27, సెప్టెంబర్ 2026, ఆదివారం

చిత్తూరు జిల్లాలో పర్యాటక రంగానికి కొత్త ఊపు


చిత్తూరు జిల్లాలో పర్యాటక రంగానికి కొత్త ఊపు

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

జిల్లాలో పర్యాటక రంగానికి ఉన్న అపార అవకాశాలను వినియోగించుకుని ఆలయ, ప్రకృతి, పర్యావరణ, సాహస పర్యాటకాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. కాణిపాకం, అర్ధగిరి, మొగిలి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు పులిగుండు, కైగల్‌ జలపాతాలు, కొండలు, అడవులు, చెరువులను అనుసంధానం చేసి చిత్తూరు జిల్లాను ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, రహదారులు, మరుగుదొడ్లు, పార్కింగ్‌, సందర్శకుల విశ్రాంతి ప్రాంతాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరచడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పర్యాటకులు ఒక ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం సమీపంలోని ఇతర పర్యాటక ప్రాంతాలను కూడా వీక్షించేలా పర్యాటక సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలను పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

పులిగుండును ఆధ్యాత్మికతతో పాటు సాహస, పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అక్కడ ట్రెక్కింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌, ఎకో పార్క్‌, క్యాంపింగ్‌ వంటి సౌకర్యాలను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. సహజ శిలా నిర్మాణాలు, కొండలు, పచ్చదనం పులిగుండుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రకృతి ప్రేమికులు, సాహస పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది.

అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్‌, రహదారులు, పార్కింగ్‌ తదితర సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు చేపడుతున్నారు. ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.

చిత్తూరు సమీపంలోని భూమిరెడ్డిపల్లి చెరువు, గంగినేరి చెరువు, బుదిరెడ్డిపల్లి చెరువులను కూడా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నారు. భూమిరెడ్డిపల్లి చెరువులో బోటింగ్‌ సౌకర్యాలను పునరుద్ధరించడంతో పాటు పిల్లల పార్కును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. గంగినేరి చెరువులో ఉన్న సమస్యలను పరిష్కరించి బోటింగ్‌ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు బుదిరెడ్డిపల్లి చెరువులో పర్యాటక అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

పలమనేరు మండలంలోని ముసలిమడుగు ప్రాంతాన్ని పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏనుగుల సంరక్షణ శిబిరం, నగరవనం, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ సెంటర్‌ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఏనుగుల సంరక్షణతో పాటు ప్రకృతి అందాలను పర్యాటకులకు పరిచయం చేసేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దితే జిల్లాలో మరో ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

బైరెడ్డిపల్లె సమీపంలోని కైగల్‌ జలపాతానికి ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. జలపాతం పరిసరాల్లో రహదారులు, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విశ్రాంతి ప్రాంతాలు వంటి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా పర్యాటకుల సంఖ్యను మరింత పెంచేందుకు అవకాశం ఉంది. వర్షాకాలంలో జలపాతం అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో పర్యాటక ప్రాంతంగా దీనికి మరింత ప్రాచుర్యం కల్పించవచ్చు.

మొగిలి ఘాట్‌, మొగిలేశ్వరస్వామి ఆలయం కూడా జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి అవసరమైన భూమిని గుర్తించడం, ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలించడం, భూ రికార్డులను సిద్ధం చేయడం వంటి చర్యలను వేగవంతం చేస్తున్నారు. పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి మొగిలి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది.

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లాలోని ఇతర పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తే ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ఊతం లభించనుంది. కాణిపాకంతో పాటు అర్ధగిరి, మొగిలి తదితర పుణ్యక్షేత్రాలను ఒకే పర్యాటక మార్గంలో అనుసంధానం చేసి భక్తులు, పర్యాటకులు ఒకేసారి పలు ప్రాంతాలను సందర్శించేలా చర్యలు చేపట్టవచ్చు.

పర్యాటక కేంద్రాల అభివృద్ధితో స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. హోటళ్లు, ఆహార కేంద్రాలు, రవాణా, పర్యాటక మార్గదర్శక సేవలు, స్థానిక ఉత్పత్తుల విక్రయాలు, హస్తకళలు తదితర రంగాల్లో వ్యాపార అవకాశాలు పెరగనున్నాయి. మహిళా సంఘాలు, యువత, చిన్న వ్యాపారులను పర్యాటక కార్యకలాపాలతో అనుసంధానం చేస్తే గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడనుంది.

ఆలయాలు, జలపాతాలు, కొండలు, అడవులు, వన్యప్రాణులు, చెరువులను సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేసి ఆధ్యాత్మికత, ప్రకృతి, సాహస పర్యాటకానికి సమాన ప్రాధాన్యం కల్పిస్తే చిత్తూరు జిల్లాను రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, పారిశుద్ధ్యం, ప్రచార కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *