9, సెప్టెంబర్ 2026, బుధవారం

నేతన్నలకు విద్యుత్‌ భరోసా..

నేతన్నలకు విద్యుత్‌ భరోసా.. 

జిల్లాలో వేలాది కుటుంబాలకు ప్రయోజనం

చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 

పవర్‌లూమ్‌ యూనిట్లకు నెలకు 500 యూనిట్లు

50 సంవత్సరాలు నిండిన కార్మికునికి రూ. 4000 పింఛన్ 

ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 25,000 ఆర్థిక సహాయం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

చేనేత రంగాన్ని ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ పథకం చిత్తూరు జిల్లాలోని నేత కార్మికులకు గణనీయమైన ఊరట కల్పించనుంది. చేనేత మగ్గాలపై ఆధారపడి జీవించే కుటుంబాలతో పాటు మరమగ్గాల నిర్వహణ ద్వారా ఉపాధి పొందుతున్న వారికి విద్యుత్‌ బిల్లుల భారం తగ్గనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2026 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తోంది. 2026లో నిర్వహించిన ఉచిత విద్యుత్‌ సర్వే ఆధారంగా చిత్తూరు జిల్లాలో 281 చేనేత కుటుంబాలు పథకం పరిధిలోకి వస్తున్నట్లు జిల్లా వారీ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ కుటుంబాలు మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఉచిత విద్యుత్‌ పథకానికి సంబంధించి నిర్వహించిన సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగానే లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

