రూ.1.48 కోట్లతో గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళిక
రూ.1.48 కోట్లతో గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళిక
ఎల్‌నినో ఎఫెక్ట్.. చిత్తూరు జిల్లాలో తీవ్రం అవుతున్న తాగునీటి సమస్య
నీటి ఎద్దడి ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరా
108 ఆవాసాలకు 257 ట్రిప్పులు
18 ఆవాసాలకు టైఅప్ ద్వారా నీటి అందుబాటు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా ప్రణాళికను సిద్ధం చేశారు. ఎండలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఏర్పడే నీటి కొరతను ముందుగానే అంచనా వేసి ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఈ కార్యాచరణను రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 108 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. ఇందుకోసం మొత్తం 257 ట్రిప్పులు నిర్వహించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ట్యాంకర్ల ద్వారా నీటి రవాణాకు రూ.142.34 లక్షల వ్యయం అవసరమవుతుందని ప్రణాళికలో పేర్కొన్నారు. అదనంగా 18 ఆవాసాలకు నీటి వనరులతో టైఅప్ ఏర్పాటు చేసి తాగునీరు అందించేందుకు రూ.6.03 లక్షల వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ రెండు విభాగాలను కలిపి మొత్తం రూ.148.37 లక్షలు, అంటే సుమారు రూ.1.48 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలో వెల్లడించారు.
చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని చిత్తూరు మండలంలో నాలుగు ఆవాసాలకు నాలుగు ట్రిప్పుల ద్వారా నీటి సరఫరాకు రూ.1.28 లక్షలు, గుడిపాల మండలంలో ఒక ఆవాసానికి ఒక ట్రిప్పు ద్వారా నీటి సరఫరాకు రూ.0.36 లక్షలు అవసరమవుతుందని అధికారులు ప్రతిపాదించారు. మొత్తంగా చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఐదు ఆవాసాలకు ఐదు ట్రిప్పులు నిర్వహించేందుకు రూ.1.64 లక్షలు అవసరమవుతాయని అంచనా వేశారు. జి.డి. నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు మండలంలో రెండు ఆవాసాలకు ఆరు ట్రిప్పుల ద్వారా నీటిని తరలించేందుకు రూ.2.39 లక్షలు అవసరమవుతుందని ప్రణాళికలో పేర్కొన్నారు. మరో రెండు ఆవాసాలకు టైఅప్ ద్వారా నీటి సరఫరా చేయడానికి రూ.0.62 లక్షలు అవసరమవుతుందని అంచనా వేశారు. మొత్తంగా జి.డి. నెల్లూరు పరిధిలో రూ.3.01 లక్షల వ్యయం ప్రతిపాదించారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో నీటి ఎద్దడి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ప్రతిపాదనలోని గణాంకాలు సూచిస్తున్నాయి. గుడుపల్లి మండలంలో 15 ఆవాసాలకు 32 ట్రిప్పులు నిర్వహించేందుకు రూ.19.48 లక్షలు, రెండు ఆవాసాలకు టైఅప్ ద్వారా సరఫరా చేసేందుకు రూ.0.74 లక్షలు అవసరమని పేర్కొన్నారు. కుప్పం మండలంలో 23 ఆవాసాలకు 43 ట్రిప్పుల ద్వారా నీటిని అందించేందుకు రూ.20.54 లక్షలు, ఒక ఆవాసానికి టైఅప్ ద్వారా సరఫరా చేసేందుకు రూ.0.48 లక్షలు ప్రతిపాదించారు. రామకుప్పం మండలంలో 13 ఆవాసాలకు 17 ట్రిప్పులు నిర్వహించేందుకు రూ.7.35 లక్షలు, శాంతిపురం మండలంలో 17 ఆవాసాలకు 57 ట్రిప్పుల ద్వారా నీటి సరఫరాకు రూ.38.12 లక్షలు, ఆరు ఆవాసాలకు టైఅప్ ద్వారా సరఫరాకు రూ.1.87 లక్షలు అవసరమని అంచనా వేశారు. కుప్పం నియోజకవర్గం మొత్తంగా 68 ఆవాసాలకు 149 ట్యాంకర్ ట్రిప్పులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ట్యాంకర్ల ద్వారా నీటి రవాణాకు రూ.85.49 లక్షలు, తొమ్మిది ఆవాసాలకు టైఅప్ ద్వారా నీటి సరఫరాకు రూ.3.09 లక్షలు కలిపి మొత్తం రూ.88.58 లక్షల వ్యయం అవసరమవుతుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం ప్రత్యామ్నాయ నీటి సరఫరా ప్రతిపాదనలో కుప్పం నియోజకవర్గానిదే అత్యధిక వాటా కావడం గమనార్హం. పలమనేరు నియోజకవర్గంలోనూ నీటి సమస్యను ఎదుర్కొనేందుకు విస్తృత కార్యాచరణ రూపొందించారు. గంగవరం మండలంలో మూడు ఆవాసాలకు ఎనిమిది ట్రిప్పులు నిర్వహించేందుకు రూ.3.60 లక్షలు, పలమనేరు మండలంలో ఆరు ఆవాసాలకు 18 ట్రిప్పులకు రూ.8.10 లక్షలు, పెద్దపంజాణి మండలంలో ఆరు ఆవాసాలకు 15 ట్రిప్పులకు రూ.6.75 లక్షలు అవసరమవుతాయని ప్రతిపాదించారు. వి.కోట మండలంలో 13 ఆవాసాలకు 45 ట్రిప్పుల ద్వారా నీటిని అందించేందుకు రూ.28.29 లక్షలు, ఏడు ఆవాసాలకు టైఅప్ ద్వారా నీటి సరఫరాకు రూ.2.32 లక్షలు అవసరమని అంచనా వేశారు. పలమనేరు నియోజకవర్గం మొత్తంగా 28 ఆవాసాలకు 86 ట్యాంకర్ ట్రిప్పులు అవసరమవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం రూ.46.74 లక్షలు, ఏడు ఆవాసాలకు టైఅప్ ద్వారా నీటి సరఫరాకు రూ.2.32 లక్షలు కలిపి మొత్తం రూ.49.06 లక్షల వ్యయం అవసరమవుతుందని ప్రతిపాదించారు. పూతలపట్టు నియోజకవర్గంలో పూతలపట్టు మండలంలోని మూడు ఆవాసాలకు ఐదు ట్రిప్పుల ద్వారా నీటి సరఫరాకు రూ.2.59 లక్షలు, తవణంపల్లె మండలంలోని ఒక ఆవాసానికి నాలుగు ట్రిప్పులకు రూ.2.55 లక్షలు, యాదమరి మండలంలోని ఒక ఆవాసానికి రెండు ట్రిప్పులకు రూ.0.94 లక్షలు అవసరమవుతాయని అంచనా వేశారు. మొత్తంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఐదు ఆవాసాలకు 11 ట్యాంకర్ ట్రిప్పులు నిర్వహించేందుకు రూ.6.08 లక్షలు అవసరమవుతుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి వనరులపై పడుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రత్యామ్నాయ ప్రణాళిక ద్వారా అవసరమైన ప్రాంతాలకు నీటిని చేరవేయడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు నిర్దేశించారు. నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి టైఅప్ ద్వారా సరఫరా చేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేందుకు ఈ ప్రణాళికలో ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద రానున్న కాలంలో తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈ కార్యాచరణను సిద్ధం చేసిందని గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ విజయ్ కుమార్ తెలిపారు.

