వీబీ జీ రామ్‌జీ సిబ్బంది సమస్యల పరిష్కారం ఎప్పుడు ?
వీబీ జీ రామ్‌జీ సిబ్బంది సమస్యల పరిష్కారం ఎప్పుడు ?
వేతనాల పెంపు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత కోసం
నగదు రహిత వైద్యం, పదవీ విరమణ ప్రయోజనాలు
ఎనిమిది సంవత్సరాలుగా ఎదురు చూపులే !
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల అమలు నుంచి మౌలిక వసతుల కల్పన వరకు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వేతనాల పెంపు, వేతన సవరణ, పదోన్నతులు, ఉద్యోగ భద్రత, గ్రాట్యూటీ, నగదు రహిత వైద్య కార్డులు, పదవీ విరమణ ప్రయోజనాలు తదితర అంశాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా గత ఎనిమిదేళ్లుగా తమ సేవా ప్రయోజనాల విషయంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. తాజాగా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుందని వారు ఆశిస్తున్నారు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఎస్‌ఆర్‌డీఎస్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం వీబీ-జీ రామ్‌జీ పరిధిలో మొత్తం 18,993 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మండల స్థాయిలో ఏపీఓలు, ఈసీలు, జేఈలు, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ సహాయకులు, క్షేత్ర సహాయకులు తదితర విభాగాల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 4,693 మంది ఉపాధిహామీ ఉద్యోగులు, 192 మంది వాటర్‌షెడ్ ఉద్యోగులు, 373 మంది తాత్కాలిక ఉద్యోగులు, 1,736 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, 3,214 మంది ఎఫ్‌టీఈ ఫీల్డ్ అసిస్టెంట్లు, 8,785 మంది ఇతర ఉద్యోగులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను గుర్తించడం, కూలీలకు పనులు కల్పించడం, పనుల పురోగతిని పర్యవేక్షించడం, హాజరు నమోదు, వేతనాల జనరేషన్, పనుల వివరాలను నమోదు చేయడం వంటి అనేక బాధ్యతలను సిబ్బంది నిర్వహిస్తున్నారు. చెరువులు, కాలువలు, నీటి సంరక్షణ పనులు, రహదారులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పనుల్లోనూ వీరి పాత్ర కీలకంగా ఉంది. మెటీరియల్ కాంపొనెంట్ కింద నిధులను సమీకరించడం, పనులను అమలు చేయడం, కూలీలకు వేతనాలు అందేలా చూడటం వంటి బాధ్యతల్లోనూ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో క్షేత్రస్థాయి సిబ్బంది ప్రధాన వారధిగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్ శాఖలో వివిధ కేడర్ల ఉద్యోగులకు విస్తృతంగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నందుకు అభినందనలు తెలుపుతున్నారు. అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు వేర్వేరు శాఖలైనప్పటికీ గ్రామీణ ప్రజల అభ్యున్నతే ఉమ్మడి లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుర్తుచేస్తున్నారు. ఒకే మంత్రి, ఒకే ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ల పర్యవేక్షణలో రెండు శాఖలు పనిచేస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ ఉద్యోగులకు లభిస్తున్న సేవా ప్రయోజనాలు, సంక్షేమ చర్యల్లో కొంత భాగమైనా గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి అందించాలని కోరుతున్నారు. గత ఎనిమిదేళ్లుగా వేతనాల పెంపు, పదోన్నతులు, సర్వీస్ ప్రయోజనాలు తదితర అంశాలపై ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగుల వేతనాల పెంపు, పదోన్నతులకు చర్యలు తీసుకున్న సందర్భాలను వారు ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలిగిందని, అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. వీబీ జీ రామ్‌జీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగుల సేవా ప్రయోజనాలపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సంఘాలతో అధికారులు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. జూలై 27న కమిషనర్ వి.ఆర్. కృష్ణతేజ గ్రామీణాభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 6న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలోనూ సమీక్ష జరిగింది. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ప్రతిపాదనలపై కమిటీ స్థాయిలో చర్చలు జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో బేసిక్ స్కేల్ ఏర్పాటు చేయడం, వేతన సవరణ, గ్రేడ్ ఫిక్సేషన్, గ్రేడ్ టేబుల్ సవరణ వంటి అంశాలను ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో పీఆర్సీ అమలు చేసిన ప్రతిసారీ వీబీ-జీ రామ్‌జీ సిబ్బందికి కూడా ప్రయోజనం కలిగేలా విధానం రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో కేడర్లను బట్టి వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను సవరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందిని ఎఫ్‌టీఈలుగా మార్చే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ కేడర్లలో పనిచేస్తున్న సిబ్బందికి స్పష్టమైన సేవా నిబంధనలు రూపొందించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అర్హత, అనుభవం, సీనియారిటీ ఆధారంగా పదోన్నతులకు అవకాశం కల్పించేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే హోదాలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో నిరాశ నెలకొంటోందని చెబుతున్నారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సిబ్బందికి పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రత లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో గ్రాట్యూటీ సదుపాయాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.25 కోట్లతో నిధిని ఏర్పాటు చేసి, ప్రతి ఏటా దాన్ని పెంచుతూ ఉద్యోగ విరమణ సమయానికి ప్రయోజనం అందించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందేలా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కూడా కోరుతున్నారు. వీబీ జీ రామ్‌జీ సిబ్బంది పదవీ విరమణ వయసును ప్రస్తుత 58 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని ఉద్యోగులు కోరుతున్నారు. విధి నిర్వహణలో సిబ్బంది మరణించిన సందర్భాల్లో ప్రస్తుతం అందుతున్న రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల కుటుంబాలకు భద్రత కల్పించేలా ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు. వీబీ జీ రామ్‌జీ కొత్త విధానంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సంస్థాగత సంస్కరణలతోపాటు సిబ్బంది సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. వేతనాల పెంపు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత, గ్రాట్యూటీ, నగదు రహిత వైద్య సదుపాయం, పదవీ విరమణ ప్రయోజనాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు ఈసారి శాశ్వత పరిష్కారం లభిస్తుందా అన్నదే 18,993 మంది సిబ్బందిలో ప్రధాన చర్చగా మారింది.

