డీఎస్సీపై దమ్ముంటే అసెంబ్లీకి రండి
డీఎస్సీపై దమ్ముంటే అసెంబ్లీకి రండి
ఉపాధ్యాయులపై దాడులు చేస్తే ఉక్కుపాదం..
రౌడీయిజాన్ని సహించేది లేదు
గొడ్డలి పార్టీ’కి స్థానిక ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కకుండా చూడండి
ఫేక్ ప్రచారాలకు వాస్తవాలతో సమాధానం చెబుతాం
జే-బ్రాండ్లు, ఏపీపీఎస్సీ వ్యవహారాలపై సమాధానం చెప్పాలని వైసీపీకి సవాల్
నేను పట్టుదల వదలని విక్రమార్కుడిని..
కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
చిత్తూరు, సెప్టెంబరు 21 (ఆంధ్రప్రభ బ్యూరో) : డీఎస్సీలో అవకతవకలు జరిగి ఉంటే చర్చించడానికి దమ్ముంటే అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సవాల్ చేశారు. ఏవైనా రుజువులు ఉంటే అసెంబ్లీకి గాని కోర్టుకు గాని సమర్పించాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పేపర్ లీక్ కాదని, అవకతవకలు జరగవని స్పష్టం చేశారు. ఎవరైనా అలా చేస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. డీఎస్సీ అంటే టిడిపి అని టిడిపి అంటే డిఎస్సి వివరించారు. కుప్పం పర్యటనలో భాగంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన రాష్ట్ర రాజకీయాలు, మెగా డీఎస్సీ నియామకాలు, ఉపాధ్యాయులపై దాడులు, వైఎస్సార్‌సీపీ విమర్శలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్రంగా స్పందించారు. మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో పేపర్ లీకేజీకి గానీ, పైసా అవినీతికి గానీ తావులేదని స్పష్టం చేశారు. తన పాలనలో ఇప్పటివరకు 14 డీఎస్సీలు నిర్వహించామని, ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీ, అవినీతికి అవకాశం లేకుండా నియామకాలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. డీఎస్సీ నియామకాలపై అనుమానాలు, అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాలను ఆశ్రయించవచ్చని, కోర్టులకు వెళ్లే అవకాశం ఉన్నప్పుడు రోడ్లపైకి వచ్చి ఉపాధ్యాయులపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ధైర్యముంటే అసెంబ్లీకి రండి.. సాక్ష్యాధారాలతో చర్చిద్దాం అంటూ ప్రతిపక్షానికి సవాల్ చేశారు. తాము చేపట్టిన నియామక ప్రక్రియపై వాస్తవాలను ఆధారాలతో సహా ప్రజల ముందుంచుతామని అన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు రాత్రింబవళ్లు చదువుకుని, పోటీ పరీక్షల్లో పాల్గొని తమ కష్టార్జితంతో ఉద్యోగాలు సాధించారని చంద్రబాబు అన్నారు. గతంలో ప్రభుత్వమే ఇచ్చిన క్రీడా ధ్రువపత్రాల ఆధారంగా ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వారిని నకిలీ అంటూ ఆరోపించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విజయవాడలో స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం
ఉపాధ్యాయులపై దాడులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమాజానికి మార్గదర్శకులైన ఉపాధ్యాయులపై భౌతిక దాడులకు దిగడం సరికాదన్నారు. ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను అవమానించడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, వారిపై దాడులకు దిగడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై విజయవాడలో వైఎస్సార్‌సీపీ ఆందోళన, ఎంపికైన ఉపాధ్యాయుల నిరసన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులపై దాడులను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, రౌడీయిజానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్మీలో సేవలందించిన వ్యక్తి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికైతే ఆయనను కూడా అవమానించే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయులు తమ కష్టార్జితంతో ఉద్యోగాలు సాధించామని చెబుతున్నా వారిపై దాడులకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘‘ఉపాధ్యాయుల జోలికి వస్తే సహించేది లేదు’’ అని స్పష్టం చేశారు.
ఫేక్ ప్రచారాలకు వాస్తవాలతో సమాధానం
తమ ప్రభుత్వంపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వాటికి వాస్తవాలతో సమాధానం చెబుతామని చంద్రబాబు అన్నారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే అసలు విషయాలను ఆధారాలతో ప్రజల ముందుంచుతామని తెలిపారు. ఇప్పటికే డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలకు అధికారుల స్థాయిలో సమాధానాలు ఇచ్చామని, అవసరమైతే అసెంబ్లీ వేదికగా పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. మీకు ధైర్యముంటే అసెంబ్లీకి రండి.. సాక్ష్యాధారాలతో చర్చిద్దాం అని మరోసారి సవాల్ చేశారు. చట్టబద్ధంగా జరిగిన నియామకాలపై రాజకీయ ఆరోపణలు చేయడం కంటే ఆధారాలతో మాట్లాడాలని సూచించారు.
జే-బ్రాండ్లు, ఏపీపీఎస్సీపై సవాల్
వైఎస్సార్‌సీపీ నాయకులు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానేసి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాలపై సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా జే-బ్రాండ్ల మద్యం వ్యవహారం, ఏపీపీఎస్సీ పరీక్షలు, నియామకాల్లో అక్రమాలపై తాము ప్రశ్నలు లేవనెత్తుతున్నామని చెప్పారు. వీటిపై ధైర్యంగా సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని, అధికారంలో ఉన్నవారే రౌడీయిజాన్ని ప్రోత్సహించారని చంద్రబాబు ఆరోపించారు. కుప్పానికి తాను వచ్చిన సందర్భాల్లోనూ తనను అడ్డుకుని ఇబ్బందులు పెట్టారని గుర్తుచేశారు. అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే తరహా రాజకీయాలు కొనసాగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ఒక్క స్థానం కూడా వద్దు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయిందని గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు తమ తీర్పు చెప్పాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ఒక్క స్థానం కూడా రాకుండా చూడాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డులో కూటమి అభ్యర్థులు గెలవాలని కోరారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ లభిస్తే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అది ప్రజల మద్దతుగా నిలుస్తుందని అన్నారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం, విధ్వంసానికి పాల్పడేవారికి రాష్ట్రంలో స్థానం ఉండకూడదని చంద్రబాబు అన్నారు. కుప్పం నుంచే రౌడీయిజానికి వ్యతిరేకంగా ప్రజలు గట్టి సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీని బంగాళాఖాతంలో కలపాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర స్పందనకు దారితీశాయి.
నేను విక్రమార్కుడిని..
తన రాజకీయ ప్రస్థానం, కుప్పంతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించిన చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. నారావారిపల్లె నాకు జన్మనిస్తే.. కుప్పం నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. కుప్పం ప్రజలు 40 ఏళ్లుగా తనను ఆదరిస్తున్నారని గుర్తుచేశారు. కుప్పాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని చెబుతూ, నేను పట్టుదల వదలను.. విక్రమార్కుడిని. ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోనని అన్నారు. కుప్పాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. కుప్పం అభివృద్ధికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు.
సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో సమీపంలోని మసీదు నుంచి అజా ప్రార్థన వినిపించడంతో చంద్రబాబు కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపివేశారు. ప్రార్థన పూర్తయిన తరువాత తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ కంచర్ల ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ మునిరత్నం, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ టిడిపి జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి ఇతర టిడిపి నేతలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

