జిల్లాలో తగ్గుతున్న మామిడి ధరలు ఆవేదన చెందుతున్న రైతులు
టన్ను రూ.23 వేలకు పడిపోయిన మామిడి
రంగప్రవేశం చేసిన జిల్లా కలెక్టర్
టన్నుకు రూ. 30 వేలకు తగ్గకుండా చెల్లించాలని ఆదేశం
అలా చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో మామిడి ధరలు తగ్గుముఖం పెట్టాయి. దీంతో మామిడి రైతులు తీవ్ర అవలేదన్నకు గురవుతున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన మామిడి టన్నుకు ముప్పై వేలు తగ్గకుండా గిట్టుబాటు ధర ఇవ్వాలని మామిడి ఫ్యాక్టరీ యజమానులను ఆదేశించారు. అలా ఇవ్వని పక్షంలో మామిడి ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లాలో 58 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ఈ సంవత్సరం మామిడి దిగుబడి గణనయంగా పడిపోయింది. 20 శాతం కూడా దిగిబడి లేదు. దీంతో మామిడికి మంచి గిట్టుబాటు ధర వస్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. రైతుల ఆశించిన విధంగానే మామిడి టన్ను 30 రూపాయలతో ప్రారంభమైంది. తొలుత తిరుపతిలో ప్రారంభమైన ఫ్రూటెక్స్ కంపెనీ మామిడికి తోచాపూరి మామిడి కి తన్నుకు 32వేల రూపాయలుగా నిర్ణయించారు. దీంతో చిత్తూరు జిల్లాలోని మామిడి ఫ్యాక్టరీలు కూడా 28 రూపాయలతో కొనుగోలు చేయడం ప్రారంభించారు. ప్రొటెక్స్ కంపెనీ తిరుపతి, బంగారుపాలెం కేంద్రాలకు మాత్రమే పరిమితమైంది. రొంపిచర్ల మండలంలో ఒక పాయింటును ఏర్పాటు చేశారు. జిల్లాలోని అందరూ రైతులు తిరుపతి, బంగారుపాలెం తీసుకుని వెళ్లడానికి దూరం కావడంతో సమీపంలో ఉన్న మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు మామిడికాయలను తోలడం ప్రారంభించారు. దీంతో మామిడి ఫ్యాక్టరీ యజమానులు క్రమంగా మామిడి ధరలను తగ్గిస్తూ వచ్చారు. ఆదివారం నాటికి టన్ను ధర 23 వేల రూపాయలు చేరుకుంది. ఈ విషయమై పలువురు రైతులు జిల్లా కలెక్టర్ ను కలిసి మామిడి ధరల పతనం గురించి వివరించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదివారం ఉద్యానవన శాఖ అధికారులతో, మార్కెట్ కమిటీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు భాగాలు సమన్వయంతో పనిచేసి, మామిడి ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తోతాపురి మామిడికి టన్నుకు ముప్పై వేల రూపాయలు తగ్గకూడదని పేర్కొన్నారు. ఎవరైనా 30 వేల రూపాయలు కంటే తక్కువ కొనుగోలు చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలతో పాటు ర్యాంపులు, వర్తకులు కూడా 30 వేల రూపాయలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ విషయమై ఉద్యానవన శాఖాధికారులు, మార్కెట్ కమిటీ అధికారులు మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు సమాచారం అందజేశారు. అయితే మామిడి ఫ్యాక్టరీలు ప్రస్తుతం 23 వేల రూపాయలకు టన్ను మామిడిని కొనుగోలు చేస్తుంది. వ్యాపారస్తులు మరో వేయి తగ్గించి 22 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు.
మామిడి రైతులను రింగురోగం ఇబ్బంది పెడుతోంది. మామిడి కాడ దగ్గర రింగు లాగా వచ్చి మామిడికాయ కుళ్ళి పడిపోతుంది. కింద పడిపోతుంది. ఇలా సైజు బాగా ఉన్న కాయలు నేల పాలు కావడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఇలా ఉండగా రెండు కాయలు కలిసి ఉంటే ఆ కాయలలో పురుగు ఏర్పడుతుంది. క్రమంగా కుల్లి కాయలు కింద పడిపోతున్నాయి. వీటికి తోడు మంగు కూడా కలిసింది. కొన్నిచోట్ల మామిడి ఆకులూ నల్లగా తిరిగిపోతున్నాయి. ఫలితంగా కాయలు కూడా నల్లగా మారిపోతున్నాయి. దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. తొందరగా ఎక్కువ నష్టం కలుగాకముందే కాయలు కోస్తున్నారు. రైతుల ఇబ్బందులు ఇలా ఉంటే ధరలు తగ్గించడం గురించి మామిడి ఫ్యాక్టరీ యజమానులు సమర్ధించుకుంటున్నారు. మామిడికాయలకు రింగురోగం రావడంతో పక్వానికి రాని కాయలను కూడా రైతులు కోసి ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారని అంటున్నారు. అందువల్ల కాయలు సకాలంలో మాగకుండా పల్పు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోయాలని ఉద్యానవన శాఖ అధికారులు, ఫ్యాక్టరీ యజమానులు పదేపదే విజ్ఞప్తి చేసిన రైతులు మాత్రం అన్ని రకాల కాయలను కోసుకొని తమకు తోలుతున్నారని అంటున్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలకు విరామం ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతులు పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోసి, సరఫరా చేస్తే రేటు తగ్గించాల్సిన అవసరం లేదని సమర్థించుకుంటున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఎంతవరకు పనిచేస్తాయో, మామిడి ధరలు సోమవారం నుంచి ఏ మేరకు పెరిగితాయో వేసి చూడాల్సిందే.