చిత్తూరు జిల్లాలో మరమగ్గాల రంగం కూడా ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. ముఖ్యంగా నగరి ప్రాంతంలో పవర్‌లూమ్‌ కార్యకలాపాలు విస్తృతంగా ఉండటంతో, ఉచిత విద్యుత్‌ పథకం అక్కడి నేత కార్మికులకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంలో ఉపయోగపడనుంది. అయితే పవర్‌లూమ్‌ లబ్ధిదారుల తాజా జిల్లా వారీ అధికారిక సంఖ్యను సంబంధిత చేనేత శాఖ లేదా విద్యుత్‌ శాఖ తుది జాబితా ఆధారంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. చేనేత మగ్గంపై పనిచేసే కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితం. ఈ పరిమితి వల్ల ఒక్కో చేనేత కుటుంబానికి నెలకు సుమారు రూ.720 వరకు, ఏడాదికి రూ.8,640 వరకు విద్యుత్‌ ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో సర్వేలో నమోదైన 281 చేనేత కుటుంబాలన్నీ గరిష్ఠ ప్రయోజనం పొందితే, ఒక్క ఏడాదిలో ఈ కుటుంబాలకు కలిపి సుమారు రూ.24.28 లక్షల వరకు విద్యుత్‌ వ్యయం ఆదా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది గరిష్ఠ వినియోగాన్ని ఆధారంగా చేసుకున్న అంచనా మాత్రమే. వాస్తవంగా ఒక్కో కుటుంబం వినియోగించే యూనిట్లను బట్టి ఆదా మొత్తం మారుతుంది. పవర్‌లూమ్‌ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందుతుంది. మరమగ్గాలు విద్యుత్‌పై నడిచే యంత్రాలు కావడంతో విద్యుత్‌ ఖర్చు ఉత్పత్తి వ్యయంలో కీలక భాగంగా ఉంటుంది. అందువల్ల ఉచిత విద్యుత్‌ వల్ల పవర్‌లూమ్‌ నిర్వాహకులకు నేరుగా ఉత్పత్తి వ్యయం తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఒక్కో పవర్‌లూమ్‌ యూనిట్‌కు నెలకు సుమారు రూ.1,800 వరకు, ఏడాదికి రూ.21,600 వరకు విద్యుత్‌ ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉంది. చేనేత రంగంలో నూలు, రంగులు, అద్దకం, రవాణా, మగ్గాల నిర్వహణ తదితర ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్‌ బిల్లుల భారం కూడా నేత కుటుంబాలపై ప్రభావం చూపుతోంది. మరోవైపు తయారైన వస్త్రాలకు మార్కెట్‌లో లభించే ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కుటుంబ ఆదాయంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ బిల్లు చెల్లించాల్సిన అవసరం తగ్గడం నేత కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనంగా మారనుంది. ఇంటి వద్దే మగ్గాలు ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేసే చేనేత కుటుంబాలకు ఈ పథకం మరింత ఉపయోగకరంగా మారనుంది. విద్యుత్‌ బిల్లుపై ఆదా అయ్యే మొత్తాన్ని నూలు కొనుగోలు, మగ్గాల మరమ్మతులు, పిల్లల విద్య, ఇతర కుటుంబ అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి వ్యయంలో కొంత తగ్గుదల రావడం ద్వారా తయారైన వస్త్రాలపై వచ్చే లాభం కూడా కొంత మేర పెరిగే అవకాశం ఉంది. మరమగ్గాల విషయంలో ఈ ప్రయోజనం మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. యంత్రాలు ఎక్కువసేపు పనిచేసే యూనిట్లలో విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుంది. అలాంటి యూనిట్లకు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందడం వల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఫలితంగా వస్త్ర తయారీ ఖర్చు కొంత మేర తగ్గి, మార్కెట్‌లో ఇతర ప్రాంతాల ఉత్పత్తులతో పోటీ పడేందుకు అవకాశం కలుగుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభ దశలో సుమారు 93 వేల చేనేత కుటుంబాలు, 11,488 పవర్‌లూమ్‌ కుటుంబాలు, మొత్తం 1,04,488 కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం ప్రకటించింది. పథకం అమలుకు ఏటా సుమారు రూ.150 కోట్ల మేర ఖర్చు చేయనుంది. అర్హులైన ప్రతి నేత కుటుంబానికి పథకం అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు అర్హుల గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది..ఉచిత విద్యుత్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ఇతర సంక్షేమ, ప్రోత్సాహక కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. 50 ఏళ్లు దాటిన నేత కార్మికుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. చేనేత సహకార సంఘాలకు త్రిఫ్ట్‌ ఫండ్‌ ద్వారా నిధులు, ఆధునిక యంత్రాల కొనుగోలుకు రాయితీలు, ముడిసరుకుపై సబ్సిడీ వంటి చర్యలు కూడా చేపడుతోంది. నేతన్న సేవలో’ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించే విధానం రూపొందించింది. ఉచిత విద్యుత్‌, ఆర్థిక సాయం, పింఛన్‌, ముడిసరుకు సబ్సిడీ వంటి చర్యలు కలిపి చేనేత కుటుంబాలకు కొంత మేర ఆర్థిక భరోసా కల్పించే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో తరతరాలుగా చేనేత వృత్తిని కొనసాగిస్తున్న కుటుంబాలకు విద్యుత్‌ వ్యయం తగ్గడం ఆర్థికంగా కీలకంగా మారనుంది. మగ్గాల నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించేందుకు ఈ పథకం దోహదపడనుంది. ముఖ్యంగా నగరి వంటి ప్రాంతాల్లో విస్తృతంగా ఉన్న పవర్‌లూమ్‌ కార్యకలాపాలకు కూడా ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుంది. ఇప్పటికే ముడిసరుకు ధరలు, మార్కెటింగ్‌ సమస్యలు, వస్త్రాలకు సరైన ధరలు లభించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న నేతన్నలకు విద్యుత్‌ బిల్లుల నుంచి లభించే మినహాయింపు కొంత ఊరటనివ్వనుంది. మొత్తంగా చూస్తే, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఉచిత విద్యుత్‌ పథకం చేనేత కుటుంబాల నెలవారీ వ్యయాన్ని తగ్గించడంతో పాటు మగ్గాల నిర్వహణకు ఆర్థిక వెసులుబాటు కల్పించనుంది. మగ్గానికి ఉచిత విద్యుత్‌, ఉత్పత్తి వ్యయానికి తగ్గింపు, కుటుంబ ఆదాయానికి కొంత అదనపు భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ప్రయోజనంగా మారనుంది. చిత్తూరు జిల్లాలో అర్హులైన ప్రతి చేనేత కుటుంబం, పవర్‌లూమ్‌ యూనిట్‌కు పథకం పూర్తిస్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకుంటే జిల్లాలోని నేత కార్మికులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

*బిల్లుల భారం తగ్గింది*

నగరి మండలం, ఏకాంబర కుప్పం గ్రామానికి చెందిన వేణుగోపాల్ మాట్లాడుతూ... మగ్గాల నిర్వహణకు విద్యుత్‌ ఎంతో కీలకమని, విద్యుత్‌ చార్జీల కారణంగా గతంలో ప్రతి నెలా గణనీయమైన మొత్తాన్ని బిల్లుల రూపంలో చెల్లించాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించడంతో విద్యుత్‌ బిల్లుల భారం గణనీయంగా తగ్గిందని, దీంతో చేనేత వృత్తిని కొనసాగించేందుకు మరింత ప్రోత్సాహం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

*ప్రభుత్వ భరోసాకు ఆనందంగా ఉంది*

 నగిరి మండలం, చింతల పట్టెడ గ్రామానికి చెందిన వెంకటేష్ మాట్లాడుతూ... చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న తమలాంటి కుటుంబాలకు విద్యుత్‌ ఖర్చు తగ్గడం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని, ఆదా అయిన మొత్తాన్ని కుటుంబ అవసరాలకు, చేనేత వృత్తి అభివృద్ధికి వినియోగించుకునే అవకాశం కలుగుతోందని  పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం తమకు భరోసానిస్తోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *