కుప్పానికి తప్పని తాగునీటి కష్టాలు
కుప్పానికి తప్పని తాగునీటి కష్టాలు
అడుగంటుతున్న భూగర్భ జలాలు ఎండిపోతున్న బోర్లు
అవసరం 4.20 ఎంఎల్డీ.. సరఫరా 3.50 ఎంఎల్డీ..
ట్యాంకర్లతో మీటింగ్ కలపరా చేస్తున్న మున్సిపాలిటీ
రూ. 70 లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదన
(కుప్పం, ఆంధ్రప్రభ)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, బోర్లు ఎండిపోవడంతో పట్టణ ప్రజలకు అవసరమైన స్థాయిలో నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. అధికారిక నీటి సరఫరా వివరాల ప్రకారం రోజుకు 4.20 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా ప్రస్తుతం అన్ని మార్గాల ద్వారా కలిపి 3.50 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సమకూర్చగలుగుతున్నారు. దీంతో రోజుకు 0.70 మిలియన్ లీటర్ల కొరత ఏర్పడుతోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం కుప్పం మున్సిపాలిటీలో 46,598 మంది జనాభా ఉండగా ప్రస్తుతం జనాభా సుమారు 60,000కు చేరినట్లు మున్సిపాలిటీ అంచనా వేసింది. ప్రస్తుత జనాభాకు ఒక్కొక్కరికి రోజుకు 70 లీటర్ల చొప్పున లెక్కిస్తే 4.20 ఎంఎల్డీ నీరు అవసరం. సాధారణ ప్రమాణం ప్రకారం ఒక్కొక్కరికి 135 లీటర్ల చొప్పున లెక్కిస్తే రోజువారీ అవసరం ఏకంగా 8.10 ఎంఎల్డీకి చేరుతుంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం అందుతున్న నీరు అవసరంలో సగానికి కూడా చేరని పరిస్థితి స్పష్టమవుతోంది. కుప్పం మున్సిపాలిటీకి ప్రధాన నీటి వనరు భూగర్భ జలాలే. ఇందుకోసం మొత్తం 201 విద్యుత్ బోర్లను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 170 బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ బోర్ల నుంచి రోజుకు సుమారు 3.50 ఎంఎల్డీ నీరు లభిస్తోంది. ఇందులో 1.80 ఎంఎల్డీ నీటిని ఎత్తిపోతల నిల్వ నీటి ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తుండగా, మరో 1.60 ఎంఎల్డీని నేరుగా వార్డులకు పంపిణీ చేస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా మరో 0.10 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. అయినప్పటికీ రోజువారీ అవసరానికి 0.70 ఎంఎల్డీ కొరత తప్పడం లేదు. నీటి కొరత కారణంగా మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా నీటి సరఫరా చేసే పరిస్థితి లేకుండా పోయింది. 10 వార్డులకు ప్రతిరోజూ నీటిని సరఫరా చేస్తుండగా, మరో 15 వార్డులకు రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీటిని అందిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా రోజుకు 21 ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు. సమగుట్టపల్లి ప్రాంతానికి 5 ట్రిప్పులు, ఎన్‌టీఆర్ కాలనీకి 4, సికారి కాలనీకి 2, పట్టణ కాలనీకి 1, కమతమూరు 1, మల్దేపల్లి కొట్టూరుకు 1, తంబిగానిపల్లి చెక్‌పోస్టుకు 2, తంబిగానిపల్లి పారిశ్రామిక ప్రాంతానికి 1, ఆదవికొత్తాలు 1, నారాయణపురం పాఠశాల ప్రాంతానికి 1, పరమసముద్రానికి 2 ట్రిప్పుల చొప్పున నీటిని తరలిస్తున్నారు. మున్సిపాలిటీకి చెందిన ట్యాంకర్ కూడా రోజుకు 3 ట్రిప్పులు నిర్వహిస్తోంది. కుప్పం పట్టణంలో నీటిని నిల్వ చేసి పంపిణీ చేసేందుకు మొత్తం 56 ఎత్తిపోతల నిల్వ నీటి ట్యాంకులు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 2,450 కిలోలీటర్లు. ఇందులో 20 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినవి 44, 40 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినవి 5, 60 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినవి 2, 150 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినది 1, 200 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినవి 2, 250 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినది 1, 450 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినది 1 ఉన్నాయి. నీటి సమస్యను తాత్కాలికంగానైనా అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు బోర్లపై దృష్టి సారించారు. బోర్లలో నీటి లభ్యత తగ్గిపోవడంతో ఎండిపోయిన బోర్లను గుర్తించి వాటిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 20 బోర్లలో లోతు పెంచే పనులు చేపట్టేందుకు రూ.20 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక బోరును కొత్త పైపులు ఏర్పాటు చేసి మరింత లోతుకు తవ్వగా నీటి జాడ లభించడం కొంత ఊరటనిచ్చింది. మిగిలిన బోర్ల పరిస్థితిని కూడా పరిశీలిస్తూ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో లోతు పెంచే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా నీటి సరఫరాకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం రూ.55 లక్షలు ఖర్చు చేయాలని మున్సిపాలిటీ నిర్ణయించింది. కొత్తగా బోర్లను ఏర్పాటు చేయడానికి మరో రూ.50 లక్షలు కేటాయించాలని కోరుతూ ఉన్నతాధికారులకు అనుమతుల కోసం నివేదికలు పంపించారు. అనుమతులు మంజూరైతే నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు మరింత పడిపోవడంతో వేసవి రాకముందే పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న 170 బోర్లపైనే పట్టణ తాగునీటి వ్యవస్థ ప్రధానంగా ఆధారపడి ఉండటం, మరో 31 బోర్లు పనిచేయకపోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. కొత్త బోర్లు, ఎండిపోయిన బోర్లకు లోతు పెంచడం, నీటి వనరుల పరిరక్షణ, లీకేజీల నివారణ, ట్యాంకర్ల ద్వారా సరఫరాను పెంచడం వంటి చర్యలు అత్యవసరంగా మారాయి. కుప్పం మున్సిపాలిటీకి రోజుకు 4.20 ఎంఎల్డీ నీరు అవసరం కాగా 3.50 ఎంఎల్డీ మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల ఏర్పడుతున్న 0.70 ఎంఎల్డీ లోటును తక్షణమే పూడ్చాల్సిన అవసరం ఉంది. లేకుంటే పనిచేస్తున్న బోర్లలో మరికొన్ని ఎండిపోతే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్టణంలో ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా దీర్ఘకాలిక నీటి వనరులను అభివృద్ధి చేయడంతోపాటు భూగర్భ జలాలపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.

