మామిడి రైతుల గోడు పట్టించుకోని ప్రజాప్రతినిధులు
ధరలు పతనమైనా స్పందించని నేతలు
ప్రకృతి వైపరిత్యాలలో, తెగుళ్ళతో నష్టపోయిన రైతు
ధరలు తగ్గడంలో ఆవేదన చెందుతున్న రైతులు
జిల్లా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని వినతి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో మామిడికాయల ధరలు పతనమై, మామిడి రైతులు ఇబ్బందులకు గురవుతుంటే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరు నోరు మెదపడం లేదు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు వారిని కష్ట కాలంలో ఆదుకోవడం లేదు. వారికీ అండగా నిలువడం లేదు. వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. కష్ట కాలంలో వారికీ అండగా నిలువడం లేదు. రైతుల సమస్యలపై బిజెపి, కమ్యూనిస్టు నాయకులు మాత్రం మాట్లాడుతున్నారు. జిల్లా అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా ఈ విషయమై స్పందించలేదు. తమకు పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆరింటిలో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించింది. పుంగనూరులో మాత్రం వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. అలాగే చిత్తూరు పార్లమెంటు నుండి గతంలో ఎన్నడూ లేనివిధంగా దగ్గుమల్ల ప్రసాదరావు లక్ష ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వీరందరూ రైతుల ఓట్లతో గద్దెనెక్కిన నాయకులే. అయితే రైతుల కష్టకాలంలో ఉన్నా, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ ను కలువడం లేదు. మామిడి ధరను నియంత్రించాలని కోరడం లేదు. జిల్లాలో మామిడి ధరలు రోజురోజుకు పతనం అతున్నాయి. జిల్లాలో టన్నుకు 28 వేల రూపాయలతో మార్కెట్ ప్రారంభం కాగా, ప్రస్తుతం 22 వేల రూపాయలకు చేరుకుంది. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని రైతులు గగ్గోలు పెడుతుండగా, ప్రజాప్రతినిధి ఎవరు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 58 వేల హెక్టార్లలో మామిడి పంట ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మామిడి పంట గణనయంగా తగ్గింది. గతంతో పోల్చుకుంటే పది శాతం కూడా దిగుబడి కష్టంగా ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 31 గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. వీటికి తోడు చిత్తూరు, బంగారుపాలెం, దామలచెరువులలో మామిడి మార్కెట్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా రాంపులు, వర్తకులు భారీగా వచ్చి చిత్తూరు జిల్లాలో మామిడిని కొనుగోలు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఫ్రూటెక్స్ సంస్థ రంగ ప్రవేశం చేయడంతో, జిల్లాలో ప్రారంభ ధర 28 రూపాయలుగా గుజ్జు పరిశ్రమ యజమానులు నిర్ణయించారు. దానికి రూపాయి తగ్గించి 27 రూపాయలతో మండీలు, వర్తకులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈమధ్య మామిడి గుజ్జు పరిశ్రమ యజమానులు సమావేశమై మామిడి మద్దతు ధరను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 28 రూపాయలు ఉన్న మామిడి ధర క్రమంగా 22 రూపాయలకు చేరుకుంది. ఈ విషయమై పలువురు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి ఉద్యానవన శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో టెలికాన్పిరెన్సు నిర్వహించారు. తోతాపురి మామిడి 30 వేల రూపాయలకు తగ్గకుండా గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశించినా, మామిడి గుజ్జు పరిశ్రమ యజమానుల్లో కానీ, వర్తకులలో గాని ప్రతిస్పందన లేదు. తాము ధరలు పెంచేది లేదని భీష్మంచుకుని కూర్చున్నట్లు తెలుస్తుంది. అయితే జిల్లాలో పడుతున్న భారీ వర్షాల కారణంగా మామిడి పంట పాడయ్యే అవకాశం ఉంది. మామిడికాయను ఈగలు కొరకడం ద్వారా కూల్లిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే రింగు రోగం, మంగు రోగంతో మామిడి రైతులు చాలా నష్టపోయారు. ఇది కాకుండా గతంలో కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా సగం వరకు మామిడి నేలపాలయ్యింది. ఈ సంవత్సరంలో అసలే కాపు తక్కువ. దానికి తోడు ప్రకృతి వైపరీత్యాలు, మామిడి తోటల్లో వస్తున్న రోగాలు రైతులకు క్రున్గాతేస్తున్నాయి. ఈ దశలో మామిడి రైతులను గురించి ప్రజాప్రతినిధులు ఎవరు నోరుమెదపక పోవడం పట్ల రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కలుగచేసుకొని తమకు మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.