4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

జిల్లాలో వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు


జిల్లాలో వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు 
భూగర్భ జలాలను తోడేస్తున్న బోర్లు
కొన్ని మండలాల్లో 20 మీటర్లకుపైగా లోతులోకి.. 
మెరుగ్గా రామకుప్పం, పెనుమూరు, పాలసముద్రం 
ప్రమాద స్థితిలో గుడిపల్లి, గంగవరం, రొంపిచర్ల
రీచార్జి పనులు జరుగుతున్నా కనిపించని ఫలితం 


(చిత్తూరు బ్యూరో , ఆంధ్రప్రభ.)

జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి క్రమంగా ఆందోళనకరంగా మారుతోంది. గత ఐదేళ్లలో భూగర్భ జలాల స్థితిలో చోటుచేసుకున్న హెచ్చుతగ్గులు ఒకే దిశలో సాగకపోయినా, దీర్ఘకాలికంగా చూస్తే పలుచోట్ల నీటిమట్టాలు లోతుకు వెళ్లిన పరిస్థితి స్పష్టమవుతోంది. ముఖ్యంగా వ్యవసాయం, తాగునీరు, గ్రామీణ జీవనాధారం బోర్లు, బావులపై ఎక్కువగా ఆధారపడే ప్రాంతాల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర భూగర్భ జల మండలి కూడా చిత్తూరు జిల్లాలో 20 మీటర్లకుపైగా లోతులో నీటిమట్టాలు నమోదయ్యే ప్రాంతాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం జిల్లా భూగర్భ జల శాఖ గణాంకాలు పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి. 2025 ఆగస్టులో జిల్లా సగటు భూగర్భ జల మట్టం భూమి నుంచి 13.68 మీటర్ల లోతులో ఉండగా, 2026 ఆగస్టుకు అది 16.11 మీటర్లకు చేరింది. అంటే ఏడాది వ్యవధిలో సగటున మరో 2.43 మీటర్ల మేర నీటిమట్టం లోతుకు వెళ్లింది. 2025 నవంబరుతో పోలిస్తే ఈ తేడా 7.93 మీటర్లుగా ఉండటం పరిస్థితి ఎంత వేగంగా మారిందో సూచిస్తోంది. 

అయితే జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఒకేలా లేదు. కొన్ని మండలాల్లో నీటిమట్టాలు మెరుగుపడగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీగా లోతుకు వెళ్లాయి. అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి గుడుపల్లెలో కనిపిస్తోంది. 2025 ఆగస్టులో అక్కడ సగటు నీటిమట్టం 31.02 మీటర్ల లోతులో ఉండగా, 2026 ఆగస్టుకు 58.55 మీటర్లకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే 27.53 మీటర్ల మేర లోతుకు వెళ్లింది. గంగవరంలో 8.37 మీటర్లు, రొంపిచర్లలో 7.73 మీటర్లు, వి.కోటలో 7.39 మీటర్లు, నిండ్రలో 5.79 మీటర్లు, పులిచెర్లలో 5.73 మీటర్ల మేర నీటిమట్టం లోతుకు వెళ్లింది. చిత్తూరు అర్బన్‌లోనూ ఏడాదిలో 4.43 మీటర్ల మార్పు నమోదైంది. దీనికి భిన్నంగా రామకుప్పంలో 3.08 మీటర్లు, పెనుమూరులో 1.53 మీటర్లు, పాలసముద్రంలో 0.76 మీటర్ల మేర నీటిమట్టం మెరుగుపడింది. ఈ వ్యత్యాసం జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని కేవలం ఒకే కారణంతో వివరించలేమని చెబుతోంది. భూగర్భ నిర్మాణం, స్థానిక రీచార్జి పరిస్థితులు, బోర్ల సంఖ్య, సాగునీటి వినియోగం, పంటల స్వభావం, ఉపరితల నీటి లభ్యత వంటి అంశాలు మండలాల వారీగా ప్రభావం చూపుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాటి సహజ రీచార్జి కంటే వెలికితీత ఎక్కువ కావడమే. ముఖ్యంగా వ్యవసాయంలో బోర్ల వినియోగం పెరిగిన కొద్దీ భూమిలోకి చేరే నీటి కంటే బయటకు తోడే నీటి పరిమాణం ఎక్కువైతే నీటిమట్టం క్రమంగా దిగజారుతుంది. ఒకసారి నీటిమట్టం లోతుకు వెళ్తే అదే నీటిని పొందేందుకు మరింత లోతైన బోర్లు, అధిక సామర్థ్యం కలిగిన మోటార్లు అవసరమవుతాయి. దీంతో నీటి వినియోగం మరింత పెరిగి ఒక రకమైన దుష్చక్రం ఏర్పడుతుంది.

చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితికి వ్యవసాయంపై ఉన్న ఆధారపడటం మరింత ప్రాధాన్యం కల్పిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో వ్యవసాయం మొత్తం స్థూల జిల్లా విలువ ఆధారిత ఉత్పత్తిలో 36.96 శాతం వాటా కలిగి ఉంది. నీటి లభ్యతలో భూగర్భ జలాల పాత్ర తగ్గితే వ్యవసాయ ఉత్పత్తి, రైతుల ఖర్చులు, పంటల ఎంపికపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు భూగర్భ జలాల రీచార్జి కోసం ప్రభుత్వ శాఖలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఉపాధి హామీ, జలశక్తి అభియాన్, వాటర్‌షెడ్ కార్యక్రమాల కింద చెక్‌డ్యాంలు, నీటి సంరక్షణ నిర్మాణాలు, రీచార్జి బోర్లు, పైకప్పు వర్షపు నీటి సేకరణ వంటి పనులు చేపడుతున్నారు. వాటర్‌షెడ్ కార్యక్రమం కింద జిల్లాలో 2023-24 నుంచి 2026-27 వరకు ఇప్పటివరకు 1,430 నీటి సంరక్షణ నిర్మాణాలు నిర్మించడం లేదా పునరుద్ధరించడం జరిగింది. అయితే నిర్మాణాల సంఖ్య పెరగడం ఒక్కటే భూగర్భ జలాల మెరుగుదలకు ప్రమాణం కాదు. ఆ పనులు పూర్తయిన తర్వాత సంబంధిత ప్రాంతాల్లో బోర్ల నీటిమట్టం ఎంత పెరిగింది, వేసవిలో ఎంతకాలం నీరు నిలిచింది, ఎన్ని బోర్లు ఎండిపోకుండా కాపాడగలిగారు అన్నదే అసలు ఫలితాన్ని కొలిచే ప్రమాణంగా ఉండాలి. ఈ కోణంలో రీచార్జి పనులపై మండలాల వారీగా ప్రభావ అధ్యయనం, నీటి బడ్జెట్, బోర్ల వినియోగంపై పర్యవేక్షణ అవసరమవుతోంది. కేంద్ర భూగర్భ జల మండలి గణాంకాలు కూడా జిల్లాలో దీర్ఘకాలిక ఒత్తిడిని సూచిస్తున్నాయి. 2024 జనవరిలో రాష్ట్రంలోని 5 10 మీటర్ల లోతు నీటిమట్టం ప్రాంతాల్లో చిత్తూరు కూడా గణనీయంగా ఉండగా, 10 20 మీటర్ల లోతు ప్రాంతాలు, 20 మీటర్లకుపైగా లోతు ఉన్న ప్రాంతాలు కూడా జిల్లాలో నమోదయ్యాయి. ఇదే సమయంలో భూగర్భ జలాలపై ఆధారపడే ప్రాంతాల్లో పరిస్థితి మరింత సున్నితంగా మారుతోంది. కుప్పం ప్రాంతానికి సంబంధించిన అధికారిక నివేదికలో సాగునీటిలో 58 శాతం బోర్లు, బావులపై ఆధారపడుతున్నట్లు, 2025 నవంబర్‌లో 15.26 మీటర్లుగా ఉన్న నీటిమట్టం 2026 మే నాటికి 24.17 మీటర్లకు చేరినట్లు నమోదైంది. అంటే నీటిమట్టం లోతుకు వెళ్లేకొద్దీ వ్యవసాయం నిర్వహణ ఖర్చు, బోర్లపై ఆధారపడటం రెండూ పెరిగే ప్రమాదం ఉంది.

జిల్లాకు ఎదురవుతున్న అసలు ముప్పు కేవలం బోర్లు ఎండిపోవడమే కాదు. భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్తే చిన్న రైతులకు కొత్త బోర్లు వేయడం, మోటార్ల సామర్థ్యం పెంచడం, విద్యుత్ వినియోగం పెరగడం వంటి అదనపు భారాలు తప్పవు. తాగునీటి కోసం కూడా భూగర్భ జలాలపై ఆధారపడే గ్రామాల్లో వేసవికాలంలో నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. వ్యవసాయానికి నీటి భరోసా తగ్గితే పంటల వైవిధ్యం, దిగుబడులు, రైతుల ఆదాయంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే జిల్లాలో భూగర్భ జలాల రక్షణకు కేవలం కొత్త బోర్లు, కొత్త రీచార్జి నిర్మాణాలు పరిష్కారం కావు. పడిన ప్రతి నీటి చుక్కను భూమిలోకి పంపే చర్యలతోపాటు, ఎంత నీరు బయటకు తీస్తున్నామన్నదానిపైనా నియంత్రణ అవసరం. ముఖ్యంగా గుడుపల్లె, గంగవరం, రొంపిచెర్ల, వి.కోట, నిండ్ర, పులిచెర్ల వంటి నీటిమట్టాలు వేగంగా లోతుకు వెళ్లిన ప్రాంతాలను ప్రాధాన్య మండలాలుగా గుర్తించి ప్రత్యేక భూగర్భ జల నిర్వహణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. వర్షం కోసం ఎదురుచూడటం కంటే.. భూమిలోకి చేరిన నీటిని కాపాడటం, బోర్ల వినియోగాన్ని శాస్త్రీయంగా నియంత్రించడం, రీచార్జి ప్రాంతాలను సంరక్షించడం, ప్రతి మండలానికి నీటి బడ్జెట్ రూపొందించడం ద్వారా మాత్రమే జిల్లాలో పెరుగుతున్న భూగర్భ జలాల ముప్పును అడ్డుకోవచ్చు. ప్రస్తుత గణాంకాలు అందుకు ఇక ఆలస్యం చేయరాదనే హెచ్చరికను ఇస్తున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *