8, సెప్టెంబర్ 2026, మంగళవారం

కుప్పంలో రాజుకున్న స్థానిక సంస్థల ఎన్నికల వేడి

కుప్పంలో రాజుకున్న స్థానిక సంస్థల ఎన్నికల వేడి

చంపడానికైనా.. చావడానికైనా సిద్ధం : ఎమ్మెల్సీ భరత్

రక్తాభిషేకం చేసినా యుద్ధంలో గెలుస్తా.. ఎన్నికల్లో పోరాటం తప్పదని వ్యాఖ్య

పెద్దిరెడ్డి వస్తాడనే పోస్టుకే టీడీపీ నేతల్లో భయం.. నిజంగా వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్న

వైసీపీ సమావేశానికి కళ్యాణ మండపాలు ఇవ్వలేదంటూ ఆరోపణ

అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి సగం విజయం సాధిస్తామని ధీమా

వైసీపీ వ్యాఖ్యలపై టీడీపీ ఫిర్యాదులు.. జడ్పీ చైర్మన్ వాహనంపై దాడి యత్నం కలకలం

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలను యుద్ధంగా అభివర్ణించిన ఆయన.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘చంపడానికైనా.. చావడానికైనా సిద్ధంగా ఉండే వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తాం. రక్తాభిషేకం చేసినా ఈ యుద్ధంలో గెలుస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కుప్పం పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగలిగితేనే సగం విజయం సాధించినట్లేనని అన్నారు. టీడీపీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, అధికార యంత్రాంగం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నామినేషన్ వేసిన ఒక్క అభ్యర్థి కూడా ఉపసంహరించుకోకుండా ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. వైసీపీ సమావేశం నిర్వహించేందుకు కళ్యాణ మండపాలు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకున్నారని భరత్ ఆరోపించారు. వైసీపీ సమావేశం పెట్టుకుంటేనే ఎందుకంత భయమని ప్రశ్నించారు. సమావేశం జరిగితే గొడవ జరుగుతుందని టీడీపీ నేతలు ముందుగానే హెచ్చరించినప్పటికీ వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయని తెలిపారు. టీడీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు, నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము భయపడబోమని అన్నారు. సింహంలా బతకడం వేరు.. సింహం వేషం వేసుకుని బతకడం వేరు అంటూ టీడీపీ నాయకులపై ఎమ్మెల్సీ భరత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కోసం పనిచేసే ప్రతి నాయకుడు సింహమేనని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే విధంగా పనిచేస్తారని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్ల కాలంలో సింహం వేషం వేసుకున్న టీడీపీ నాయకులు రోడ్డుపైకి వచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తాము ప్రజల కోసం రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నామని, కేసులు పెట్టడం తప్ప ఇంకేం చేస్తారని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెడితే అంతగా ప్రజల్లో తమ బలం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. కాలం కలిసి వస్తే ఎవరైనా రాజు కావచ్చని, అందుకు ప్రత్యేక అర్హత అవసరం లేదని భరత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాలం టీడీపీకి కలిసి వచ్చిందని, అందువల్ల ఆ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా పెద్దా, చిన్నా తేడా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గానికి వస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టుపై కూడా భరత్ స్పందించారు. పెద్దిరెడ్డి వస్తారనే పోస్టు పెట్టగానే టీడీపీ నేతలు భయపడి సమావేశం పెట్టారని, నిజంగా పెద్దిరెడ్డి కుప్పానికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని సవాల్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఇన్నాళ్లూ కుప్పంలో రాజకీయాలు చేశామని, వైసీపీ ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేస్తోందని, టీడీపీ మాదిరిగా ఈవీఎంలను నమ్ముకుని రాజకీయాలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కుప్పంలో యుద్ధం జరిగే జరుగుతుంది. వాళ్లు రక్తంతో యుద్ధం చేయాలనుకుంటున్నారు.. రక్తాభిషేకం చేసినా ఈ యుద్ధంలో నేను గెలుస్తాను అని భరత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేసే సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగకుండా పోరాడే వారిని ఎంపిక చేస్తామని, చంపడానికైనా.. చావడానికైనా సిద్ధంగా ఉండే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, వైసీపీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని రెచ్చగొట్టేలా ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ రామకుప్పం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శాంతిపురం మండలంలోనూ టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ భరత్ వ్యాఖ్యలపై పోలీసులను ఆశ్రయించారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు నందిగం ఉదయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కుప్పం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మరోవైపు శాంతిపురం మండలం నాయనపల్లి గ్రామ సరిహద్దుల్లో జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ప్రయాణిస్తున్న కారును సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. తాను, శాంతిపురం మండల జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు కారులో వీకోట వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. కారును అడ్డుకుని కొందరు వాహనంపై చేతులతో కొట్టారని, అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించారని, మరికొందరు కారు ముందు భాగంలోకి ఎక్కి హంగామా సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రైవర్ చాకచక్యంగా కారును ముందుకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. అనంతరం కొందరు బైకులు, కార్లలో తమ వాహనాన్ని వెంబడించారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. రాజకీయాల్లో ఎవరి అభిమానం వారిదని, ఎవరి ఓటు హక్కు వారిదేనని, ప్రజలకు అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకుని రాజకీయాల్లో ఎదగాలి తప్ప బెదిరింపులు, భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుప్పంలో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం క్రమంగా రోడ్డుపై రాజకీయ ఘర్షణల వరకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా సమావేశాలు, సవాళ్లు, పరస్పర ఆరోపణలు, పోలీసులకు ఫిర్యాదులతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కుప్పంలో ఇరుపార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే రాజకీయ సమరం తీవ్రరూపం దాల్చింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *