15, సెప్టెంబర్ 2026, మంగళవారం

స్థానిక ఎన్నికలకు ముందే పాఠశాలల్లో ఎన్నికల వేడి!

స్థానిక ఎన్నికలకు ముందే పాఠశాలల్లో ఎన్నికల వేడి!

ఎస్‌ఎంసీ ఎన్నికలకు నగారా.. చిత్తూరు జిల్లాలో 2,091 పాఠశాలల్లో హడావిడి

29న ఎన్నికలు.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్

తల్లిదండ్రులే కీలకం.. పాఠశాల కమిటీలపై రాజకీయ వర్గాల దృష్టి

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వేడివేడిగా చర్చలు జరుగుతున్న వేళ వాటికంటే ముందే పాఠశాలల్లో ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పాఠశాలల నిర్వహణ కమిటీల(ఎస్‌ఎంసీ) పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఎన్నికల నగారా మోగించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మరోమారు ఎన్నికల హడావిడి ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లాలో ఏకంగా 2,091 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎస్‌ఎంసీలను పునర్వ్యవస్థీకరించనున్నారు. సెప్టెంబర్ 29న ఒకేరోజు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాఠశాలల వద్ద తల్లిదండ్రులు, విద్యా వర్గాలతో పాటు స్థానిక రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

చిత్తూరు జిల్లాలో మొత్తం 2,080 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,705 ప్రాథమిక పాఠశాలలు, 40 ప్రాథమికోన్నత పాఠశాలలు, 335 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా 11 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 5 ప్రాథమిక పాఠశాలలు, 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 2,091 పాఠశాలల్లో పాఠశాలల నిర్వహణ కమిటీల పునర్వ్యవస్థీకరణ జరగనుంది.

రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఈ మేరకు సెప్టెంబర్ 15న ఎన్నికల షెడ్యూల్, మార్గదర్శకాలను జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు ఎస్‌ఎంసీ సభ్యులు, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల నోటీసు బోర్డులో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్ 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తుది ఓటర్ల జాబితాను ఖరారు చేసి ప్రదర్శిస్తారు. అసలు ఎన్నికల ఘట్టం సెప్టెంబర్ 29న జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌ఎంసీ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు నూతనంగా ఎన్నికైన ఎస్‌ఎంసీ సభ్యులు చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ్యులు, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు కొత్త ఎస్‌ఎంసీ తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులే కీలకంగా మారనున్నారు. ప్రతి విద్యార్థికి సంబంధించి పాఠశాలలోని ప్రవేశ దరఖాస్తులో నమోదైన తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒక్కరికి మాత్రమే ఎన్నికల్లో పాల్గొనే అర్హత ఉంటుంది. అభ్యర్థులు తమను తాము లేదా అర్హత కలిగిన ఇతర తల్లిదండ్రులను ప్రతిపాదించుకోవచ్చు. అభ్యర్థుల సంఖ్య నిర్ణయించిన స్థానాల కంటే ఎక్కువగా ఉంటే చేతులు ఎత్తడం లేదా వాయిస్ ఓటింగ్ ద్వారా ఎన్నిక నిర్వహించవచ్చు. వివాదం తలెత్తిన సందర్భంలో రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఓటింగ్ నిర్వహించేందుకు నమోదైన తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో కనీసం 50 శాతం మంది హాజరై ఉండాలి.  ఎస్‌ఎంసీల్లో తల్లిదండ్రులకు 75 శాతం ప్రాతినిధ్యం కల్పించనున్నారు. మిగిలిన 25 శాతం ప్రాతినిధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికైన ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక విద్యావేత్తలు, సబ్జెక్టు నిపుణులు, అకాడమిషియన్లు, సీనియర్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అంగన్‌వాడీ, ఆశా, ఏఎన్‌ఎం ప్రతినిధులకు అవకాశం ఉంటుంది. మొత్తం కమిటీలో 50 శాతం మంది మహిళలు ఉండేలా చూడాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులకు కూడా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం కల్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎస్‌ఎంసీ ఎన్నికలు రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతులు, పాఠశాల నిర్వహణలో ఎస్‌ఎంసీలకు కీలక పాత్ర ఉండటంతో ఈ కమిటీల్లో తమకు అనుకూలమైనవారిని గెలిపించేందుకు వివిధ వర్గాలు ప్రయత్నాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామాల్లో చర్చలు సాగుతుండగా తాజాగా పాఠశాల కమిటీల ఎన్నికలు కూడా తోడవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వరుస ఎన్నికల వాతావరణం నెలకొననుంది. ఒకవైపు పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల దృష్టి ఉండగా.. మరోవైపు పాఠశాలల పరిధిలో తల్లిదండ్రులను సమీకరించేందుకు స్థానిక నాయకులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు సామాజికంగా కీలక కేంద్రాలుగా ఉండటంతో ఎస్‌ఎంసీ ఎన్నికలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధికార కూటమి వర్గాలతో పాటు ప్రతిపక్ష రాజకీయ వర్గాలు సైతం తమకు అనుకూలమైన తల్లిదండ్రులను కమిటీల్లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టే అవకాశం ఉందన్న చర్చ జిల్లాలో మొదలైంది. ప్రతి పాఠశాలలో విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు ఎస్‌ఎంసీ ఏర్పాటు చేయాలని, కమిటీ సభ్యుల పదవీకాలం రెండేళ్లుగా ఉండాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పాఠశాలల పాలనలో తల్లిదండ్రులు, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, విద్యా నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.  ఇలా జిల్లాలోని 2,091 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకేసారి ఎస్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పాఠశాలల వద్ద ఎన్నికల సందడి నెలకొననుంది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే గ్రామాల్లో ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చిన ఈ ఎస్‌ఎంసీ ఎన్నికల్లో ఎవరు పట్టు సాధిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *