్తానో అన్న ఆందోళన మాత్రం మనసులో లేకపోలేదు. అయితే ఆయన చిత్తూరుకు వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ ఆయనకు అకనుకూలంగా మారిపోయాయి. ఆయన చిత్తూరు లక్ష్మీ నగర్ కాలనీలో ఒక ఇంటిలో తీసుకొని కార్పొరేట్ తరహాలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పటికే జిల్లాలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఆహ్వానంతో ఆయన తొలుత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కుప్పం నుంచి చంద్రగిరి వరకు అభ్యర్థులతో మమేకమయ్యారు. కుప్పం, పలమనేరు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, నగరి, చంద్రగిరి నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించారు. అభ్యర్థులు ఆయనను అక్కున చేర్చుకున్నారు. తమవాడిగా ఆదరించారు. దగ్గుమళ్ళ ఎన్నికల మేనిఫెస్టో మీద మొదట దృష్టిని సాధించారు. విద్యావేత్త కావడంతో జిల్లాలో సమస్యలను అధ్యయనం చేశారు. సమస్యల పరిష్కారానికి మార్గాలను వెతకడం ప్రారంభించారు. ఏ ఏ సమస్యను తాను ఎంపీ అయితే పరిష్కరించవచ్చునో వాటిని వరుసగా రాసుకున్నారు. దానికి తగిన విధంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. చిత్తూరు పట్టణం జిల్లా కేంద్రమైనా, విద్యాపరంగా వెనుకబడి ఉండడంతో చిత్తూరును విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పేరుకు చిత్తూరు రైల్వే స్టేషన్ ఉన్న అక్కడ కనీస వసతులు కూడా లేదు. తాను పార్లమెంట్ సభ్యుడు హోదాలో చిత్తూరు రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసి, అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఏడాది నష్టపోతున్న మామిడి రైతుల మీద దృష్టిని కేంద్రీకరించి, చిత్తూరు జిల్లాకు మ్యాంగో బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వీటికి తోడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను జత చేశారు. చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్యను తీర్చడానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. అలాగే చిత్తూరును పరిశ్రమల హబ్ గా ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. మూతపడిన సహకార రంగ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తామని, తద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విద్యావేత్త అయిన దగ్గుమళ్ళ ప్రసాదరావు ఎన్నికల హామీలు ప్రజల్లోకి బాగా చొచ్చుకొని వెళ్ళాయి. ఆయన ముద్రించిన ఎన్నికల ప్రణాళిక గడపగడపకు చేరింది. గ్రామస్థాయిలో కూడా దీనిమీద చర్చ జరిగింది. గతంలో ఎంపీగా పనిచే పనిచేసిన వాళ్ళు ఎవరు నిర్దిష్టంగా ఎన్నికల ప్రణాళిక అంటూ ఏదీ లేకుండా ప్రజల ముందుకు వెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్థులు మీదనే పూర్తిగా ఆధారపడ్డారు. పార్టీ ఇమే,జ్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు తో తాము కూడా విజయం సాధిస్తామని భావించారు. దగ్గుమళ్ళ అలా కాకుండా స్వతంత్రంగా సమస్యలను అధ్యయనం చేసి ఒక ఎన్నికల ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రణాళిక ప్రజలను రాకట్టుకోవడంతో దగ్గు మళ్ల ప్రసాదరావుకు ఎక్కడ వెళ్లిన ఘనస్వాగతం లభించింది. ఆయన తమ సమస్యలు నెరవేర్చగలరన్న భావన ప్రజలలో ఏర్పడింది. ఇలా విజయానికి బీజాలు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు దగ్గుమళ్ళకు బాగా కలిసి వచ్చాయి. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఈ పర్యాయం తెలుగుదేశం గాలి బలంగా వీచింది. ఈ గాలిలో కూడా ఎగ్జిట్ పోల్స్ కొన్ని చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు పార్లమెంటులో టిడిపి అభ్యర్థి గెలవడం కష్టమని తెలిపాయి. అయితే ఓట్ల లెక్కింపునాడు ఊహించని విధంగా అనూహ్య మెజారిటీ లభించింది. రెండు లక్షల 20వేల పైచిలుకు ఓట్లు లభించాయి. గతంలో ఏ నాయకుడికి చిత్తూరు పార్లమెంట్లో ఎంత మెజారిటీ లభించలేదు. చిత్తూరు ప్రజలు తనను ఆదరించిన విధానానికి దగ్గుమళ్ళ ఫిదా అయ్యారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల సమస్యలను తీర్చి వారి రుణం తీర్చుకోవడానికి సంసిద్ధమవుతున్నారు. ఆర్థికంగా పరిపుష్టి కలిగిన దగ్గుమళ్ళ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో అధికార హోదాలను అనుభవించారు. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా అవతారామ్ ఎత్తినా, ఎంపి అయినా, ఎంత ఎదిగిన అంత ఒదిగి ఉండాలనే విధానంతో దగ్గుమళ్ళ నడుచుకుంటున్నారు. రానున్న కాలంలో చిత్తూరు వాణిని పార్లమెంటులో బలంగా వినిపించి, చిత్తూరు ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి సంసిద్ధమవుతున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను దగ్గుమళ్ళ ఎలా పరిష్కరిస్తారు వేసి చూడాల్సిందే.