13, సెప్టెంబర్ 2026, ఆదివారం

స్థానిక పోరులో శ్రీకాంత్ వ్యూహం


స్థానిక పోరులో శ్రీకాంత్ వ్యూహం

టీడీపీ చిత్తూరు జిల్లా స్థానిక ఎన్నికల పరిశీలకుడిగా కలిచర్ల శ్రీకాంత్

కుప్పం అనుభవం.. జిల్లావ్యాప్తంగా పరిచయాలు.. గెలుపే లక్ష్యంగా కార్యాచరణ

వినాయక చవితి తర్వాత నియోజకవర్గాల వారీగా విస్తృత పర్యటనలు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించే కీలక బాధ్యతలను శాసనమండలి సభ్యుడు కలిచర్ల శ్రీకాంత్‌కు అప్పగించింది. టీడీపీ చిత్తూరు జిల్లా స్థానిక ఎన్నికల పరిశీలకుడిగా ఆయనను పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించనున్నారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం శ్రీకాంత్‌కు ఉంది. ఆ సమయంలో నియోజకవర్గంలోని గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ వ్యవహారాలపై ఆయనకు మంచి అవగాహన ఏర్పడింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా పనిచేసిన అనుభవంతో పాటు జిల్లాలోని పలువురు శాసనసభ్యులు, ముఖ్య నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వివిధ నియోజకవర్గాల్లోని మండల స్థాయి నాయకులతోనూ ఆయనకు పరిచయాలు ఉండటాన్ని పార్టీ అధిష్టానం ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి శ్రీకాంత్ తప్పుకున్నారు. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని గత కొన్ని నెలలుగా ఆయన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం కుప్పం నియోజకవర్గానికి అనంతపురానికి చెందిన యంగ్ ప్రొఫెషనల్ శ్రీకాంత్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆయన మార్గదర్శనంలో పార్టీ శ్రేణులు పనిచేయాలని చంద్రబాబు సూచించారు. అయితే కుప్పం బాధ్యతల నుంచి తప్పుకోవడం శ్రీకాంత్ రాజకీయ ప్రస్థానానికి ముగింపు కాదని తాజా నియామకంతో స్పష్టమైంది. జిల్లా మొత్తం పరిధిలో స్థానిక ఎన్నికల బాధ్యతను అప్పగించడం ద్వారా పార్టీ అధిష్టానం ఆయన అనుభవాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుప్పం నియోజకవర్గంలో పనిచేసిన కాలంలో ఏర్పడిన పరిచయాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఉన్న అవగాహన, నాయకులతో సమన్వయం చేసుకునే సామర్థ్యం స్థానిక ఎన్నికల్లో ఉపయోగపడతాయని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ ముఖ్యమైన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణుల సన్నద్ధత, నియోజకవర్గాల వారీగా ఉన్న రాజకీయ పరిస్థితులు, మండల స్థాయిలో పార్టీ బలం, నాయకుల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణపై ఆయన నాయకులతో అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. వినాయక చవితి అనంతరం జిల్లాలో శ్రీకాంత్ విస్తృతంగా పర్యటించనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతోనూ ఆయన నేరుగా సమావేశం కానున్నట్లు సమాచారం. స్థానికంగా పార్టీకి ఉన్న బలాలు, బలహీనతలను గుర్తించి వాటికి అనుగుణంగా ఎన్నికల వ్యూహాన్ని రూపొందించనున్నారు. స్థానిక సమస్యలు, నాయకుల మధ్య సమన్వయం, బలమైన అభ్యర్థుల ఎంపిక, ప్రత్యర్థి పార్టీల పరిస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానానికి నివేదిక అందించే అవకాశం ఉంది.

మున్సిపాలిటీలపై ప్రత్యేక ఫోకస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు నగరి, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీ విజయానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించడంపై శ్రీకాంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. వార్డుల వారీగా రాజకీయ పరిస్థితులు, స్థానికంగా పార్టీకి ఉన్న బలం, అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, నాయకుల సమన్వయం వంటి అంశాలపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో ప్రతి వార్డును కీలకంగా తీసుకుని ముందుకు వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. స్థానిక ఎన్నికలు పూర్తిగా క్షేత్రస్థాయి రాజకీయాలపై ఆధారపడటంతో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల స్థానిక పరిస్థితులను తెలుసుకుని పార్టీకి అనుకూలమైన వ్యూహాన్ని రూపొందించడం శ్రీకాంత్‌కు ప్రధాన సవాలుగా మారనుంది.

ఎమ్మెల్సీగా అనుభవం

2023లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శ్రీకాంత్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన కూటమి ప్రభుత్వ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడ) పొలిటికల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన శ్రీకాంత్‌కు గౌరవ డాక్టరేట్ కూడా లభించింది. విద్యావేత్త, జర్నలిస్టు కంచర్ల రామయ్య కుమారుడిగా ఆయన రాజకీయ రంగంలోకి వచ్చారు. కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన కాలంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను దగ్గరగా పరిశీలించిన శ్రీకాంత్‌కు జిల్లా రాజకీయాలపై కూడా అవగాహన ఉంది. ఇప్పుడు అదే అనుభవాన్ని జిల్లావ్యాప్తంగా ఉపయోగించి స్థానిక ఎన్నికల్లో టీడీపీకి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆయన కసరత్తు చేయనున్నారు. కుప్పం నుంచి జిల్లా స్థాయి బాధ్యతల వరకు శ్రీకాంత్ పాత్ర మారడంతో టీడీపీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించి, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లడం ఆయన ముందున్న ప్రధాన బాధ్యత. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేయనున్నారు. దీంతో చిత్తూరు జిల్లాలో స్థానిక ఎన్నికల రాజకీయ సమీకరణాలు మరింత వేడెక్కనున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *