60.30 లక్షల మంది పించానుదారులకు ఒకటవ తేదిన రూ. 7వేలు
ఇంటి వద్దకే పించన్లు
సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణి
కుప్పం/ చిత్తూరు, జూన్రా 25 (ప్రభ న్యూస్ బ్యూరో) రాష్ట్రంలోని 60.30 లక్షల మంది పించానుదారులకు జూలై ఒకటవ తారీఖున 7వేల రూపాయలను అందజేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కుప్పం నియోజకవర్గంలో నుంచి ఎనిమిదవ పర్యాయం ఎమ్మెల్యేగా విజయం సాధించి, నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనకు మంగళవారం కుప్పం చేరుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం లభించింది. కుప్పం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. గజ మాలలతో, కర్పూర నీరాజనాలతో చంద్రబాబు నాయుడుకు కుప్పం ప్రజలు స్వాగతం పలికారు. మంగళవారం సాయంకాలం కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కార్మికులు, కళాకారులు, హెచ్ఐవి భాదితులు, హిజ్రాలు, చెప్పులు కొట్టేవారికి జులై 1వ తారీఖున 7000 రూపాయల పెన్షన్ మొత్తాలను అందజేస్తామన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లు లేకుంటే ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేమని చేతులెత్తేసిందని, తాము సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. వృద్ధుల పింఛన్లను 3000 నుంచి 4000 రూపాయలకు, వికలాంగుల పెంచడంలను 3000 నుంచి 6000 రూపాయలకు పెంచామన్నారు. ఇల్లు వదిలి బయట రాలేని నిస్సహాయులకు నెలకు 15000 రూపాయలను అందజేసి, వారిని ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని, ఎక్కడ ఎంతెంత అప్పులు చేశారో ఇప్పటికీ తేలడం లేదన్నారు. ఈ విషయం మీద ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి లెక్కలు తీస్తున్నామని, దీని మీద ఏడూ శ్వేత పత్రాలను విడుదల చేస్తామన్నారు. వైసీపీ పాలనను ఒక పీడ కలగా వర్ణించారు. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోనన్నారు. అరాచకం, దౌర్జన్యం, రౌడీయిజం రాజ్యమేగిందన్నారు. జైలుకు వెళ్లిన టిడిపి కార్యకర్తలను పరామర్శించి వచ్చిన తననే జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే వాటిని మూసివేసారని ఆవేదన చెందారు. రాష్ట్రంలో 183 అన్న క్యాంటీన్ లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ సంపదలను కేజిఎఫ్ కంటే అద్వానంగా దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడీదారులను వదిలేదిలేదని, తిన్నదంతా కక్కిస్తామన్నారు. త్వరలో కుప్పంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి కుప్పంలో నుండి కూరగాయలను కార్గో ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన ద్రావిడ యూనివర్సిటీని బ్రష్టు పట్టించారని, తిరిగి ద్రవిడ యూనివర్సిటీని గాడిలో పెడతానని హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న 250 మంది సిబ్బందికి గత ఆరు నెలలుగా గీతాలు లేవని, వారికి జీతాలను విడుదల చేశామని తెలిపారు. వైసిపి అరాచకం, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భారీ మెజారిటీతో ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ గెలిపించారని చంద్రబాబు వివరించారు. గాజువాకలో 95 వేల మెజారిటీ, భీమిలిలో 94 వేలు, మంగళగిరిలో 91వేల మెజారిటీ లభించిందని వివరించారు. ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో ఉన్న ఆంధ్రులు కూడా సొంత ఖర్చులతో వచ్చి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ని ప్రకటించామని, ల్యాండ్ టైటిల్ యాక్టర్ ను రద్దు చేశామన్నారు. రైతుల అందరికీ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను తిరిగి అందజేస్తామన్నారు. తనకు దేవుడు ఇచ్చిన శక్తి సామర్ధ్యాలను వినియోగించుకొని, సర్వశక్తులను ఒడ్డి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రసంగం సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. ఆయన ప్రసంగం ప్రారంభమంగానే వర్షం ప్రారంభమైంది. ఒక నిమిషం పాటు ప్రసంగం ఆపి, తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించిన తర్వాత వర్షంతగ్గింది. రెండు గంటల పాటు ఓపిగ్గా ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ప్రజలు విన్నారు. ప్రసంగం మధ్యలో చప్పట్లు, ఈలలతో ఉత్సాహపరిచారు. చేతులలో కర్పూరం పెట్టుకుని చంద్రబాబుకు హారతులు ఇచ్చారు. పలువురు మహిళలు చంద్రబాబు ప్రసంగాన్ని రికార్డు చేశారు.