మంత్రి పదవులలో చిత్తూరు జిల్లాకు మొండి చేయి
నిరాశలో ఆశావహులు
పుంగనూరు ఓడిపోవడమే కారణమా ?
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాలుగవ పర్యాయం రాష్ట్రం నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రివర్గం నుంచి చిత్తూరు జిల్లాలో ఎవరికి స్థానం కల్పించలేదు. చిత్తూరు జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానాన్ని ఆశించిన అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. చిత్తూరు జిల్లాకు ఈ పర్యాయం ఒకటి రెండు మంత్రి పదవులు వస్తాయని టిడిపి నేతలు కూడా ఊహించారు. చిత్తూరు జిల్లాకు ఒక మంత్రి పదవి కూడా లేకపోవడంతో చిత్తూరు జిల్లా టిడిపి నేతలు, ప్రజలు కూడా నిరాశకు గురవుతున్నారు. జిల్లాకు మంత్రి పదవి ఎందుకు రాలేదన్న విషయం మీద రాజకీయ వర్గాలలో జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. కారణాలను అన్వేషిస్తున్నారు.
కుప్పం నియోజకవర్గం నుంచి ఎనిమిదవ పర్యాయం వరుసగా విజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితోపాటు మంత్రులుగా అవకాశం లభిస్తుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి, గంగాధర నెల్లూరు శాసనసభ్యుడు థామస్, పూతలపట్టు శాసనసభ్యుడు మురళీ మోహన్ భావించారు. అయితే వారి ఆశలు నెరవేరలేదు. జిల్లా నుండి ఒకరికి కూడా మంత్రివర్గంలో అవకాశం లేకపోవడంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో స్తబ్దత నెలకొంది. రాజకీయ పరిశీలకుల విశ్లేషణ మేరకు పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా పోవడం ఒక కారణం కాగా, జిల్లాలో నెలకొన్న వర్గ విభేదాలు మరో కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీమంత్రి అమర్నాథరెడ్డితో పాటు, పీలేరు శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించారు. ఇద్దరూ ఈ పర్యాయం తమకు మంత్రి పదవులు ఖాయమనే ధీమాతో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డి, అన్నమయ్య జిల్లా నుంచి కిషోర్ కుమార్ రెడ్డిలు మంత్రివర్గంలో తమ స్థానం పదిలమని భావించారు. అయితే ఊహించిన విధంగా ఇరువురికి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. ఇందుకు ప్రధాన కారణం పుంగనూరులో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాకులో ఉన్నా, పార్లమెంటు పరిధిలో రాజంపేటకు వస్తుంది. పుంగనూరు నియోజకవర్గానికి ఒకవైపు పీలేరు, మరోవైపు పలమనేరు నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి గతంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన అనీషా రెడ్డిని తప్పించి చల్లా రామచంద్రారెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సిఫాసు మేరకు చెల్లా బాబును నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. చల్లా బాబుకు టికెట్లు ఖరారు చేసిన తర్వాత ఇటు కిషోర్ కుమార్ రెడ్డి గాని, అటు అమర్నాథరెడ్డి గారిని పుంగనూరు నియోజకవర్గంను ఎవరు పట్టించుకోలేదు. ఆ నియోజకవర్గంలో ఎవరు ప్రచార కార్యక్రమాలలో పాలుపంచుకోలేదు. గెలుస్తామన్న అతి విశ్వాసంతో చల్లా రామచంద్రారెడ్డి కూడా తన నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి కిషోర్ కుమార్ రెడ్డిని కానీ, అమర్నాథ్ రెడ్డి కానీ ఆహ్వానించలేదని తెలుస్తోంది. బ్యానర్లలో కూడా అమర్నాథరెడ్డి ఫోటో లేకుండా చల్లా రామచంద్రారెడ్డి ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. మండల, నియోజకవర్గ స్థాయి నేతలను కూడా పక్కనపెట్టి ఒంటరిగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న విమర్శలు ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గం నుంచి గతంలో