మామిడి రైతుల జాబితా సిద్ధం.. సబ్సిడీకి రంగం సిద్ధం
మామిడి రైతుల జాబితా సిద్ధం.. సబ్సిడీకి రంగం సిద్ధం
• మామిడి రైతులకు సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.281 కోట్లు విడుదల
• చిత్తూరు జిల్లాలో 31,187 మంది రైతులు 3,95,123 టన్నుల మామిడికాయల సరఫరా
• పరిశీలనలో 45 వేల టన్నుల మామిడికాయలు ఇతరుల పేర్లపై సరఫరా చేసినట్లు గుర్తింపు
• 2,861 మంది రైతులు బోగస్‌గా తేల్చిన అధికారులు
• అర్హులైన రైతులకు కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ
• గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన
• ఆధార్, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులుంటే సవరించుకునే అవకాశం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లాలో ఈ సీజన్‌లో మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నగదు అందజేతకు సంబంధించిన పరిశీలన ప్రక్రియ పూర్తయింది. గురువారం గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించడంతో మామిడి రైతుల్లో ఆసక్తి నెలకొంది. తమ పేరు జాబితాలో ఉందా? లేదా? అని రైతులు ఆసక్తిగా పరిశీలించుకున్నారు. మామిడి కాయలు సరఫరా చేసిన ప్రతి రైతు జాబితాను ఒకసారి పరిశీలించుకోవాలని, వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యాన శాఖ అధికారులు సూచించారు. జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో తోతాపురి మామిడి కాయలను సరఫరా చేసిన రైతుల జాబితాను గురువారం నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు ఉద్యాన శాఖ డీడీ సతీష్ తెలిపారు. జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమలు, ర్యాంపులు, మండీలకు తోతాపురి మామిడి కాయలను తరలించిన రైతుల వివరాలను నమోదు చేసి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం టన్నుకు రూ.4 వేల చొప్పున ప్రోత్సాహక నగదు ప్రకటించిన నేపథ్యంలో అర్హులైన రైతులకు ప్రయోజనం అందేలా వివరాలను పక్కాగా నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సీజన్‌లో చిత్తూరు జిల్లాలో 31,187 మంది రైతులు మొత్తం 3,95,123 టన్నుల మామిడికాయలను మామిడి గుజ్జు పరిశ్రమలు, మండీలు, ర్యాంపులకు సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైతులు సరఫరా చేసిన మామిడికాయలకు సంబంధించిన బిల్లులు, భూమి పాస్‌పుస్తకాలు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను సంబంధిత ప్రాంతాల్లో సమర్పించారు. గుజ్జు పరిశ్రమలకు మామిడికాయలను తరలించిన రైతులు ఆయా ఫ్యాక్టరీల వద్ద, ర్యాంపులు, మండీలకు కాయలను తరలించిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో అవసరమైన పత్రాలను అందజేశారు. అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతుకు భూమి ఉందా? ఉంటే ఎంత విస్తీర్ణం ఉంది? ఆ భూమి నుంచి ఎంత మేర దిగుబడి వచ్చే అవకాశం ఉంది? అనే అంశాలను పరిశీలనలో పరిగణనలోకి తీసుకున్నారు. దిగుబడి విషయంలో ఎకరాకు సగటున ఆరు టన్నుల మామిడికాయల దిగుబడిని ప్రామాణికంగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భూమి ఉన్న వ్యక్తుల పేర్లపైనే మామిడికాయలను తరలించారా? లేక ఇతరుల పేర్లపై కాయలను తరలించారా? అనే అంశాన్ని కూడా నిశితంగా పరిశీలించారు. కుటుంబ సభ్యుల పేర్లతో మామిడికాయలను తరలించిన సందర్భాల్లోనూ నిబంధనలకు అనుగుణంగా పరిశీలన చేపట్టారు. తండ్రి పేరుతో భూమి ఉండి, ఆయన మరణించిన తరువాత పిల్లల పేరుతో మామిడికాయలను తరలించిన సందర్భాలను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే అన్నాచెల్లెళ్లు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, కుమారులు తదితర రక్తసంబంధీకుల పేర్లపై ఉన్న భూములకు సంబంధించి మామిడికాయలను కుటుంబ సభ్యుల పేర్లతో తరలించిన సందర్భాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పరిశీలనలో అనర్హతలకు సంబంధించిన పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 45 వేల టన్నుల మామిడికాయలను ఇతరుల పేర్లపై తరలించినట్లు ఉద్యాన శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. అదేవిధంగా 2,861 మంది రైతులు బోగస్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి భూమి లేకపోయినా మామిడికాయలను సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించినట్లు పరిశీలనలో వెల్లడైంది. దీంతో వీరికి ప్రభుత్వ సబ్సిడీ పొందే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ నిజమైన మామిడి రైతులకే అందేలా అర్హతను నిర్ధారించేందుకు ఈ స్థాయిలో పరిశీలన చేపట్టారు. రైతుల నుంచి స్వీకరించిన బిల్లులు, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, మామిడికాయల సరఫరా వివరాలను పరస్పరం పరిశీలించి అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేశారు. దీనివల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అర్హులైన రైతులకు నేరుగా ప్రయోజనం అందే అవకాశం ఏర్పడింది. ఇదిలా ఉండగా గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించిన జాబితాలను మామిడి రైతులు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. జాబితాలో తమ పేరు లేకపోయినా, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఇతర వివరాలు తప్పుగా నమోదై ఉన్నా రైతు సేవా కేంద్రాల సహాయకుల దృష్టికి తీసుకెళ్లి సవరించుకోవచ్చని తెలిపారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేసిన అనంతరం తుది వివరాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. మామిడి రైతులకు ఊరట కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ అందించేందుకు రూ.281 కోట్ల నిధులను విడుదల చేసింది. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని సుమారు 7.03 లక్షల మంది రైతులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో అర్హత పొందిన మామిడి రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరలోనే కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ జమ కానుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో లబ్ధిదారుల జాబితాల ప్రదర్శనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవైపు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకునేందుకు రైతులు ఆసక్తిగా పరిశీలిస్తుండగా, మరోవైపు వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకునే అవకాశం అధికారులు కల్పించారు. పరిశీలన ప్రక్రియ పూర్తవడంతో అర్హులైన మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నగదు అందే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలోనే రైతుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమ కానుండటంతో ఈ సీజన్‌లో మామిడి పంటను సాగు చేసి, ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

