జిల్లా అధికారులలో బదిలీల భయం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలోని అధికారులను బదిలీల భయం వెంటాడుతోంది. జిల్లాలో ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే జిల్లాలో అధికార యంత్రాంగంలో సమగ్ర ప్రక్షాళన తప్పదని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లాలోని శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. వారం, పది రోజుల్లో జిల్లాలు భారీ ఎత్తున బదిలీలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు విభాగంలో సమూల ప్రక్షాళన ఉంటుందని భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగో పర్యాయం భాధ్యతలు స్వికరిమ్చంచిన తర్వాత చిత్తూరు జిల్లా మీద క్రమంగా దృష్టిని సారిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అధికార యంత్రాంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కుప్పం పర్యటనకు రావడానికి రెండు రోజులకు ముందే జిల్లా కలెక్టర్ షన్మోహన్ బదిలీ అయ్యారు. ఒకరోజు ముందుగా కుప్పం నియోజకవర్గంలోని సిఐలు, ఎస్ఐలను సామూహికంగా బదిలీ చేశారు. అందరినీ వీఆర్ కు పంపారు. ఎవరికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ విషయాలను పరిశీలిస్తే చిత్తూరు జిల్లాలో గతంలో వైసిపికి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులు ఎవరికీ స్థానం ఉండదని తెలుస్తోంది. తొలుత ఐఏఎస్ అధికారుల బదిలీలతో బదిలీల కార్యక్రమం ప్రారంభమైంది. క్రమంగా జిల్లాలోని అన్ని భాగాలలో బదిలీల ప్రక్రియ ఉండవచ్చని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు, పంచాయతీరాజ్ అసోసియేషన్ నాయకులు, పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు. ఈ విషయమై ఇప్పటికే విచారణ జరుగుతుంది. ప్రభాకర్ రెడ్డి ఈనెలాఖరులోపుగా అదే విరమణ చేయనున్నారు. ఈలోపు ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గట్టిపట్టుదలతో టిడిపి నాయకులు ఉన్నారు. ఎన్నికలకు ముందు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ అరుణ ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. ఈ విషయమై ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి నాయుడు గంగినేని చెరువు కట్టమీద ప్రజలు కూర్చోవడానికి కుర్చీలను ఏర్పాటు చేశారు. వాటికి పసుపు రంగు ఉందని వాటిని ధ్వంసం చేశారు. అలాగే చిత్తూరు ఎంపీ దగ్గు మళ్ల కార్యాలయంలో తనిఖీ సమయంలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించాలని విమర్శలు ఉన్నాయి. వైసిపి బస్సు యాత్ర సందర్భంగా ఆమె వారికి అనుకూలంగా పనిచేశారని విమర్శలు ఉన్నాయి. దీంతో మున్సిపల్ కమిషనర్ లో బదిలీలు కూడా భారీగానే జరగనున్నాయని తెలుస్తోంది. జిల్లాలో చిత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, కుప్పం మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ కమిషనర్లను గత ప్రభుత్వంలో నియమించిన కారణంగా వారందరికీ స్థానచలనం తప్పదని తెలుస్తుంది. అలాగే చిత్తూరు ఆర్డీవో మీద కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లాలో చిత్తూరు,నగరి, పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీరి బదిలీలు కూడా తప్పదని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, పిడి డిఆర్డిఏ, పిడి ద్వామా, పిడి మహిళా సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బిసి కార్పొరేషన్లు, సంక్షేమ శాఖాల అధికారులు ఉన్నారు. వీరి పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుంది. జిల్లా అభివృద్ధిలో వీరి ప్రమేయం ఎక్కువ. ఈ విభాగాలకు అధికారులందరూ గత ప్రభుత్వ హయాంలోని నియమితులు కావడంతో పలువురు అధికారులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. ఇక పోలీసు విభాగం ప్రక్షాళనలో అగ్రస్థానంలో ఉంటుందని సమాచారం. ఎన్నికలకు ముందే ఎన్నికల కమిషన్ జిల్లా ఎస్పీ మణికంట చందోలును నియమించింది. తెలుగుదేశం పార్టీ నాయకుల ఫిర్యాదుల మేరకు జిల్లాలో కొందరు పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. ఇంకా కొంతమంది అధికారులు వైసీపీ పాలనలో నియమితులైన వారు కొనసాగుతున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడం, పుంగనూరులో చంద్రబాబు నాయుడుతో సహా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, టిడిపి నాయకులతో కలిపి 1000 మందికి పైగా కేసులను పోలీసులు బనాయించారు. అలాగే లోకేష్ యువగళం పాదయాత్రకు అడుగడునా ఆటంకాలు కలుగ చేశారు. మాట్లాడకుండా మైక్ లాక్కున్నారు. కుర్చీ మీద ఎక్కి మాట్లాడటానికి ప్రయత్నం చేయగా కుర్చీని కూడా లాక్కున్నారు. జిల్లాలో పలు పొలిసు స్టేషన్లలో కేసులను నమోదు చేశారు. ఇప్పట్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో పోలీసు విభాగం అంత పనిచేసింది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా భూగర్భగనుల శాఖ అవినీతి, అక్రమాలకు అంతులేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చిత్తూర్ మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న భూగర్భ గనుల శాఖలో రికార్డులు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం మారడంతో ఉద్దేశపూర్వకంగానే ఈ రికార్డులను దగ్ధం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటిని పరిశీలిస్తే జిల్లాలో భారీ ఎత్తున అధికార యంత్రాంగంలో ప్రక్షాళన కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు పలువురు జిల్లా అధికారులు కూడా మానసికంగా సిద్దం అవుతున్నారు.
ముఖ్య మంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న