అమర్నాథ్ రెడ్డి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందారు. వారి తండ్రి రామకృష్ణారెడ్డి మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందారు. అయినా అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను పక్కన పెట్టడంతో ప్రచార కార్యక్రమంలో ఎవరు పాల్గొనలేదు. టిక్కెట్టు ఖరారు అయిన తర్వాత నామినేషన్ సమయంలో కూడా చల్లా రామచంద్రారెడ్డి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని కానీ, గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అనీషా రెడ్డిని గాని ఆహ్వానించలేదు. పార్టీ తరపున ప్రచారం చేయాలనీ కోరలేదు. దీనితో దీంతో అనీశా రెడ్డి వైసీపీలో చేరి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయానికి ప్రచారం చేశారు. ఇలా ఇరువురి నేతలు పుంగునూరు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో, చిత్తూరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినా, పుంగనూరులో మాత్రం ఓటమిపాలైంది. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విజయం సాధించారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు మీద ఆయన స్థాయిని కూడా మరచి, నీచంగా విమర్శలు చేశారు. చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని, ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేదని, వెన్నుపోటు దారుదని, రాజకీయ జీవితం సమాప్తం అని, బాబు పని అయిపోయిందని, కుప్పంలో ఓడిస్తామని, బాబుకు ఓటమి తప్పదని నిత్యం పలు రకాలుగా విమర్శలు చేశారు. ఆయన విమర్శలకు దీటుగా జిల్లాలోని నాయకులెవరు సమాధానం ఇవ్వలేకపోయారు. రామచంద్రారెడ్డిని కట్టడి చేయడంలో జిల్లా నాయకులు విపలమయ్యారని రాష్ట్ర టిడిపి కార్యాలయ నాయకులకు కూడా ఒక దశలో ఆవేదన చెందారు. రామచంద్రారెడ్డిని కట్టడి చేయడంలో విపలం కావడంతో పాటు, ఆయనను ఓడించ లేకపోవదాన్ని కూడా చంద్రబాబు తీవ్రంగా పరిగానిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా మంత్రి పదవి రాకపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. జిల్లాకు చెందిన నాయకులందరికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో లోపాయకారిసంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఎక్కడ బహిరంగ సభ పెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా మాట్లాడేవారు. పాపాల పెద్దిరెడ్డి, నీ ఆటలు ఇంక సాగవు, నిన్ను చిత్తుగా ఓడిస్తాం, నీ అంతు చూస్తానని, ప్రకృతి సంపద ఇసుక, మైనింగ్ దోచుకున్నారని, ఎన్నికల తర్వాత తిన్నదంతా కక్కిస్తానని, రానున్న ఎన్నికల్లో రామచంద్రారెడ్డిని ఓడిస్తానని పలుమార్లు చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు మనస్థాపం చెంది, చిత్తూరు జిల్లాకు మంత్రి పదవి ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి జిల్లాలో జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నూతనకాల్వ అమరనాధ రెడ్డిలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరంటే, ఒకరికి పడదు. ఎవరి వర్గాన్ని బలోపేతం చేసుకోవడానికి వారు ప్రయత్నాలు చేశారు. దీంతో వర్గ విభేదాలు వర్గ విభేదాలను ప్రోత్సహించకూడదు అన్న ఆలోచనతో కూడా జిల్లాకు మంత్రి పదవులు దక్కలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా చిత్తూరు జిల్లాకు మంత్రి పదవి రాకపోవడం జిల్లా ప్రజలను నిరాశకు గురయ్యారు. వైసిపి ప్రభుత్వంలో జిల్లాకు మూడు మూడు మంత్రి పదవులు దక్కాయి. టిడిపి పాలనలో ఒక్కటి కూడా లేకపోవడంతో జిల్లా తెలుగుదేశం పార్టీని ఎవరు ముందుండి నడుపుతారు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.