అభివృద్ధికి ప్రతిరూపంగా స్వర్ణ కుప్పం
అభివృద్ధికి ప్రతిరూపంగా స్వర్ణ కుప్పం
నారావారిపల్లి జన్మ ఇస్తే కుప్పం రాజకీయ పునర్జన్మ ఇచ్చింది
కుప్పం ప్రజలు నా హృదయానికి దగ్గరగా ఉంటాడు
రూ.7,939 కోట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే శంకుస్థాపనలు.. మరో రూ.289 కోట్ల పనులకు భూమిపూజ
సాగు, తాగునీరు, పరిశ్రమలు, రవాణా, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం
కుప్పం ప్రజలే తన రాజకీయ జీవితానికి బలమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
కుప్పం, సెప్టెంబరు 21 (ఆంధ్రప్రభ) :
కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నారావారిపల్లె తనకు జన్మనిస్తే.. కుప్పం తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిందని భావోద్వేగంతో పేర్కొన్నారు. 40 ఏళ్లుగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తనను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్న కుప్పం ప్రజల రుణం తీర్చుకునేలా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గత రెండు నెలల క్రితం కుప్పానికి వచ్చిన సమయంలో రూ.7,939 కోట్ల విలువైన పరిశ్రమలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని, ప్రస్తుతం మరో రూ.38 కోట్ల పనులను ప్రారంభించడంతోపాటు రూ.289 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజ చేసినట్లు వెల్లడించారు.
కుప్పం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.184 కోట్లతో అంతర్భూగర్భ మౌలిక వసతుల వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు బీటీ, సీసీ రహదారుల నిర్మాణానికి రూ.16 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాల కోసం రూ.13 కోట్లతో సమీకృత భవన సముదాయం నిర్మిస్తున్నామన్నారు. హైమాస్ట్ వీధి దీపాల ఏర్పాటుకు రూ.8 కోట్లు, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు రూ.1.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనాలను రూ.15 కోట్లతో పూర్తి చేస్తామని చెప్పారు. మల్లనూరులో రూ.27 కోట్లతో జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో రూ.2 కోట్లతో ఆధునిక రైతుబజార్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. కుప్పం ప్రాంత వ్యవసాయానికి సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గంలోని 133 చెరువులకు నీటిని అందించి వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. బీరువానిపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయించామని, యామిగానిపల్లి, మనపల్లి ప్రాంతాల్లోనూ రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 550కుపైగా చిన్నతరహా సాగునీటి చెరువులను ఎత్తిపోతల పథకాల ద్వారా అనుసంధానం చేస్తామని తెలిపారు. రాబోయే రెండేళ్లలో గండికోట నుంచి పైపులైన్ ద్వారా కుప్పంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వ్యవసాయంతోపాటు ఉద్యానవనం, పాడి, పౌల్ట్రీ రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ జీవామృతం వంటి పద్ధతులను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సూక్ష్మ సేద్యం విస్తీర్ణాన్ని 2,346 హెక్టార్ల నుంచి 3,104 హెక్టార్లకు పెంచామని తెలిపారు. కుప్పంలో ప్రస్తుతం రోజుకు 5.12 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, దానిని 7.50 లక్షల లీటర్లకు, అనంతరం 10 లక్షల లీటర్లకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. పౌల్ట్రీ రంగాన్ని కూడా మరింత అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. కుప్పాన్ని పేదరికం లేని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. పీ4 విధానం ద్వారా 8,904 నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని తెలిపారు. పెద్ద సంస్థల సహకారంతో పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. వేలాది మంది డ్వాక్రా మహిళలకు నైపుణ్య శిక్షణ, డిజిటల్ పరిజ్ఞానం అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మహిళా శక్తి పారిశ్రామిక పార్కులో ప్లాట్లు కేటాయించి వారి ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తున్నట్లు తెలిపారు. కుప్పంలో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు అన్నారు. రూ.10,523 కోట్ల పెట్టుబడితో 32 పరిశ్రమలు రానున్నాయని, ఇప్పటికే 19 పరిశ్రమలు రూ.5,965 కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభించాయని తెలిపారు. వీటి ద్వారా సుమారు 53 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కుప్పంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు దక్కేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, బిర్లా శిక్షణ సంస్థతోపాటు కృత్రిమ మేధ, క్వాంటం సాంకేతికత వంటి ఆధునిక రంగాల్లో యువతకు శిక్షణ అందిస్తామని చెప్పారు. కుప్పం రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే అనుసంధానంతోపాటు కేజీఎఫ్ వైపు రహదారులు, రైల్వే అనుసంధానంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. చిత్తూరు–కుప్పం రైల్వే అనుసంధానం, బెంగళూరుకు ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధితో ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. కుప్పంలో త్వరలోనే విమానాశ్రయం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కుప్పాన్ని పర్యావరణహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు అన్నారు. ఇళ్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద తొలి దశలో 15 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు చెప్పారు. రూ.3.30 కోట్లతో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, వ్యర్థాలను సక్రమంగా సేకరించి ప్రాసెసింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుప్పంలో ‘హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్’ను రూ.15 కోట్లతో ఏర్పాటు చేసి గ్రానైట్ ఉత్పత్తులు, ఎగుమతులు, పర్యాటక రంగానికి ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటి వద్దే రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలను నమోదు చేయడంతోపాటు ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్య సహాయం, మందుల వినియోగంపై గుర్తుచేసే విధానాన్ని అందిస్తున్నామని చెప్పారు. కుప్పంలో అమలు చేస్తున్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, భూ సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కుప్పంలో 5,179 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, మరో 3–4 వేల ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. కంగుందిలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి 320 మందికి హక్కులు కల్పించామని తెలిపారు. వచ్చే మార్చి నాటికి కుప్పంలో ఒక్క భూ సమస్య కూడా లేకుండా చర్యలు తీసుకుంటామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తామని చెప్పారు. కుప్పం ఎప్పటికీ ప్రశాంతమైన నియోజకవర్గంగా ఉండాలని, అభివృద్ధి ప్రయాణం నిరంతరం కొనసాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రతి గ్రామానికీ మౌలిక వసతులు, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటూ కుప్పాన్ని అభివృద్ధికి ప్రతిరూపంగా నిలబెట్టడమే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్సీ కలిచర్ల ప్రసాద్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ మునిరత్నం, టిడిపి జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, ఇతర టిడిపి నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

