సమిష్టి కృషితోనే చిత్తూరులో టిడిపి విజయం
రేయింబవళ్ళు శ్రమించిన గురుజాల
టిడిపిలో ఉత్సాహం నింపిన సికె బాబు
విజయానికి ప్రణాళికా బద్దంగా పనిచేసిన ఏ ఎస్ మనోహర్
అందరికి ఎకతాటి మీదకు తెచ్చిన దొరబాబు
కష్టపడిన కాజూరు బాలాజీ, రాజేష్
చేమటోర్చిన మహిళా నేతలు కటారి హేమలత, రాజేశ్వరి .
సి ఆర్ రాజన్ రాకతో చైతన్యం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం మరో ఎత్తు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో పలువురి నాయకుల శ్రమ దాగిఉంది. పలువురు నాయకులు చావో,రేవో తేల్చుకోవాలన్నంత పట్టుదలతో చెమటోడ్చారు. ఎక్కడ రాజీ పడకుండా, వైసీపీని ఓడించడమే ధ్యేయంగా రేయింబవళ్లు కష్టపడ్డారు. వారి శ్రమ ఫలించి చిత్తూరులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది .
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఎవరికి లేదు. ఏదో పోటి నామమాత్రంగా ఉంటుందని మాత్రమే భావించారు. సాధారణంగా చిత్తూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. ఇక్కడ అప్పుడప్పుడూ మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. ఇక్కడ నేతలు కూడా చిత్తూరులో విజయం సాధించాలన్న పట్టుదల అంతగా కనపరిచే వాళ్ళు కాదు. ఇక్కడ పరిస్థితులు అలాంటివి. చిత్తూరులో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంట్ కూడా ఉంది. వీటన్నింటిని బద్దలు కొట్టుతూ చిత్తూరు నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు. ఏ ఒక్కరితోనూ చిత్తూరు నియోజకవర్గ విజయం సాధ్యం కాలేదు. పలువురు నాయకులు చెమటోడ్చి, పార్టీ కోసం అంకితభావంతో పనిచేయడంతో చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని అందరూ టిడిపి నాయకులను కలిసి వారిని పార్టీలోకి తీసుకొని వచ్చి వారితో చురుగ్గా ప్రచార కార్యక్రమాలను నిర్వహింపజేసిన ఘనత మాత్రం గురజాల జగన్మోహన్ నాయుడుకు దక్కుతుంది. ఆర్థికంగా కూడా గురజాల జగన్ మోహన్ నాయుడు భారీగానే ఖర్చు పెట్టారు. అందరు నేతలు తమ సర్వశక్తులు వంటి పార్టీ విజయానికి కృషి చేశారు.తొలుత చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టిడిపి అభ్యర్థి గురజాల జగన్ మోహన్ నాయుడుకు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీకి వేయి ఏనుగుల బలం వచ్చింది. మాట ప్రకారం సీకే బాబు మడమ తిప్పకుండా ఎన్ని వత్తిడిలు ఎదురైనా, తెలుగుదేశం పార్టీ విజయానికి గట్టిగా నిలబడ్డారు. ఆయన పార్టీలే అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతోనే చిత్తూరు టిడిపిలో జోష్ పెల్లుబికింది. అనంతరం చిత్తూరు మరో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ టిడిపి అభ్యర్థి గురజాలకు మద్దతు ప్రకటించారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇదివరకు మున్సిపల్ చైర్మన్ గా, చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు సొంతం ఒక వర్గం ఉంది. బలిజ సామాజిక వర్గం అండ ఉంది. చిత్తూరు మున్సిపాలిటీ, చిత్తూరు రూరల్ మండలం, గుడిపాల మండలాల్లో తనదైన శైలిలో ఆయన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపికి చెందిన పాత నాయకులందరినీ తట్టిలేపి, కథన రంగంలో నిలబెట్టారు. ఆయనకు తోడుగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజురు బాలాజీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కాజూరు రాజేష్, చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలతలు కలిశారు. వీరంతా బలిజ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ సామాజిక వర్గం నాయకులతో పలుమార్లు సమావేశమయ్యారు. విజయవాడ నుంచి బలిజ సామాజిక వర్గ నేత వంగవీటి రాధాను కూడా పిలిపించారు. వారితో కూడా బలిజ సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. వీరికి తోడు బలిజ సంఘం నేతలు కూడా అంకిత భావంతో పనిచేశారు. అలాగే సిఆర్ రాజన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించడం కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదం చేసింది. చిత్తూరు నియోజకవర్గంలో వన్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి కార్పొరేటర్లు కూడా ఉన్నారు. దీంతో సిఆర్ రాజన్ వారందరిని ఒక తాటి మీదికి తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారు. అలాగే తెలుగు మహిళా నాయకురాలు వైవి రాజేశ్వరి అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ విజయానికి కష్టపడ్డారు. ఆమె పార్టీ కోసం తన కుమారుడిని పోగొట్టుకున్న మొక్కవోని ధైర్యంతో అడుగు ముందుకు వేశారు. ఇటీవల భర్త కాల ధర్మం చేసిన మొక్కవుని ధైర్యంతో నిలబడ్డారు. వైసీపీని బోధించడమే ధ్యేయంగా ఆమె పనిచేశారు. వీరి అందరిని కలపడానికి సూత్రధారిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు కృషి ఎనలేనిది. ఆయన తొలత ఎమ్మెల్యే టికెట్టు ఆశిస్తున్న అభ్యర్థులందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరికి టికెట్ వచ్చిన అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో టిక్కెట్ను ఆశిస్తున్న అభ్యర్థులు అందరి చేత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపుగా సగం ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధ్యమైంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది పర్యాయాలు చిత్తూరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు పర్యాయాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. నాలుగు పర్యాయాలు కాంగ్రెస్, పార్టీ ఒక పర్యాయం ఇండిపెండెంట్, మరొక పర్యాయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదటి నుండి చిత్తూరు నియోజకవర్గ ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ పి ఝాన్సీ లక్ష్మి విజయం సాధించారు. తర్వాత 1985లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్ గోపీనాథన్ గెలుపొందారు. 1989, 1994, 1999 ఎన్నికలలో వరుసగా సీకే బాబు సాధించి, హ్యాట్రిక్ కొట్టారు. ఇందులో 1989లో ఆయన ఇండిపెండెంట్ గా విజయం సాధించినా, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగాని కొనసాగారు. 2004 ఎన్నికలలో టిడిపి అభ్యర్థి ఏఎస్ మనోహర్ విజయం సాధించగా, 2009 ఎన్నికలలో తిరిగి సీకే బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా డీకే సత్య ప్రభ విజయం సాధించగా, 2019 ఎన్నికలలో జంగాలపల్లి శ్రీనివాసులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ ఎన్నికలకు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయి. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టిడిపిలో చేరారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీకే బాబు ప్రస్తుతం టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్ విజయానికి చేశారు. అలాగే ఒక పర్యాయం ఎమ్మెల్యేగా, మరోసారి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఎస్ మనోహర్ కూడా వైసిపి నుండి తెలుగుదేశం పార్టీలో చేరి, టిడిపి విజయానికి ప్రచారం చేశారు. వైసిపి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఆ పార్టీ వీడి జనసేనలో చేరారు. తొమ్మిది సార్లు జరిగిన ఎన్నికలలో మూడుసార్లు మాత్రమే గెలుపొందిన టిడిపి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని భావించింది. గుడిపాల మండలానికి చెందిన బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ నాయుడును తెరమీదకి తీసుకుని వచ్చి, తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన పాత, కొత్త నాయకులను కలుపుకొని చిత్తూరుపై పట్టు సాధించాలని గట్టి పట్టుదలతో జగన్మోహన్ నాయుడు కృషి చేశారు. తొలుత గురుజాల దానధర్మలతో ప్రజలకు చేరువ అయ్యారు. రంజన్ తోఫా, సంక్రాంతికి నిత్యవసర వస్తువులు, తోపుడు బండ్లను ఉచితంగా అందజేయడం, దీపావళికి టపాకాయలు పంచడం, రంజాన్, బక్రీద్ వంటి కార్యక్రమాలకు ముస్లింలు ఆర్థిక సహాయం చేయడం, క్రిస్మస్ రోజున క్రైస్తవులకు ఆదుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో అందరి కృషి ఫలించి, పోటి చేసిన మొదటిసారే గురుజాల విజయం సాధించి, తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.