గ్రామాలకు, వార్డులకు కొత్త వలంటీర్లు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో గ్రామ, వార్డులకు కొత్త వలంటీర్లు రానున్నారు. ఈ మేరకు కొత్తగా వలంటీర్లను నియమించడానికి అధికారులు ప్రాథమిక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వలంటీర్ల సంఖ్య, విధులలో కూడా మార్పులు చేయనున్నట్లు సమాచారం. వలంటీర్ల నియామకం కోసం కొత్తగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డిగ్రీ పూర్తి చేసి, 1994 నుండి 2003 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరు కావాలని షరతులు విధించనున్నట్లు సమాచారం. అలాగే వలంటర్లను, సచివాలయ సిబ్బందిని మొత్తాన్ని గ్రామ సర్పంచుల ఆధీనంలోనికి తీసుకొని రానున్నారు. వాలంటీర్ల జీతాన్ని ₹5,000 నుండి 10000 రూపాయలకు పెంచనున్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించే విధంగా చర్యలు తీసుకోమన్నారు.
వైసిపి ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలో 8883 మంది వలంటీర్లను నియమించారు. వీరందరూ వైసిపి సానుభూతిపరులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సమావేశాల్లో మంత్రులు, ముఖ్యమంత్రి కూడా వలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలేనని బహిరంగంగా ప్రకటించారు. ప్రభుత్వ విధులను నిర్వహిస్తూ, పార్టీ కోసం కూడా పనిచేయాల్సిందేనని నిర్దేశించారు. దీంతో అవసరమైన సమాచారం కోసం శాసనసభ్యులు వలంటీర్ల మీద ఆధారపడ్డారు. ప్రభుత్వ సమాచారాన్నే కాకుండా పార్టీ సమాచారాన్ని కూడా ఇంటింటికి వలంటీర్లే చేరవేశారు. ప్రభుత్వంతోపాటు పార్టీకి కావాల్సిన సర్వేలను చేసి పెట్టారు. ఎన్నికల విధులను వలంటీర్లు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనడాన్ని నిషేధించింది. దీంతో వైసిపి నాయకత్వం వలంటీర్లు అందరి చేత రాజీనామా చేయించి ఎన్నికలలో వైసీపీ విజయానికి ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని వలంటీర్లు అందరినీ రాజీనామా చేయాల్సిందిగా పార్టీ నుండి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఒకవేళ ఎవరైనా రాజీనామా చేయకుంటే వారికి వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో జిల్లాలో ఎనిమిది వేలకు పైగా వాలంటీర్లు రాజీనామా చేసినట్లు సమాచారం. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే ననీ, మళ్లీ మీకే ఉద్యోగాలు ఇప్పిస్తామని వాలంటీర్లను నమ్మబలికారు. వాలంటీర్లకు ప్రభుత్వం 5000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తుండగా ఎన్నికలలో పనిచేసినందుకు ఒక్కొక్క వాలంటీర్లకు పదివేల నుండి 20వేల రూపాయల వరకు అందజేశారు. దీంతో వాలంటీర్లు చాలా ఉత్సాహంగా వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల కరపత్రాలను వలంటీర్లు ఇంటింటికి చేరవేశారు. వైసీపీ పార్టీకి చెందిన నగదు పంపిణీ కూడా వలంటీర్లే చేశారు. చివరకు ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం ఓడిపోవడంతో రాజీనామా చేసిన వలంటీర్లు ఆవేదనకు గురవుతున్నారు. గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలకు పని చేసిన వలంటీర్లను ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే వారి గౌరవం వేతనాన్ని ఐదువేల నుండి 10000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చా.రు దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లు ఎటు కాకుండా పోయారు. వారికి వైసీపీ ముద్ర పడడంతోమరో సారి వారిని తీసుకునే అవకాశం కనిపించడం లేదు. జిల్లాలో పలుచోట్ల వాలంటీర్ల మీద టిడిపి నాయకులు దాడులు కూడా చేస్తున్నారు. వాలంటీర్లు వైసిపి నాయకులు మాటలు విని రాజీనామా చేసి, వైసిపి తరఫున ప్రచారం చేయడం కారణంగా వారికి కొనసాగే అవకాశం లేకుండా పోయింది. వలంటీర్ల నియామకంలో వారు దరఖాస్తు చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారు ఎంపిక కాకుండా అడ్డుకునే అవకాశం ఉంది. ఇలా అధికార పార్టీ నేతల మాటలు విని రాజీనామా చేసిన వలంటీర్లు రెండిటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. వైసిపి నాయకుల మాటలు విని ఎందుకు రాజీనామా చేసామా అని వలంటీర్లుగా ఆవేదన చెందుతున్నారు.