8, సెప్టెంబర్ 2026, మంగళవారం

స్థానిక సమరానికి టీడీపీ సన్నద్ధం



స్థానిక సమరానికి టీడీపీ సన్నద్ధం

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడిగా దామచర్ల సత్యనారాయణ

అభ్యర్థుల ఎంపిక, పార్టీ అంతర్గత విభేదాల పరిష్కారంలో కీలక బాధ్యత

Plఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి.. ఇంటింటికీ తెలుగుదేశం.. కొత్త పింఛన్లతో ప్రజల్లోకి

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొంటున్న పార్టీ శ్రేణులు

బోగస్‌ ఓట్ల తొలగింపు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి

అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం

కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంతో మరింతగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం

త్వరలో కార్పొరేటర్ చైర్మన్ ల, డైరెక్టర్ ల పోస్టుల భర్తీ


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వెలువడినా ఎదుర్కొనేలా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఓటర్లను సమీకరించే కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అభ్యర్థుల ఎంపికకు ముందస్తు కసరత్తు, ఓటర్ల జాబితాల పరిశీలన, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం వంటి కార్యక్రమాలతో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికలను సమన్వయం చేసేందుకు చిత్తూరు జిల్లా పరిశీలకుడిగా ఏపీ మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణను రాష్ట్ర టీడీపీ నియమించింది. ఆయన త్వరలో జిల్లాలో విస్తృతంగా పర్యటించి నియోజకవర్గాలు, మండలాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న నాయకులు, ఆశావహుల పనితీరు, ప్రజల్లో ఉన్న ఆదరణ, పార్టీకి వారి సేవలను పరిశీలించి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించనున్నారు. అదే సమయంలో పార్టీ శ్రేణుల మధ్య ఎక్కడైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించి అందరినీ సమన్వయం చేసేందుకు ప్రయత్నించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల జాబితా కీలకం కావడంతో టీడీపీ శ్రేణులు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొంటున్నారు. తమ పార్టీకి చెందిన అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా పరిశీలించడంతో పాటు మృతి చెందిన వారు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారు, ఒకే వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉన్న సందర్భాలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అలాగే అర్హత కలిగిన కొత్త ఓటర్లను జాబితాలో చేర్పించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు. మరోవైపు అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాలనలో గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. గ్రామస్థాయిలో పార్టీకి ఉన్న బలాబలాలను అంచనా వేసుకుంటూ స్థానిక సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. ఇక కొత్త పింఛన్ల మంజూరును కూడా పార్టీ శ్రేణులు కీలకంగా భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు పింఛను కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం నుంచి ప్రయోజనం అందే అవకాశం ఉంది. కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, అర్హుల గుర్తింపు ప్రక్రియపై స్థానిక నాయకులు కూడా దృష్టి సారిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పదవుల భర్తీపై కూడా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 24వ తేదీతో పలు కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త చైర్మన్ల నియామకానికి చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఖాళీగా ఉన్న కార్పొరేషన్లతో పాటు పదవీకాలం ముగిసే సంస్థలకు కొత్తగా చైర్మన్లు, పలుచోట్ల డైరెక్టర్లను నియమించే అంశంపై పార్టీ స్థాయిలో పరిశీలన జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసి పార్టీకి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా పరిశీలకుడి నియామకం, మరోవైపు ఓటర్ల జాబితాల సవరణ, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం, కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీ వంటి పరిణామాలతో టీడీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోంది. గ్రామ, మండల స్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసి బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *