నాసిరకం కోళ్ల దానా.. మృత్యువాత పడిన కోళ్లు
నాసిరకం కోళ్ల దానా.. మృత్యువాత పడిన కోళ్లు
25 మంది రైతుల ఆందోళన.. మేత కేంద్రం వద్ద చనిపోయిన కోళ్లతో నిరసన
దానా నాణ్యతపై అధికారుల దర్యాప్తు చేయాలని డిమాండ్
చిత్తూరు, ఆగస్టు 18 (ఆంధ్రప్రభ బ్యూరో): కోళ్లకు అందించిన దానా నాసిరకంగా ఉండటంతోనే తమ కోళ్లు మృత్యువాత పడుతున్నాయని ఆరోపిస్తూ పలువురు రైతులు ఆందోళనకు దిగారు. చిత్తూరు నగరంలోని సీబీ రోడ్డులో లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్‌కేఎం కోళ్ల మేత కేంద్రం వద్ద మంగళవారం సుమారు 25 మంది రైతులు చనిపోయిన కోళ్లను తీసుకొచ్చి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని, నాసిరకం దానా విక్రయించిన విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. రూరల్ మండలంతో పాటు పెనుమూరు, యాదమరి, బంగారుపాళెం, పూతలపట్టు తదితర మండలాలకు చెందిన రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమ కోళ్లకు ఎస్‌కేఎం మేత కేంద్రం నుంచి దానా కొనుగోలు చేసి వినియోగించిన అనంతరం అనారోగ్య లక్షణాలు కనిపించి కోళ్లు వరుసగా మృత్యువాత పడుతున్నాయని రైతులు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే సుమారు 25 కోళ్లు చనిపోయాయని, అంతకుముందు కూడా తమ ఫారాల్లో కోళ్లు మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. తమకు జరుగుతున్న నష్టంపై మేత కేంద్రం యాజమాన్యానికి పలుమార్లు తెలియజేసినా స్పందించలేదని రైతులు ఆరోపించారు. దీంతో తమ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చనిపోయిన కోళ్లను మేత కేంద్రం వద్దకు తీసుకొచ్చి నిరసన చేపట్టినట్లు తెలిపారు. కోళ్ల పెంపకానికి భారీగా పెట్టుబడులు పెట్టామని, దానా నాణ్యతలో లోపం కారణంగా కోళ్లు మృత్యువాత పడితే తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కోళ్ల దానా తయారీలో ఉపయోగించే కొన్ని ముడి పదార్థాల సరఫరాలో మార్పులు చోటుచేసుకున్నాయని, స్థానికంగా లభించే పదార్థాలతోనే దానా తయారు చేయడం వల్ల నాణ్యత తగ్గిందని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే కోళ్ల మృత్యువుకు దానానే కారణమా, లేక ఇతర వ్యాధులు, వాతావరణ పరిస్థితులు, నీరు లేదా పెంపకంలో ఏర్పడిన లోపాలా అన్నది శాస్త్రీయంగా నిర్ధారించాల్సి ఉంది. చనిపోయిన కోళ్లు, వినియోగించిన దానా నమూనాలను పరీక్షలకు పంపితేనే అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. కోళ్ల మేత నాణ్యతకు సంబంధించి భారతీయ ప్రమాణాల సంస్థ 2024లో సవరించిన ఐఎస్ 1374 ప్రమాణంలో తేమ, ముడి ప్రొటీన్, కొవ్వు, పీచు, ఖనిజాలు, విటమిన్లు, అమినో ఆమ్లాలు తదితర పోషక విలువలతోపాటు అఫ్లాటాక్సిన్ వంటి హానికర పదార్థాలకు పరిమితులను నిర్దేశించింది. దానా బూజు, పురుగుల బారిన పడకుండా, కల్తీ పదార్థాలు లేకుండా ఉండాలని ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. దానా సంచిపై తయారీదారు పేరు, తయారీ తేదీ, బ్యాచ్ నంబరు, గడువు తేదీ, ప్రొటీన్, పీచు, అఫ్లాటాక్సిన్ తదితర వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు కొనుగోలు చేసిన దానా నమూనాలను అధికారుల సమక్షంలో సేకరించి ప్రయోగశాలకు పంపించాలని కోరుతున్నారు. దానాలో తేమ, ప్రొటీన్, కొవ్వు, పీచు, అఫ్లాటాక్సిన్ వంటి అంశాలతోపాటు హానికర పదార్థాలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో మృతి చెందిన కోళ్లను పశువైద్య నిపుణులతో పరీక్షించి, వ్యాధుల కారణంగా మృతి చెందాయా అన్నదీ నిర్ధారించాలని కోరుతున్నారు. దానా నాణ్యతపై అనుమానాలు ఉన్న సందర్భంలో నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించడం కీలకమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐఎస్ 1374:2024 ప్రమాణాల ప్రకారం కోళ్ల మేతలో పలు నాణ్యత, భద్రతా ప్రమాణాలను పరీక్షించే ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. రైతుల ఆందోళనతో మేత కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇప్పించడంతోపాటు, నాసిరకం దానా విక్రయించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. దానా నమూనాలను స్వాధీనం చేసుకుని పరీక్షలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, జిల్లాలోని కోళ్ల మేత కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతుల ఆరోపణలు శాస్త్రీయ పరీక్షల్లో నిర్ధారణ అయితేనే తదుపరి చర్యలకు అవకాశం ఉండనుంది. ఈ విషయమై ఎస్ కే ఆర్ అనిమల్ ఫీడ్స్ అండ్ ఫుడ్స్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ కంపెనీ చాలా రేపిటెడ్ కంపెనీ అని నాసిరకం దానా తాము సరఫరా చేయలేదన్నారు. ఒక ప్రత్యేకమైన వైరస్ కారణంగా కోళ్లు మృతి చెందాయని, దానాకు కోళ్లు మృతి చెందడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

