రాత్రిళ్లు కరెంటు కోతలతో పల్లెల్లో అంధకారం
రాత్రిళ్లు కరెంటు కోతలతో పల్లెల్లో అంధకారం
గంటల తరబడి సరఫరా నిలిపివేత..
ఉక్కపోతలో నిద్రలేని రాత్రులు
చిన్నారులు, వృద్ధులు, రోగుల అవస్థలు..
రైతులకు తెల్లవారుజామునే విద్యుత్ కష్టాలు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారికంగా రాత్రి వేళల్లో లోడ్ షెడ్డింగ్ లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం గంటల తరబడి విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో సాయంత్రం 6 గంటలకు విద్యుత్ నిలిపివేస్తే రాత్రి 11 గంటలకు గానీ సరఫరా పునరుద్ధరించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో మళ్లీ ఎప్పుడు విద్యుత్ పోతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పగటి వేళల్లో ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రజలకు రాత్రిపూట కరెంటు కోతలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. విద్యుత్ లేక ఫ్యాన్లు, కూలర్లు పనిచేయక ఉక్కపోత భరించలేక ఇళ్ల బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దోమల బెడదతో చిన్నారులు, వృద్ధులు నిద్రపోలేక అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు ఏడుస్తూ రాత్రంతా మేల్కొని ఉండటంతో తల్లిదండ్రులు కూడా నిద్రకు దూరమవుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి విద్యుత్ అంతరాయం కేవలం అసౌకర్యం మాత్రమే కాకుండా భద్రతా సమస్యగా మారుతోంది. విద్యుత్ లేక వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో గ్రామ వీధులు చీకటిమయంగా మారుతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా ప్రజలు భయపడుతున్నారు. పాములు, తేళ్లు, ఇతర విషపురుగుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చీకటి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చిరుతల సంచారం, ఏనుగులు పంట పొలాల్లోకి వస్తున్న ఘటనల నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లాల్సి వస్తే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ రంగంపైనా విద్యుత్ అంతరాయాల ప్రభావం తీవ్రంగా పడుతోంది. వ్యవసాయానికి రోజుకు తొమ్మిది గంటల ఉచిత పగటి విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో రైతులకు ఏడు గంటల సరఫరా కూడా సక్రమంగా అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే ఈ సమయంలోనూ ట్రిప్పింగ్, లో-వోల్టేజీ తదితర సమస్యలతో నిరంతర విద్యుత్ అందడం లేదని రైతులు చెబుతున్నారు. పేరుకు ఏడు గంటల సరఫరా ఉన్నా, వాస్తవంగా మోటార్లు పనిచేసే సమయం ఐదు గంటలకు కూడా తగ్గిపోతోందని వాపోతున్నారు. ఉదయం నాలుగు గంటలకే పొలాలకు వెళ్లి మోటార్లు ఆన్ చేయాల్సి రావడం రైతులకు ఇబ్బందిగా మారింది. చీకట్లో పొలాలకు వెళ్లే సమయంలో పాములు, విషపురుగులు, చిరుతలు, ఏనుగుల భయం వెంటాడుతోంది. వర్షాలు సక్రమంగా లేక భూగర్భ జలాలు అడుగంటిపోతున్న సమయంలో పంటలకు నీరు అందించేందుకు రైతులు విద్యుత్‌పై ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడితే పంటలకు నీరు పెట్టడం ఆలస్యమై దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరోవైపు లో-వోల్టేజీ సమస్య కూడా రైతులను వేధిస్తోంది. తక్కువ వోల్టేజీతో వ్యవసాయ మోటార్లు సక్రమంగా పనిచేయకపోవడం, తరచూ ట్రిప్ కావడం, చివరకు మోటార్లు కాలిపోవడం జరుగుతోందని రైతులు చెబుతున్నారు. మోటారు మరమ్మతులకు వేలు రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో ఆర్థిక భారం పడుతోంది. రాత్రి వేళల్లో విద్యుత్ అంతరాయాలకు స్థానిక ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక భారం, ఫీడర్లు ట్రిప్ కావడం, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం, సాంకేతిక లోపాలు తదితర కారణాలు ఉంటున్నాయని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా లోపం ఏర్పడినప్పుడు రాత్రి సమయంలో మరమ్మతు సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోందని వినియోగదారులు అంటున్నారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరగడం, ఉత్పత్తి-వినియోగం మధ్య సమతుల్యతను కాపాడాల్సిన అవసరం వంటి అంశాలు కూడా విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయి. గ్రిడ్ ఫ్రీక్వెన్సీని సురక్షిత స్థాయిలో ఉంచేందుకు అవసరమైన సందర్భాల్లో లోడ్ రిలీఫ్ వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి గ్రామీణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. పాడి రైతులు కూడా విద్యుత్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం పాలు పితికే సమయంలో విద్యుత్ లేకపోవడంతో పాలు సేకరించే కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాల శీతలీకరణ కేంద్రాలు జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న పరిశ్రమలు, వర్క్‌షాప్‌లు, మిల్లులు కూడా తరచూ విద్యుత్ అంతరాయాలతో పనులు నిలిపివేయాల్సి వస్తోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు వినియోగదారులు 1912 ఫిర్యాదు కేంద్రాన్ని సంప్రదించవచ్చు. అయితే ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు వాటిని వేగంగా పరిష్కరించేలా గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సిబ్బంది అందుబాటు, ఫాల్ట్ గుర్తింపు వ్యవస్థ, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం, లో-వోల్టేజీ నివారణ, ఫీడర్ల బలోపేతంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సాయంత్రం 6 గంటలకు పోయిన కరెంటు రాత్రి 11 గంటలకు వస్తే.. ఆ తర్వాత అర్ధరాత్రి మళ్లీ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉక్కపోతలో ఫ్యాన్ కోసం ఎదురుచూస్తున్న చిన్నారి నుంచి, నిద్రలేక అవస్థపడుతున్న వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరూ విద్యుత్ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారిక కోతలు లేవన్న ప్రకటనలకంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందడమే ముఖ్యమని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.

