6, సెప్టెంబర్ 2026, ఆదివారం

మున్సిపల్‌ ఎన్నికలకు కొత్త నిబంధనలు



మున్సిపల్‌ ఎన్నికలకు కొత్త నిబంధనలు

జనరల్‌ అభ్యర్థులకు రూ.5 వేలుడిపాజిట్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500 

నాలుగు సెట్ల నామినేషన్లకే అవకాశం.. 

ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర వెల్లడింపు తప్పనిసరి

ఓటు రద్దు అధికారం ప్రిసైడింగ్ అధికారికి 

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. మున్సిపల్‌ చట్టాల సవరణ చట్టం-2026 అమలుకు ఆమోదం తెలుపుతూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీవో నంబర్‌ 210ను జారీ చేసింది. అదే సమయంలో మేయర్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేస్తూ జీవో నంబర్‌ 211ను విడుదల చేసింది. ఆగస్టు 28వ తేదీ నుంచే మున్సిపల్‌ చట్టాలకు చేసిన సవరణలు రాష్ట్రంలో అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సవరణల ఆధారంగానే రానున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. కొత్త నిబంధనల ప్రకారం మేయర్‌, కార్పొరేటర్‌ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు సమయంలో డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.5,000గా డిపాజిట్‌ నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.2,500గా నిర్ణయించారు. దీంతో రిజర్వ్‌డ్‌ వర్గాలకు చెందిన అభ్యర్థులకు నామినేషన్‌ సమయంలో కొంత వెసులుబాటు కల్పించినట్లయింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో నిర్ణయించిన డిపాజిట్‌ మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఒక అభ్యర్థి ఒక స్థానానికి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను మాత్రమే దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల నిర్వహణను సులభతరం చేయడంతో పాటు అనవసరంగా అధిక సంఖ్యలో నామినేషన్‌ పత్రాలు దాఖలు కాకుండా ఈ పరిమితిని తీసుకొచ్చారు. అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకు సంబంధించిన కీలక వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించాల్సి ఉంటుంది. అభ్యర్థి విద్యార్హత, ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర తదితర వివరాలను అఫిడవిట్‌లో పొందుపరచడం తప్పనిసరి చేశారు. ఈ అఫిడవిట్‌కు నోటరీ ధ్రువీకరణ ఉండాలి. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత, ఆర్థిక, విద్యా నేపథ్యంతో పాటు నేరచరిత్రపై ఓటర్లకు స్పష్టమైన సమాచారం అందే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల వివరాలను తెలుసుకుని ఓటర్లు తమ నిర్ణయం తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కూడా నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు. పోలింగ్‌ సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సందర్భాల్లో సంబంధిత ఓటును రద్దు చేసే అవకాశం కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల్లో క్రమశిక్షణ, ప్రశాంత వాతావరణం ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఓటింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలను నియంత్రించేందుకు ప్రిసైడింగ్‌ అధికారులకు నిబంధనల మేరకు అధికారాలు కల్పించారు. పోలింగ్‌ సమయంలో ఏవైనా అక్రమాలు, పొరపాట్లు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తిస్తే బ్యాలెట్‌ పేపర్‌ను వెనక్కి తీసుకునే అధికారాన్ని ప్రిసైడింగ్‌ అధికారికి అప్పగించారు. పోలింగ్‌ కేంద్రంలో ఏర్పడే పరిస్థితులను పరిశీలించి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అవసరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రిసైడింగ్‌ అధికారికి ఉంటుంది. మేయర్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు ప్రత్యేక ఓటింగ్‌ విధానాన్ని అనుసరించేందుకు కూడా నిబంధనల్లో స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉండగా చిత్తూరు మున్సిపాలిటీలోనూ వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 50 వార్డులను 60 వార్డులుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనాభా, భౌగోళిక పరిస్థితులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. వార్డుల సంఖ్య పెరగడంతో రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య, రాజకీయ సమీకరణాల్లోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కొత్త వార్డుల పరిధి, రిజర్వేషన్లు, ఓటర్ల విభజన తదితర అంశాలపై ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగనుంది. మున్సిపల్‌ చట్టాల సవరణతో పాటు మేయర్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు ఖరారు కావడంతో రానున్న ఎన్నికల ప్రక్రియపై స్పష్టత ఏర్పడింది. నామినేషన్‌ డిపాజిట్‌ నుంచి నామినేషన్‌ పత్రాల పరిమితి వరకు, అభ్యర్థుల అఫిడవిట్‌ నుంచి పోలింగ్‌ కేంద్రాల్లో నిబంధనల అమలు వరకు ప్రభుత్వం పలు అంశాలను నిబంధనల్లో పొందుపరిచింది. మరోవైపు వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా కొనసాగుతుండటంతో స్థానికంగా ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. కొత్త నిబంధనల నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు, అఫిడవిట్‌ సమర్పణ, డిపాజిట్‌ చెల్లింపు తదితర అంశాల్లో నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణను పెంచడంతో పాటు పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. చిత్తూరు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 50 నుంచి 60కి పెరగడంతో స్థానిక రాజకీయ పార్టీల్లోనూ ఎన్నికల కసరత్తు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *