19, సెప్టెంబర్ 2026, శనివారం

రేషన్ బియ్యం తినలేరు సన్న బియ్యం కొనలేరు

రేషన్ బియ్యం తినలేరు సన్న బియ్యం కొనలేరు

మూడు నెలల్లో బస్తా మీద రూ. 500 పెరుగుదల

భారీగా పడిపోయిన బియ్యం వ్యాపారం 

లోకల్ బ్రాండ్లను కొంటున్న హోటల్ యాజమాన్యాలు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

ఒకవైపు రేషన్‌లో ఇచ్చే బియ్యం నాణ్యతపై అసంతృప్తి.. మరోవైపు మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు సామాన్యులకు అందనంతగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. అన్నం వండుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల వ్యవధిలోనే బియ్యం బస్తా ధరలు భారీగా పెరగడంతో నెలవారీ కుటుంబ ఖర్చుల్లో బియ్యానికే అదనంగా వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. రూ.1,000 ఉన్న 25 కిలోల బియ్యం బస్తా ప్రస్తుతం రూ.1,500కు చేరడంతో ఒక్క బస్తాపైనే రూ.500 అదనపు భారం పడుతోంది. క్వింటాల్ బియ్యం ధర కూడా సుమారు రూ.2,000 వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్య కుటుంబాలకు బియ్యం ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. ఇంట్లో నలుగురు సభ్యులున్న కుటుంబం నెలకు రెండు బస్తాల బియ్యం కొనుగోలు చేస్తే మూడు నెలల క్రితంతో పోలిస్తే నెలకు సుమారు రూ.1,000 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. రోజువారీ కూలీపై ఆధారపడే కుటుంబాలకు ఈ అదనపు ఖర్చు చిన్న విషయం కాదు. బియ్యం కొనాలంటే ఇతర ఇంటి అవసరాలను తగ్గించుకోవాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. బుల్లెట్ రైస్, బీబీటీ, ఆరున్నరలు, హెచ్‌ఎంటీ కోలం, నెల్లూరు సన్నాలు, కర్నూలు సన్నాలు వంటి రకాల ధరలు మూడు నెలల క్రితం రూ.1,000 నుంచి రూ.1,300 వరకు ఉండగా ప్రస్తుతం సుమారు రూ.2,000కు చేరినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు వినియోగించే సన్న నూకల ధర కూడా రూ.750 నుంచి రూ.950కు పెరిగిన తరువాత ప్రస్తుతం కొన్ని రకాల బస్తా ధర రూ.2,500 వరకు చేరింది. ఇడ్లీ బియ్యం ధర కూడా బస్తాకు రూ.1,000 నుంచి రూ.1,800కు పెరిగింది. దీంతో ఇంట్లో వంటకే కాకుండా అల్పాహార కేంద్రాలు, చిన్న హోటళ్లపై కూడా భారం పడుతోంది. బియ్యం ధరలు పెరగడానికి రాష్ట్రవ్యాప్తంగా వరి ఉత్పత్తి తగ్గడం, స్థానికంగా సరఫరా తగ్గడం వంటి పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, నీటి లభ్యతలో ఇబ్బందులు కూడా వరి సాగుపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరి సాగు తగ్గుతున్న పరిస్థితి ఉందని, కొందరు రైతులు వరికి బదులుగా ఉద్యాన పంటలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, పత్తి, పొగాకు వంటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాకు మిర్యాలగూడ, నెల్లూరు, కర్నూలు, ఒంగోలు, తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం తదితర ప్రాంతాల నుంచి బియ్యం సరఫరా అవుతోంది. నూకలు గుంటూరు ప్రాంతం నుంచి వస్తున్నాయని వ్యాపారులు తెలిపారు. స్థానికంగా లభించే బియ్యం కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరఫరాపైనే మార్కెట్ ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుండటంతో సరఫరాలో చిన్నపాటి అంతరాయం ఏర్పడినా ధరలపై ప్రభావం పడే పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. బియ్యం ధరలు పెరగడంతో మార్కెట్‌లో కొనుగోళ్లు కూడా తగ్గుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ధర ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తమకు నచ్చిన రకం బియ్యం కొనుగోలు చేయలేక తక్కువ ధరలో దొరికే రకాల వైపు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఒకప్పుడు నెలకు పలుమార్లు బియ్యం కొనుగోలు చేసే కుటుంబాలు కూడా ఖర్చులను లెక్కించుకుని కొనుగోలు చేస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా ధాన్యం లభ్యత తగ్గడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ధాన్యం రాష్ట్రానికి తరలివస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం బీహార్‌లోని పాట్నా, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజుకు 700 నుంచి 1,000 లారీల వరకు ధాన్యం వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. అక్కడి నుంచి వచ్చే ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి మర పట్టించి బియ్యంగా మార్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యంపై రాష్ట్ర మార్కెట్ ఆధారపడుతున్న పరిస్థితి ఏర్పడటం బియ్యం సరఫరా వ్యవస్థలో మార్పును సూచిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. అక్కడ కూడా ధాన్యం లభ్యత తగ్గితే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు సరఫరా కూడా తగ్గితే పరిస్థితి మరింత భారంగా మారుతుందని అంటున్నారు. బియ్యం ధరల పెరుగుదల ప్రభావం ఇంటి వంటింటికే పరిమితం కాలేదు. హోటళ్లు, టిఫిన్‌ కేంద్రాలు, చిన్న భోజనశాలల నిర్వహణపై కూడా పడింది. బియ్యం ధర పెరిగినంత మాత్రాన హోటల్‌లో భోజనం ధరను అదే స్థాయిలో పెంచలేని పరిస్థితి ఉండటంతో యజమానులు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఖరీదైన బ్రాండ్లకు బదులుగా స్థానికంగా లభించే బియ్యం రకాలను కొనుగోలు చేస్తున్నారు. శ్రీకాళహస్తి, నగరి, వరదయ్యపాళెం మండలాల నుంచి వచ్చే నర్మద, బంగారు తీగలు వంటి స్థానిక బ్రాండ్లను హోటల్ యజమానులు కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు తెలిపారు. తక్కువ ధరలో లభించే స్థానిక బ్రాండ్లను ఉపయోగించడం ద్వారా కొంత మేర ఖర్చును నియంత్రించుకోవచ్చని హోటల్ యజమానులు భావిస్తున్నారు. అయినప్పటికీ బియ్యం ధరలు పెరగడంతో వంటగ్యాస్, కూరగాయలు, నూనె తదితర ఇతర ఖర్చులతో కలిపి హోటళ్ల నిర్వహణ కూడా భారంగా మారుతోందని వారు చెబుతున్నారు. బియ్యం ధరలు పెరగడంతో వ్యాపారుల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ధరలు పెరిగితే వ్యాపారం పెరగాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఓ వ్యాపారి తెలిపారు. కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో స్థానికంగా బియ్యం వ్యాపారం సుమారు 70 శాతం వరకు పడిపోయిందని పేర్కొన్నారు. వ్యాపారులు ఎక్కువ ధరకు సరుకు తెచ్చి నిల్వ ఉంచితే అమ్మకాలు మందగించే ప్రమాదం ఉండటంతో పెట్టుబడులు పెట్టేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారని తెలిపారు. మొత్తంగా బియ్యం ధరల పెరుగుదల సామాన్యుల ఇంటి బడ్జెట్‌ను కుదేలు చేస్తోంది. ఒకప్పుడు నెలకు ఎంత బియ్యం అవసరమో అంత కొనుగోలు చేసుకునే కుటుంబాలు ఇప్పుడు ధరను చూసి పరిమాణాన్ని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సన్న బియ్యం తినాలనుకునే వారు ధర చూసి వెనక్కి తగ్గుతున్నారు. రేషన్ బియ్యంతో సరిపెట్టుకోవాలనుకున్నా నాణ్యతపై ఉన్న అసంతృప్తితో చాలామంది ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. దీంతో రేషన్ బియ్యం తినలేరు.. సన్న బియ్యం కొనలేరన్న పరిస్థితి సామాన్య కుటుంబాలను వెంటాడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే బియ్యం డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం, ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి రావడం వల్ల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మార్కెట్‌పై నిరంతర పర్యవేక్షణ చేపట్టి బియ్యం సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడడంతోపాటు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అన్నం ప్రతి కుటుంబానికి నిత్యావసరం కావడంతో బియ్యం ధరల పెరుగుదలను కేవలం మార్కెట్ సమస్యగా కాకుండా సామాన్యుడి ఇంటి పొయ్యిపై పడుతున్న భారంగా చూడాల్సిన అవసరం ఉందని వినియోగదారులు పేర్కొంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *