20, సెప్టెంబర్ 2026, ఆదివారం

కరువు కోరల్లో చిత్తూరు జిల్లా


కరువు కోరల్లో చిత్తూరు జిల్లా

ఖరీఫ్‌ సాగు కుదేలు.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయ్‌

ఎండుతున్న చెరువులు.. పశుగ్రాసం కరువు.. తగ్గుతున్న పాల దిగుబడి

తాగునీటికి తిప్పలు.. విద్యుత్‌ కోతలతో రైతులకు మరింత కష్టం

 కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతుల వేడుకోలు

నేటి నుండి ముఖ్యమంత్రి కుప్పం పర్యటన 

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

రుతుపవనాలు ముఖం చాటేయడంతో చిత్తూరు జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంటోంది. సకాలంలో వర్షాలు కురవక ఖరీఫ్‌ సాగు తీవ్రంగా దెబ్బతినగా, భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోతుండటంతో పశువులకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు పశుగ్రాసం కొరత ఏర్పడటంతో పాల ఉత్పత్తి తగ్గిపోయి పశుపోషణ కూడా రైతులకు భారంగా మారింది. జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. సెప్టెంబరు 20 నాటికి నమోదైన గణాంకాల ప్రకారం జిల్లాలో 2,939.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 4,361.6 మి.మీ. కాగా, సాధారణంతో పోలిస్తే 32.6 శాతం లోటు ఉంది. వర్షాభావం నేరుగా ఖరీఫ్‌ సాగుపై ప్రభావం చూపింది. జూన్‌లో కురిసిన కొద్దిపాటి వర్షాలతో రైతులు పంటలు సాగు చేయాలని భావించినా జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన వర్షాలు లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో పంటలు నిలదొక్కుకోలేదు. వర్షాధార పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలను తిరిగి సాగు చేయడానికి అయ్యే ఖర్చు పెరగడంతో రైతులు వెనుకంజ వేసిన పరిస్థితి కూడా నెలకొంది. వర్షాభావం కారణంగా భూగర్భ జలాల పునరుద్ధరణ తగ్గిపోయి బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయని క్షేత్రస్థాయి నివేదికలు సూచిస్తున్నాయి.

చెరువులు.. కుంటలు ఎండిపోతున్నాయ్‌

వర్షాలు లేక చెరువులు, కుంటలు, వాగుల్లోకి నీటి ప్రవాహం తగ్గిపోయింది. నీటి నిల్వలు తగ్గిపోవడంతో గ్రామాల్లో పశువులకు తాగునీరు అందించడమే సమస్యగా మారుతోంది. వర్షాధారంగా పెరిగే పచ్చిక కూడా అందుబాటులో లేకపోవడంతో పశుగ్రాసం కొరత తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో పశుపోషణపై ఆధారపడే రైతులు పశుగ్రాసం కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు క్షేత్రస్థాయి సమాచారం వెల్లడిస్తోంది. పశుగ్రాసం కొరత పాడి పరిశ్రమపైనా ప్రభావం చూపుతోంది. తగినంత మేత లభించకపోవడంతో పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. పశువులను పోషించడం భారంగా మారిన పరిస్థితుల్లో కొందరు రైతులు ఆవులను విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమను కూడా ఆదుకునేందుకు పశుగ్రాసం, పశువులకు నీరు, పాడి రైతులకు ప్రత్యేక సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.

మామిడి తోటలపైనా ప్రభావం

చిత్తూరు జిల్లాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మామిడి తోటలపై కూడా వర్షాభావం ప్రభావం చూపుతోంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో నీటి ఆధారంగా తోటలను కాపాడుకోవడం కష్టమవుతోంది. నీరు అందక మామిడి చెట్లు ఎండిపోతుండటంతో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టపోతున్నారు. వరుసగా వర్షాభావ పరిస్థితులు కొనసాగితే వచ్చే సీజన్‌లో మామిడి దిగుబడిపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని గ్రామీణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఇప్పటికే తాగునీటి సమస్య ప్రారంభమైందని చెబుతున్నారు. భూగర్భ జలాలు మరింత పడిపోతే బోర్లపై ఆధారపడిన గ్రామాలకు నీటి సరఫరా చేయడం కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. చిత్తూరు, పలమనేరు మున్సిపాలిటీల్లోనూ తాగునీటి పరిస్థితిపై ముందస్తు ప్రణాళిక అవసరమని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి వనరులు పరిమిత కాలానికే సరిపోతాయని, సుమారు 100 రోజుల తర్వాత నీటి సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రత్యామ్నాయ తాగునీటి వనరులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని కోరుతున్నారు.

విద్యుత్‌ సరఫరాలో అంతరాలు.. లో ఓల్టేజీతో ఇబ్బందులు

వర్షాభావంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాలు, లో ఓల్టేజీ సమస్యలు మరింత భారంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయని రైతులు చెబుతున్నారు. బోర్ల నుంచి నీటిని తోడుకునేందుకు విద్యుత్‌పై ఆధారపడుతున్న రైతులకు సరైన సమయంలో విద్యుత్‌ అందకపోవడంతో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా పంటలు, తోటలకు అందించడం కష్టమవుతోంది. విద్యుత్‌ సరఫరాను క్రమబద్ధీకరించి, వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఎక్కడ వ్యవసాయ రంగానికి 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడం లేదు.

కరువు ప్రాంతంగా ప్రకటించాలి

వర్షాభావం, ఖరీఫ్‌ సాగు దెబ్బతినడం, భూగర్భ జలాలు పడిపోవడం, చెరువులు ఎండిపోవడం, పశుగ్రాసం కొరత, పాడి రంగంపై ప్రభావం, తాగునీటి సమస్య వంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకుని చిత్తూరు జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు పశుగ్రాసం, పశువులకు తాగునీరు, తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాన కోసం ఆకాశం వైపు.. సాయం కోసం ప్రభుత్వం వైపు రైతులు ఎదురుచూస్తున్నారు. పంటలు పండక, పశువులకు మేత లేక, నీటి వనరులు అడుగంటుతుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించి తాగునీరు, పశుగ్రాసం, విద్యుత్‌, వ్యవసాయం, పాడి రంగాలకు అత్యవసర ప్రణాళిక రూపొందించి జిల్లా రైతులను ఆదుకోవాలని, చిత్తూరు జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు ముఖ్యమంత్రిని కోరుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *