12, సెప్టెంబర్ 2026, శనివారం

మద్యం దుకాణాలపై ఇక నిరంతర నిఘా


మద్యం దుకాణాలపై ఇక నిరంతర నిఘా
నూతన ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో 2026–27 సంవత్సరానికి మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. రెన్యువల్ ఆధారిత విధానంలో ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సులను కొనసాగించడంతో పాటు, మద్యం విక్రయాలపై డిజిటల్ నిఘా, 24 గంటల సీసీ కెమెరాల పర్యవేక్షణ, కృత్రిమ మేధ ఆధారిత పరిశీలన, ధరల నియంత్రణ, నిల్వల డిజిటల్ నమోదు వంటి కఠిన నిబంధనలను అమలు చేయనుంది. రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 579లో ఈ మార్గదర్శకాలను వెల్లడించింది. ఈ విధానం 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,736 రిటైల్ మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి. వీటిలో 3,396 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో ఉండగా, 340 దుకాణాలను గీత కార్మికుల రిజర్వుడ్ కేటగిరీకి కేటాయించారు. ఇప్పటికే ఉన్న దుకాణాల లైసెన్సులను తొలుత ఒక సంవత్సరం పాటు రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. రెన్యువల్ కోసం 2025–26లో అమల్లో ఉన్న వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను, పర్మిట్ రూమ్ రిటైల్ ఎక్సైజ్ పన్ను రేట్లను ప్రాతిపదికగా తీసుకుంటారు. రెన్యువల్ రుసుము వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నులో 38 శాతంగా నిర్ణయించారు. జనాభా ప్రాతిపదికన వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నును ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఓపెన్ కేటగిరీ దుకాణాలకు రూ.60.5 లక్షలు, రిజర్వుడ్ కేటగిరీకి రూ.30.3 లక్షలుగా నిర్ణయించారు. 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో వరుసగా రూ.71.5 లక్షలు, రూ.35.8 లక్షలు, 5 లక్షలకు పైబడిన ప్రాంతాల్లో రూ.93.5 లక్షలు, రూ.46.8 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని లైసెన్సుదారుడి ఎంపిక మేరకు ఒకేసారి లేదా నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించవచ్చు. పర్మిట్ రూమ్‌లకు కూడా ప్రత్యేక రిటైల్ ఎక్సైజ్ పన్నును నిర్ణయించారు. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.5 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు, 5 లక్షలకు పైబడిన ప్రాంతాల్లో రూ.7.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా మూడు సమాన వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. పర్మిట్ రూమ్ లైసెన్సు లేకుండా దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుత దుకాణాలను రెన్యువల్ చేసుకోని పక్షంలో వాటిని లాటరీ విధానంలో కొత్తగా కేటాయిస్తారు. ఇందుకోసం ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుము వసూలు చేస్తారు. ఒక దుకాణానికి కనీసం నాలుగు చెల్లుబాటు అయ్యే దరఖాస్తులు వచ్చినప్పుడే లాటరీ నిర్వహిస్తారు. నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ నిర్వహించకుండా దరఖాస్తు రుసుమును పూర్తిగా తిరిగి చెల్లిస్తారు. కొత్తగా దుకాణం పొందిన వారికి రెన్యువల్ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. మద్యం విక్రయాల్లో ధరల ఉల్లంఘనకు ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. నిర్దేశిత గరిష్ఠ చిల్లర ధరకు విరుద్ధంగా విక్రయించడం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయించడం, బ్రాండ్లను కలపడం లేదా మద్యం పలుచన చేయడం, డిజిటల్ నిల్వల నమోదు వ్యవస్థను నిర్వహించకపోవడం వంటి ఉల్లంఘనలకు మొదటి తప్పిదానికి రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి తప్పిదం జరిగితే ఏడు రోజుల నోటీసు, విచారణకు అవకాశం ఇచ్చిన అనంతరం లైసెన్సును రద్దు చేస్తారు. లైసెన్సు రద్దయిన వారు భవిష్యత్తులో లైసెన్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులవుతారు. మద్యం తయారీ నుంచి వినియోగదారుడికి విక్రయించే వరకు ప్రతి దశను డిజిటల్ విధానంలో పర్యవేక్షించనున్నారు. ఉత్పత్తి, రవాణా, పంపిణీ, దుకాణానికి చేరడం, నిల్వ, రిటైల్ విక్రయం వరకు మొత్తం ప్రక్రియను ట్రాక్ అండ్ ట్రేస్ విధానంలో నమోదు చేస్తారు. ప్రతి బ్యాచ్, పరిమాణం, పంపిణీ, దుకాణానికి చేరిన నిల్వ, విక్రయించిన పరిమాణం, మిగిలిన నిల్వ వివరాలను డిజిటల్‌గా సరిపోల్చి పరిశీలిస్తారు. ప్రతి మద్యం దుకాణంలో నాలుగు సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. కౌంటర్, నిల్వ ప్రాంతం, వినియోగదారుల ప్రాంతం, పర్మిట్ రూమ్‌ను కెమెరాలు కవర్ చేయాలి. ఇవి 24 గంటలూ పనిచేసేలా ఉండాలి. సీసీ కెమెరాల దృశ్యాలను కృత్రిమ మేధ ద్వారా విశ్లేషించి నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తారు. కెమెరాల పనిచేయకుండా ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా లేదా వాటిని తారుమారు చేసినా మొదటి తప్పిదానికి రూ.50 వేల, రెండో తప్పిదానికి రూ.లక్ష జరిమానా, మూడోసారి లైసెన్సు రద్దు చేసేలా నిబంధనలు రూపొందించారు.

కేంద్ర నియంత్రణ కేంద్రంలో సీసీ కెమెరాల దృశ్యాలు, విక్రయ లావాదేవీల వివరాలు, నిల్వ సమాచారం, వినియోగదారుల అభిప్రాయాలు, ఫిర్యాదులను సమీకరించి కృత్రిమ మేధ ఆధారంగా పర్యవేక్షిస్తారు. నిజ సమయ పరిశీలన, హెచ్చరికలు, ప్రత్యేక బృందాల ఏర్పాటు, లక్ష్యిత తనిఖీలకు ఈ వ్యవస్థను వినియోగించనున్నారు. వినియోగదారులకు కూడా ఫిర్యాదు, ధరల పరిశీలనకు అవకాశాలు కల్పించారు. దుకాణం ముందు అందుబాటులో ఉన్న బ్రాండ్ల గరిష్ఠ చిల్లర ధరలను స్పష్టంగా ప్రదర్శించాలి. ప్రతి విక్రయం సమయంలో ధరను ప్రదర్శించడంతో పాటు తెలియజేయాలి. ఫిర్యాదుల కోసం 14405 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. ఎక్సైజ్ సురక్ష యాప్, శాఖ వెబ్‌సైట్ ద్వారా మద్యం అసలుదనాన్ని, వర్తించే గరిష్ఠ చిల్లర ధరను పరిశీలించవచ్చు. ప్రతి దుకాణంలో QR కోడ్ ద్వారా ఫిర్యాదులు, అభిప్రాయాలను నమోదు చేసే సదుపాయం ఉంటుంది. నగదు చెల్లింపులతో పాటు వినియోగదారుల ఎంపిక మేరకు డిజిటల్ చెల్లింపులను కూడా దుకాణాలు స్వీకరించాల్సి ఉంటుంది. మద్యం నాణ్యతను నిర్ధారించేందుకు ప్రాంతీయ ఎక్సైజ్ ప్రయోగశాలల ద్వారా నమూనాలను పరీక్షిస్తారు. తయారీ, మిశ్రమం, బాట్లింగ్, డిపో దశల్లో నమూనాలు సేకరించడంతో పాటు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దుకాణాల్లో అందుబాటులో ఉన్న బ్రాండ్ల నుంచి ప్రతి నెలా యాదృచ్ఛికంగా నమూనాలు సేకరించి పరీక్షించాల్సి ఉంటుంది. అనధికార మద్యం విక్రయ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు, అమలు చర్యల ద్వారా వాటిని గుర్తించి మూసివేయడం, కేసులు నమోదు చేయడం, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లైసెన్సుదారుడు అనధికార విక్రయానికి పాల్పడితే మొదటిసారి రూ.5 లక్షల జరిమానా, రెండోసారి ఏడు రోజుల నోటీసు, విచారణ అనంతరం లైసెన్సు రద్దు చేస్తారు. దుకాణాల ఏర్పాటు విషయంలో విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, జాతీయ రహదారులు తదితర ప్రాంతాలకు ఉన్న దూరాన్ని దుకాణం ప్రవేశ ద్వారం మధ్య బిందువు నుంచి సమీప నడక మార్గం ద్వారా కొలవాలని నిర్ణయించారు. తిరుపతిలోని తిరుపతి రైల్వే స్టేషన్–అలిపిరి మార్గంతో పాటు లీలామహల్–నంది సర్కిల్–అలిపిరి–ఎస్వీఆర్‌ఆర్ ఆసుపత్రి–ఎస్వీఐఎంఎస్ మార్గంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై ప్రత్యేక నిషేధం విధించారు. వాయిదాల్లో వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను చెల్లించే లైసెన్సుదారులు ఒక వాయిదాకు సమానమైన మూడు నెలల పన్ను మొత్తానికి సమానంగా ఎలక్ట్రానిక్ బ్యాంకు గ్యారంటీ సమర్పించాలి. రెన్యువల్ ప్రక్రియ, లాటరీలో పాల్గొనే ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ రిటైలర్ దరఖాస్తు మాడ్యూల్ ద్వారా నిర్వహిస్తారు. ప్రస్తుత లైసెన్సుదారుల రెన్యువల్ ప్రక్రియ రుసుము రూ.5,000 కాగా, కొత్త దుకాణం కోసం దరఖాస్తు ప్రక్రియ రుసుము రూ.1,000గా నిర్ణయించారు. మద్యం సీసాల పునర్వినియోగం కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా, వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఈ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. మొత్తం మీద 2026–27 మద్యం దుకాణాల విధానం కేవలం లైసెన్సుల రెన్యువల్‌కే పరిమితం కాకుండా ఆదాయ పరిరక్షణ, డిజిటల్ పర్యవేక్షణ, ధరల నియంత్రణ, నాణ్యత తనిఖీలు, అనధికార మద్యం విక్రయాల నిరోధం, కఠినమైన లైసెన్సు నిబంధనలకు ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందించారు. 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *